మేక‌పాటి అసంతృప్తి వెన‌క అస‌లు కార‌ణం ఇదా..!

మేక‌పాటి రాజమోహ‌న్ రెడ్డి… వైకాపా పార్ల‌మెంటు స‌భ్యులు, సీనియ‌ర్ నాయ‌కుడు. ప్ర‌స్తుతం వైకాపా తీసుకుంటున్న నిర్ణ‌యాలు, ఆ పార్టీ చేస్తున్న హ‌డావుడిపై ఆయ‌న అసంతృప్తిగా ఉన్న‌ట్టు స‌మాచారం. పార్ల‌మెంటు స‌మావేశాలు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డితే… వెంట‌నే రాజీనామాలు చేసేయ‌డానికి వైకాపా ఎంపీలు సిద్ధంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, రాజీనామాలు చేసి ప్ర‌జ‌ల‌కు ఎలాంటి సంకేతాలు ఇస్తామ‌నీ, స‌భ్యులుగా కొన‌సాగితేనే బాగుంటుంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డుతున్నార‌ట‌. అంతేకాదు, ఎంపీల రాజీనామాల విష‌య‌మై జ‌గ‌న్ స‌మ‌క్షంలో జ‌రిగిన స‌మావేశంలో కూడా ఆయ‌న ఇదే అభిప్రాయాన్ని చెప్పినా దానికి ప్రాధాన్య‌త‌ల ల‌భించ‌లేద‌ని స‌మాచారం. జ‌గ‌న్‌, విజ‌యసాయిరెడ్డిలు క‌లిసి మేక‌పాటి మాట‌ల‌ను కొట్టి పారేశార‌ని అంటున్నారు.

వైకాపా ఎంపీలంద‌రూ రాజీనామాలు చేస్తారుగానీ, రాజ్య‌స‌భ స‌భ్యుడైన విజ‌య‌సాయిరెడ్డి రాజీనామా చేసేందుకు సిద్ధంగా లేరన్న సంగ‌తి తెలిసిందే. దీనిపై కూడా మేక‌పాటి గుర్రుగా ఉన్నార‌ట‌. అంద‌రూ రాజీనామాలు చేసేస్తే.. వైకాపా రాజ‌కీయ‌మంతా త‌న గుప్పిట్లోకి తెచ్చుకోవాలన్నదే విజ‌య‌సాయి వ్యూహం అనే అభిప్రాయం కూడా మేక‌పాటికి ఉంద‌ట‌. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీకి ఒంగిఒంగి దండాలు పెట్ట‌డం, భాజ‌పాతో గ‌తంలో ఎన్న‌డూ లేనంతగా రాసుకుని పూసుకోవ‌డం కూడా మేక‌పాటికి నచ్చడం లేదని చెబుతున్నారు. రాష్ట్రంలో తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర్కొంటున్న భాజ‌పాకు వైకాపా ద‌గ్గ‌రౌతున్న సంకేతాలు ప్ర‌జ‌లకు ఇవ్వ‌డం స‌రికాద‌నేది ఆయ‌న అభిప్రాయమట. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌పై పోరాటం అంటూ, భాజ‌పాతో స్నేహం కోసం అతిగా అర్రులు చాచ‌డం ద్వారా రాజ‌కీయంగా వైకాపాకి క‌లిసి వ‌చ్చేది ఏమీ ఉండ‌ద‌ని మేక‌పాటి చెబుతూ ఉన్నా… పార్టీలో కొంత‌మంది వాటిని సీరియ‌స్ గా తీసుకోవ‌డం లేద‌నే అసంతృప్తితో ఆయ‌న ఉన్నార‌ట‌.

నిజానికి, ఒక‌ప్పుడు ఢిల్లీలో వైకాపా అంటే మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి గుర్తొచ్చేవారు. ఇత‌ర పార్టీల‌తో ఆయ‌నే బాగా ట‌చ్ లో ఉండేవారు. కానీ, ఈ మ‌ధ్య అనూహ్యంగా విజ‌య‌సాయి అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తుండ‌టంతో… అంతా తానే అన్న‌ట్టు బిల్డ‌ప్ ఇస్తున్నారు. ఢిల్లీలో చురుగ్గా ఉండే మేకపాటిని ఉద్దేశ‌పూర్వంగానే విజ‌య‌సాయి పక్కకునెట్టే ప్రయత్నం చేశార‌నే గుస‌గుస‌లు పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయ‌ని. అంతేకాదు, ఇదే స‌మ‌యంలో మేకాపాటి అవుట్ డేటెడ్ అనే ముద్ర‌ను పార్టీ వ‌ర్గాల్లోనే కొంత‌మంది వేసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట‌. దీంతో తాజా ప‌రిణామాల‌న్నింటిపైనా ఆయ‌న కాస్త అసంతృప్తిగా ఉన్నార‌నే చ‌ర్చ వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.