ఆ భేటీని టీడీపీ మీడియా ఇలా చూపిస్తోంది!

సంద‌ర్భం ఎలాంటిదైనా దాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం అనేది కొంత‌మందికే చేత‌నైన క‌ళ‌! ఆ విష‌యంలో టీడీపీ అనుకూల మీడియా వ‌ర్గం నైపుణ్యం కాస్త ఎక్కువే. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఉద్దానం బాధితుల స‌మ‌స్య‌పై చ‌ర్చించేందుకు సీఎం ద‌గ్గ‌ర‌కి ప‌వ‌న్ వెళ్లారు. ఓ ర‌కంగా చెప్పాలంటే.. ప్ర‌భుత్వ వైఫ‌ల్యాన్ని వివ‌రించేందుకు ఆయ‌న వెళ్లారు. అయితే, కీల‌క‌మైన భేటీని అధికార పార్టీ అనుకూల మీడియా ప్రెజెంట్ చేసిన తీరు ఇంకోలా ఉంది. చంద్ర‌బాబు చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌ను మెచ్చుకోవ‌డం కోస‌మే ప‌వ‌న్ వెళ్లిన‌ట్టు చిత్రీక‌రించారు. ఉద్దానం స‌మ‌స్య‌పైనే ప్ర‌ధానంగా త‌మ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింద‌ని ప‌వ‌న్ ఓ ప‌క్క చెబితే… ఆ విష‌యాన్ని వీలైనంత చిన్న‌ది చేసి చూపుతూ, కాపుల రిజ‌ర్వేష‌న్లు, పోల‌వ‌రం ప్రాజెక్టు, అమ‌రావ‌తి నిర్మాణం, బెల్టు షాపుల నియంత్ర‌ణ‌… ఇలాంటి విష‌యాల్లో చంద్ర‌బాబు కృషిని ప‌వ‌న్ మెచ్చుకున్న‌ట్టు ఆ వ‌ర్గం మీడియాలో క‌థ‌నాలు ప్ర‌చురించారు.

ప‌వ‌న్ తో తాను ఏయే విష‌యాల‌పై చ‌ర్చించాన‌నేది ముఖ్య‌మంత్రి నేరుగా మీడియాతో చెప్ప‌లేదు. కానీ, ‘విశ్వసనీయ సమాచారం’ పేరుతో ఆ మీడియా వ‌ర్గం క‌థ‌నం ప్ర‌చురించింది. వారికున్న స‌మాచారం నిజ‌మే అయి ఉండొచ్చు, కానీ దాన్ని ఓ మీడియా సంస్థ‌గా ప్ర‌జ‌ల ముందుకు తీసుకెళ్లిన తీరుపైనే ఈ చ‌ర్చ‌. ఆ క‌థ‌నం ప్ర‌కారం… కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై ప‌వ‌న్ తో చంద్ర‌బాబు మాట్లాడుతూ, న్యాయ‌ప‌రంగా ఎలాంటి ఇబ్బందులూ లేని విధంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌ని తాము చూస్తుంటే, ఈ కృషిని గుర్తించ‌కుండా కొంత‌మంది ఉద్య‌మాలు చేయ‌డ‌మేంట‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించార‌ట‌! అంతేకాదు, కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై చంద్ర‌బాబు అనుస‌రిస్తున్న విధాన‌మే స‌రైంద‌ని ప‌వ‌న్ మెచ్చుకున్న‌ట్టు కూడా రాశారు. రాజ‌ధాని నిర్మాణ అంశాన్ని కూడా చంద్ర‌బాబు ప్ర‌స్థావిస్తూ… రాత్రింబ‌వ‌ళ్లు క‌ష్ట‌ప‌డి అమ‌రావ‌తి నిర్మిస్తున్న‌ది త‌న స్వార్థం కోసం కాద‌నీ, కానీ కొంత‌మంది అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ప‌వ‌న్ కు వివ‌రించార‌ట‌. పోల‌వ‌రం పూర్త‌య్యేలోపు రైతులకు నీరివ్వాల‌ని ప‌ట్టిసీమ చేప‌డితే దానిపై కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని చంద్ర‌బాబు ఆవేద‌న వ్య‌క్తం చేశార‌ట‌. వీటితోపాటు బెల్టు షాపుల‌ను తొల‌గించిన తీరు, ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్న విధానంపై ప‌వ‌న్ తో చంద్ర‌బాబు చ‌ర్చించిన‌ట్టు క‌థ‌నంలో గుప్పించారు.

ఇంత‌కీ, చంద్ర‌బాబు ను క‌లిసేందుకు ప‌వ‌న్ ఎందుకెళ్లారంటే… కాపుల రిజ‌ర్వేష‌న్ల విష‌య‌మై సీఎం చేస్తున్న కృషిని మెచ్చుకోవ‌డానికీ, పోల‌వ‌రంపై అన‌వ‌స‌ర రాద్ధాంతం చేస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీ తీరుతెన్నులు తెలుసుకోవ‌డానికీ, రాజ‌ధాని నిర్మాణం కోసం ముఖ్య‌మంత్రి నిద్ర‌మానేసి ప‌నిచేస్తున్నార‌ని అర్థం చేసుకోవ‌డానికీ.. కేంద్రం అర‌కొర‌గా సాయం చేస్తున్నా, రాజీప‌డ‌ని చంద్ర‌బాబు పోరాట ప‌టిమ గురించి విన‌డానికి..! అధికార పార్టీ అనుకూల మీడియా క‌థ‌నాల సారాంశం ఇలానే అనిపిస్తోంది. ఆ క‌థ‌నం చ‌దివితే ఇదే అభిప్రాయం క‌లుగుతుంది. మొత్తానికి, ఉద్దానం స‌మ‌స్య శాశ్వ‌త ప‌రిష్కారం కోసం సీఎం ద‌గ్గ‌ర‌కి ప‌వ‌న్ వెళ్తే… దాని తీవ్ర‌త‌ను త‌గ్గించేసి ఇలా ఆవిష్క‌రించారు! ప‌వ‌న్ – చంద్ర‌బాబు భేటీని ఈ విధంగా ప్ర‌జ‌ల‌కు చూపిస్తున్నారు. మ‌రి, ఈ ఆవిష్క‌ర‌ణ నైపుణ్యాల‌ను ప‌వ‌న్ గుర్తిస్తారో లేదో..! దీన్ని ఏ త‌ర‌హా పాత్రికేయం అని అభివ‌ర్ణించాలో..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com