మోదీ ఎఫ్ డి ఐ దూకుడుపై – స్వదేశీ జాగరణ్ మంచ్ అభ్యంతరం!

పదిహేను కీలక రంగాలకు సంబంధించిన ఎఫ్‌డీఐ (ఫారిన్ డైరక్టు ఇన్వెస్ట్ మెంటు) నియమాలను సరళీకరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడంపై స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎం) కూడా అభ్యంతరం చెబుతోంది.

ఎఫ్ డి ఐ లను అనుమతించినందుకు ఎన్ని అభ్యంతరాలు వస్తున్నాయో, నరేంద్రమోదీ వాటిని అనుమతించిన తీరుకు అంతకు మించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీహార్ ఫలితాలు చూసైనా మోదీ సంస్కరణల వేగాన్ని పునరాలోచించుకుంటారని రాజకీయపార్టీలు అంచనా వేశాయి. అందుకు భిన్నంగా ఆయన బ్రిటన్ పర్యటనకు ముందే ఎఫ్ డి ఐ ల్లో సవరణలను అనుమతులను ప్రభుత్వం ప్రకటించింది. 26 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలన్న ప్రజాస్వామిక ధర్మాన్ని, కనీసం కేబినెట్ సహచరులతో చర్చించాలన్న మర్యాదను కూడా పక్కన పెట్టేసి విదేశీ కార్పొరేట్ల ను సంతోషపరడానికి రాత్రికి రాత్రే ఉత్తర్వులు జారీ చేయించిన మోదీ దూకుడుని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ – ఆర్ ఎస్ ఎస్ కు అనుబంధ సంస్ధ. ఎఫ్‌డీఐ లపై కేంద్రం తొందరపాటు ప్రదర్శిస్తోందని, ప్రస్తుతానికి దీనిని ఆపాలని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ సూచించింది.

ఎఫ్‌డీఐ లాభనష్టాలను వాటివల్ల ప్రభావితమయ్యే వారికి ముందుగా వివరించాలని, ఈ అంశాన్ని పరిశీలించేందుకు స్టేక్‌హోల్డర్లతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌జేఎం డిమాండు చేసింది. కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్‌ ఇండియా’, ‘మేడ్‌ బై ఇండియా’గా ఉండాలని సూచించింది. ఎఫ్‌డీఐ నియమాల సరళీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగే లాభనష్టాలను అంచనా వేయండా కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని, దీనిని సక్రమంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అందుకు స్టేక్‌హోల్డర్లతో కూడిన కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఎస్‌జేఎం అలిండియా కోకన్వీనర్‌ అశ్విని మహరాజ్‌ వ్యాఖ్యానించారు. అన్నారు.

గత యూపీఏ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కూడా అనుసరించటం బాధాకరమన్నారు. ఇంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ మరో అనుబంధ సంస్థ భారతీయ మజ్దూర్‌ సంఘ్ కూడా దీనిని వ్యతిరేకించింది. విదేశీ విధానాలను వదిలిపెట్టి అభివద్ధికి భారతీయ నమూనాను రూపొందించకోవాలని బిజెపికి సమన్వయ సమీక్షలో ఆర్ ఎస్ ఎస్ ఇప్పటికే సూచించింది.

ఇలా వుండగా సంస్కరణల ఫలితాలు మరో ఏడాదికి గాని కనిపించవని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ అంటున్నారు. వ్యాపార నిర్వహణలో భారత్‌ ర్యాంకింగ్‌ 12 స్థానాలు మెరుగుపడినప్పటికీ తాము చేపట్టిన సంస్కరణల ఫలితాలను అది ప్రతిఫలించ లేదని వచ్చే ఏడాది నాటికి వాటి ప్రభావం తెలుస్తుందని ఆయన చెప్పారు. ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో వ్యాపారం నిర్వహణలో భారత్‌ ర్యాంక్‌ 130కి మెరుగుపడింది. ప్రస్తుతం మెరుగుపడిన 12 ర్యాంకులు తాము తీసుకువచ్చిన సంస్కరణలను పూర్తి స్థాయిలో ప్రతిబింబించడం లేదని చెప్పారు. జూన్‌ 1 వరకే ఈ ర్యాంకింగ్‌లు ఇచ్చారని, కానీ తాము తీసుకున్న కొన్ని చర్యలు విజయవంతం కావడానికి సమయం పడుతుందని, వచ్చే ఏడాది ఈ ర్యాంక్‌ మరింత మెరుగుపడుతుందని వివరించారు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com