ప‌బ్‌ల‌పై కేసులు…క్రెడిట్ కోసం చానెళ్ల పోటీ…

అర్ధ‌రాత్రి దాకా తాగుడు, ఊగుడు, డ్యాన్సులు ఒక్కోసారి అదీ చాల‌క తెల్ల‌వార్లూ తాగి తంద‌నాలు… ఇదీ హైద‌రాబాద్ ప‌బ్స్‌లో రొటీన్ వ్య‌వ‌హారం. ఈ న‌గ‌రంలో దాదాపు 70 ప‌బ్స్ దాకా ఉంటాయ‌ని అంచ‌నా. ఇవ‌న్నీ సిటీజ‌నులు, ముఖ్యంగా యూత్‌ని త‌నివితీరా తాగిస్తున్నాయి. మ‌ద్యం దూర‌మై వారికి ఏ మాత్రం గొంతెండి పోకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నాయి. అక్క‌డి దాకా బాగానే ఉంది. అయితే అలా త‌ప్ప‌తాగిన కుర్ర‌”కారు” రోడ్డెక్క‌డ‌మే ర‌హ‌దారుల్ని ర‌క్త‌పు ధార‌లుగా మారుస్తోంది. ఇలాంటి సంఘ‌ట‌నలు చాలా జ‌రిగిన‌ప్ప‌టికీ కొన్ని మాత్రం తీవ్ర సంచ‌ల‌నం క‌లిగించి ఈ ప‌బ్స్‌పై చ‌ర్చ‌కు దారి తీశాయి.

గ‌తంలో ప‌ట్ట‌ప‌గ‌లే టీనేజ్ కుర్రాళ్ల బృందం ఫూటుగా తాగేసి కారుతో చేసిన యాక్సిడెంట్‌లో మ‌రో కారులో ప్ర‌యాణిస్తున్న ఓ కుటుంబం యావ‌త్తూ ఛిన్నాభిన్న‌మైంది. ముఖ్యంగా పాఠ‌శాల విద్యార్ధిని ర‌మ్య ఈ సంఘ‌ట‌న‌లో చనిపోయిన తీరు అంద‌రినీ క‌ల‌చివేసింది. అప్పుడే పోలీసులు ప‌బ్స్‌పై కొంత క‌న్నెర్ర చేశారు. అయితే కొన్ని రోజుల త‌ర్వాత ఆ సంఘ‌ట‌న‌పై మీడియా హ‌డావిడి త‌గ్గ‌డంతో పాటే పోలీసుల క‌న్నెర్ర కూడా త‌గ్గిపోయింది. ఆ త‌ర్వాత మంత్రి నారాయ‌ణ కొడుకు దుర్మ‌ర‌ణం, అదే కోవ‌లో తాజాగా ఒక విద్యార్ధి జూబ్లీహిల్స్ రోడ్‌నెం 45లో యాక్సిడెంట్ చేయ‌డం… దీంతో మ‌ళ్లీ ప‌బ్స్ గురించి ర‌చ్చ మొద‌లైంది.

ఈ నేప‌ధ్యంలోనే గ‌త రెండ్రోజులుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ‌లు ప‌బ్స్ మీద‌ తీవ్ర నిఘా పెంచాయి. మొత్తం 12 ప‌బ్స్ మీద దాదాపు 30కిపైగా కేసులు న‌మోదు చేశాయి. ఇంత వ‌ర‌కూ బాగానే ఉంది. అయితే పోలీసులు తీసుకుంటున్న ఈ చ‌ర్య‌లు త‌మ ఘ‌న‌తేన‌ని చాటుకోవ‌డానికి 2 అగ్ర‌గామి తెలుగు చానెళ్లు పోటీప‌డ‌డ‌మే ఎబ్బెట్టుగా ఉంది. వ్య‌వ‌స్థ‌కు న‌ష్టం చేకూర్చే అంశాల ప‌ట్ల బాధ్య‌తాయుతంగా రిపోర్ట్ చేయ‌డం మీదియా విధి. అంతే త‌ప్ప‌…అందులో నుంచి కూడ స్వ‌ప్ర‌యోజ‌నాలు ఆశించ‌డం ఏమిటో. కొంత కాలం క్రితం ఎన్టీవీ చానెల్ ప‌బ్స్‌పై వ‌రుస క‌ధ‌నాలు ప్ర‌సారం చేసింది. మిగిలిన చానెళ్లు కూడా బాగానే చేసిన‌ప్ప‌టికీ ఎన్టీవీ మ‌రింత శ్ర‌ద్ధ పెట్టింద‌న‌డం నిస్సందేహం. మ‌రోవైపు ఈ పోలీసుల దాడులతో పాటే ప్ర‌త్యేక ప్ర‌సారాలు చేసింది టీవీ9.

ఏదేమైతేనేం… పోలీసులు ప‌బ్స్ మీద చెప్పుకోద‌గ్గ చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే ఈ క్రెడిట్‌ను ద‌క్కించుకోవ‌డానికి ఈ 2 చానెళ్లు… ఇది మా ఎఫెక్ట్ అంటే మా ఎఫెక్ట్ అంటూ బుధ‌వారం పొద్దుటి నుంచి ఏక‌బిగిన ప్ర‌క‌టించుకుంటూ వీక్ష‌కులను అయోమ‌యానికి గురి చేస్తున్నాయి. ఇందులో వీరు ప‌రిశోధించి చేసింది కూడా ఏమీ లేదు. అక్క‌డ మ‌ద్యం ఏరులైపారుతుంద‌ని, అర్ధ‌న‌గ్న నృత్యాల‌నీ, మైన‌ర్ల‌ను కూడా మ‌ద్యం తాగేందుకు అనుమ‌తిస్తున్నారని అంటూ చాలా మందికి తెలిసిన విష‌యాల‌నే చెబుతూ, ఆ ప‌బ్స్‌ను ప‌దే ప‌దే చూపించారంతే. క‌నీసం డ్ర‌గ్స్ వంటి నిషేధిత ప‌దార్ధాల‌ను అక్క‌డ వినియోగిస్తున్నార‌ని బ‌య‌ట పెట్టింది కూడా లేదు. అయిన‌ప్ప‌టికీ పోలీసు-ఎక్సైజ్ దాడుల క్రెడిట్ గురించి ఆరాట‌ప‌డిపోతూండ‌డం విస్మ‌యానికి గురి చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.