మంత్రిగారి శ్ర‌ద్ధంతా నెల్లూరు మీదే..!

ఒక శాఖ‌కు రాష్ట్ర మంత్రి అంటే ఆయ‌న రాష్ట్రం మొత్తానికి మంత్రి అనే క‌దా అర్థం! కానీ, ఈ మ‌ధ్య ఆ మంత్రిగారు మాత్రం త‌న స‌ర్వ‌శ‌క్తులూ ఒక్క చోటే కేంద్రీకృతం చేస్తున్న‌ట్టున్నారు. ఆయ‌న మ‌రెవ్వ‌రో కాదు.. మంత్రి నారాయ‌ణ‌! రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ నెల్లూరు జిల్లాలో ఆకస్మిక త‌న‌ఖీలు నిర్వ‌హించారు. పండుగ పూట ఆయ‌న నాయుడు పేట‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేశారు. బజార్ వీధి, ఆర్కే సెంట‌ర్‌, టౌన్ బ‌స్టాండ్ సంద‌ర్శించారు. అక్క‌డి మురుగునీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌ను ప‌రిశీలించారు. ఆ త‌రువాత‌, మీడియాతో మాట్లాడుతూ అధికారుల‌కు దిశానిర్ధేశం కూడా చేశారు! ప్ర‌తీ అధికారీ ఎంతో బాధ్య‌తాయుతంగా ప‌నిచేయాల‌నీ, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండాల‌నీ, ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు అంద‌రికీ చేరువ‌య్యే విధంగా ప‌నిచేయాల‌ని మంత్రి నారాయ‌ణ చెప్పారు. ఆ త‌రువాత‌, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త గురించి కూడా మాట్లాడారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తున్న అంశం ప‌రిశుభ్ర‌త అని చెప్పారు. ప్ర‌తీ ఇంట్లో మ‌రుగుదొడ్డి నిర్మించుకునేలా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌న్నారు.

అంతా బాగానే ఉంది కానీ.. ఈ మ‌ధ్య మంత్రిగారి శ్ర‌ద్ధంతా నెల్లూరు చుట్టూనే తిరుగుతోంది. కొద్దిరోజుల కింద‌టే నెల్లూరు ప‌ట్ట‌ణంలో ప‌ర్య‌టించి, ప్ర‌జ‌ల బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు, శాఖాప‌రంగా కూడా నెల్లూరు నుంచి వ‌స్తున్న ఫిర్యాదులూ అర్జీల విష‌యంలో చాలా చురుగ్గా స్పందిస్తున్నార‌నే టాక్ కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ఇంత‌కీ, ఆయ‌న‌కి నెల్లూరుపై ఇంత శ్ర‌ద్ధ ఎందుకు పెరిగిపోయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న ఈ జిల్లా నుంచి ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్నార‌ట క‌దా! 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లోకి రావాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందుకే, ఇప్ప‌ట్నుంచీ ఆ విధంగా ముందుకు పోతున్నార‌న్నమాట‌!

స‌రే, ఎలాగూ ఆయ‌న ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల‌కు సిద్ధం అవుతున్నారు కాబ‌ట్టి… నెల్లూరుపై శ్ర‌ద్ధ పెంచ‌డాన్ని పెద్ద‌గా త‌ప్పుబ‌ట్ట‌లేం. అదొక రాజ‌కీయ అవ‌స‌రంగా చూడొచ్చు. ప్ర‌జ‌ల అభిమానం చూర‌గొనాలి, అంద‌రికీ అందుబాటులో ఉంటున్నాను అనే భ‌రోసా క‌ల్పించుకోవాలి… ఇలాంటివి చాలా ఉంటాయి. కాక‌పోతే, ఒక శాఖ‌కు మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తూన్న‌ప్పుడు ఒక ప్రాంతం పట్ల ఎక్కువ శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తున్న‌ట్టుగా, ఆ ప్రాంతానికి సంబంధించిన స‌మస్య‌ల‌పైనే స‌త్వ‌ర‌మే స్పందిస్తున్న‌ట్టు ఆయ‌న చ‌ర్య‌లు ఉండ‌టం అనేవి కాస్త ప్ర‌త్యేకంగా క‌నిపిస్తాయి క‌దా! తాను పోటీ చేయాల‌నుకునే ప్రాంతంపై మ‌రీ అంత ప్ర‌త్యేకాభిమానం ఉన్న‌ట్టుగా సంకేతాలు ఇవ్వ‌డం స‌రైంది కాద‌నే అభిప్రాయం కొంత‌మందిలో వ్య‌క్త‌మౌతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల‌పైనా అన్ని ప్రాంతాల‌పైనా అంద‌రి స‌మ‌స్య‌ల‌పైనా స‌మ‌దృష్టి ఉన్న‌ట్టు క‌నిపించాలి క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.