రాజకీయం, రాజకీయం, రాజకీయం….మన నాయకుల బ్రతుకులన్నీ ఈ రాజకీయం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. పుట్టుక నుంచి చావుల వరకూ ప్రతి విషయాన్నీ రాజకీయ లాభాల కోసం వాడేసుకోవడంలో మన నాయకుల తర్వాతే ఎవ్వరైనా. ‘రాజకీయం’ అంటే డిక్షనరీల్లోనే, వేరే దేశాల్లోనూ ఉన్న అర్థం ఏంటో తెలియదు కానీ మన నాయకులు మాత్రం విలువలు లేని ‘వ్యభిచారం’ అన్న పదానికి సమాన అర్థమో…. లేకపోతే అంతకంటే తక్కువ అర్థమో స్ఫురించే స్థాయికి రాజకీయం అన్న పదాన్ని దిగజార్చారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుంచీ మన నాయకుల్లో తొంభై శాతం మంది సాధించిన విజయం ఇదే. ఇప్పుడు మోడీ, చంద్రబాబుల రాజకీయం మరీ పీక్స్‌కి వెళ్ళిపోతోంది.
2014లో ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఇదే నరేంద్రమోడీ, చంద్రబాబుల హీరోయిజం మామూలుగా లేదు. ప్రపంచంలోనే ఇండియాని నంబర్ ఒన్‌గా నిలబెట్టగల సమర్థుడిని, వీరుడిని, హీరోని నేను అని మోడీ చెప్పుకున్నాడు. విభజనతో సర్వం కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్, జపాన్ల రేంజ్‌కి తీసుకెళ్ళే మగధీరుడిని, బాహుబలిని నేను అని చంద్రబాబు చెప్పుకొన్నాడు. ఇదే రీతిలో ఒకళ్ళ గురించి ఒకళ్ళు కూడా బాగానే డప్పు కొట్టుకున్నారు. ఇక వందిమాగధులు, పార్టీ నాయకులు, అనుకూల మీడియా చేసిన భజన గురించి ప్రత్యేకంగా చెప్పాలా? ఆ హీరోయిజం నచ్చే జనాలు కూడా ఓట్లేశారు. ఇద్దరి పదవీ కాలం కూడా దాదాపు సగం అయిపోయినట్టే. కానీ ఇద్దరూ ఏం చేస్తున్నారు? ఏం చేశారు? అంటే సమాధానాలు మాత్రం గొప్పగా కనిపించడం లేదు. ప్రజలను కష్టాల పాలు చేసే పనులు మాత్రం చాలానే చేసేస్తున్నారు. అభివృద్ధి విషయం ఎలా ఉన్నా సోనియా గాంధీ హయాంలో జరిగిన కుంభకోణాల డబ్బును మొత్తం కక్కిస్తాం అన్న మోడీ ఇప్పటి వరకూ ఒక్క రూపాయిని కూడా స్వాధీనం చేసుకోలేకపోయాడు. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి తిన్న లక్ష కోట్ల రూపాయలతోనే రుణమాఫీతో సహా తాను ఇచ్చిన అన్ని హామీలు పూర్తి చేస్తానన్న చంద్రబాబు కంప్లీట్‌గా ఫెయిల్ అయ్యాడు. పైగా తానే ఓటుకు నోటు కేసులతో గిలగిలలాడిపోతున్నాడు.
ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోందన్న విషయం మాత్రం మోడీ, చంద్రబాబులిద్దరికీ కూడా ఎప్పటికప్పుడూ తెలుస్తూ ఉన్నట్టుగానే ఉంది. అందుకే ఆ ఫెయిల్యూర్ పాపాన్ని ప్రతిపక్షాల ఖాతాలో వేసే పనిలో ఇద్దరూ కూడా బిజీగా ఉన్నారు. చట్టసభల్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వడంలేదని ప్రతిపక్షాలు వాపోవడం సర్వసాధారణం. అది వాస్తవం కూడా. ఎందుకంటే తటస్థంగా వ్యవహరించే స్పీకర్లు ఇప్పుడు ఎవ్వరూ లేరు. అందరూ కూడా అధికార పార్టీ నాయకుల్లా ప్రవర్తించే బాపతే. అలాంటి నేపథ్యంలో 400మంది కంటే పైబడిన సంఖ్యలో ఎంపిలున్న నరేంద్రమోడీని పార్లమెంట్లో మాట్లాడనీయకుండా అడ్డుకునే దమ్మున్న హీరో ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నారా? రాజకీయ ఓనమాలు కూడా ఒంటబట్టక అల్లాడుతున్న రాహుల్ గాంధీని నమ్ముకున్న ప్రతిపక్షాలకు అంత సీన్ ఉందా? కానీ మోడీ వారు మాత్రం తనను మాట్లాడనీయడం లేదని చెప్పి ప్రజల ముందుకు వచ్చి డ్రామాలు ఆడేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులందరూ కూడా పనికిరాని వాళ్ళు, అసమర్థులు అని మోడీతో సహా బిజెపి నాయకులందరూ కూడా విమర్శల వర్షం కురిపిస్తూ ఉంటారు. మరి అంతటి చేతగాని వాళ్ళు, అసమర్థుల చేతిలో కూడా ఓడిపోతున్నాడంటే, ఆ ఓటమిని ప్రజాసభల్లోనే దీనంగా ఒప్పుకుంటూ సానుభూతి రాజకీయాలు చేస్తున్నాడంటే శ్రీ మోడీ వారు హీరోనా? జీరోనా?
ఇక చంద్రబాబు కథ కూడా సేం టు సేం. పదుల కొద్దీ సంఖ్యలో అవినీతి కేసుల్లో ఇరుక్కుని ఉన్న జగన్‌ని ఏదో చేసేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు…జగన్‌ని ఏమీ చేయలేకపోతున్నాడు కానీ జగన్ మాత్రం చంద్రబాబు చేసే ప్రతి పనినీ అడ్డకుంటున్నాడు. ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్లతో సహా అన్నివిషయాల్లోనూ జగనే అడ్డుపడుతున్నాడని జాలి అరుపులు అరుస్తున్నారు టిడిపి నాయకులు. జగన్‌ని ఏమీ చేయలేకే పది వేల కోట్ల రూపాయల నల్లధనం ఇష్యూని కూడా జగన్ అకౌంట్లో వేసే ప్రయత్నాలు చేశారు. అది కాస్తా బెడిసికొట్టింది. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం జగన్‌పైన ఉన్న మిగిలిన ఆరోపణలు కూడా ఫేక్ ఏమో అన్న అనుమానాలు ప్రజల్లో కలిగే అవకాశం ఉంది. జగన్‌కి అనుభవం లేదు, అవినీతి పరుడు, ఆలోచన లేదు, చిన్న పిల్లాడు..అంటూ అనునిత్యం ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉండే టిడిపి నాయకులు పోలవరం, రాజధాని నిర్మాణం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలాంటి వాటిని జగన్‌లాంటి అర్హత, అనుభవం, అవగాహన, ఆలోచన లేని నాయకుడు ఎలా అడ్డుకోగలడు? ఎలా అడ్డుకుంటున్నాడు అనే వివరాలు చెప్పగలరా? అది కూడా ప్రపంచానికే పాఠాలు చెప్పిన అత్యంత అనుభవజ్ఙుడైన చంద్రబాబు వ్యూహాలను అడ్డకునే సామర్థ్యం జగన్‌కి ఉందా? ఎన్నికల సమయంలో చంద్రబాబు హీరోయిజం చూపించి ఓట్లు అడిగిన టిడిపి నాయకులు ఇప్పుడు ప్రతి విషయంలోనూ జగన్ నామ స్మరణ చేస్తూ ఉంటే మాత్రం చివరికి జగనే హీరో అయిపోయే ప్రమాదం ఉంది. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు సోనియాను, జగన్‌లను జైలుకు పంపిస్తాం అని శపథాలు చేస్తూ హీరోయిజం చూపించిన నరేంద్రమోడీ, బాబులు ఇప్పుడిలా డీలా పడిపోవడం మాత్రం వాళ్ళ హీరోయిజాన్ని అస్తమానం పొగుడుతూ ఉండే భక్తజనులకైనా నచ్చుతుందో లేదో మరి.