గవర్నర్‌ నరసింహన్‌ను వెంటనే తొలగించాలి – మర్రి శశిధర్‌రెడ్డి

హైదరాబాద్: తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఎన్నికైన తలసాని శ్రీనివాస యాదవ్ టీఆర్ఎస్ క్యాబినెట్‌లో ఉండటం రాజ్యాంగవిరుద్ధమని తెలంగాణ కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తలసానిని మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించటం, బర్తరఫ్ చేయకపోవటం గవర్నర్ తన విధులను సరిగా నిర్వహించకపోవటమేనంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాసినట్లు శశిధర్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు గవర్నర్ పదవినుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరినట్లు వెల్లడించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించటంలో గవర్నర్ ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆరునెలలలోపు ఎమ్మెల్యేగాగానీ, ఎమ్మెల్యీగాగానీ ఎన్నికవ్వాల్సి ఉందని చెప్పారు. అనర్హతల విషయంలో సుప్రీమ్ కోర్టు తీర్పునుసైతం విస్మరించారని ఆరోపించారు. ఈ విషయాలన్నీ రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నట్లు చెప్పారు. తెరాస అనైతిక చర్యలను గవర్నర్ చూసీ చూడనట్లు వ్యవహరించారని అన్నారు. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా ప్రవర్తించినవారిని ఎవరినీ సహించరాదని చెప్పారు. కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని మర్రి అన్నారు. కేంద్రం స్పందించకుంటే న్యాయపోరాటానికి దిగుతానని మర్రి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com