మీరు వెళ్లాలనుకున్న చోటికి కాంగ్రెస్‌లో వెళ్లలేరు.. మాతో చేతులు కలపండి అంటూ హైదరాబాద్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డికి మోదీ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సంచలనంగామారింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంధించిన ఈ వ్యాఖ్యలు కేవలం సాదాసీదా ఆహ్వానం కాదు.. ఇది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ హైకమాండ్‌లో సందేహపు బీజాలు నాటే టైం బాంబ్. రేవంత్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ఏబీవీపీ ద్వారా ప్రారంభించినందున ఆయనకు బీజేపీ సిద్ధాంతాలు కొత్తవేమీ కావు. సరిగ్గా ఇదే అంశాన్ని గుర్తు చేస్తూ, కాంగ్రెస్‌లో ప్రతిభకు తగిన గుర్తింపు లభించదని, వారసత్వ రాజకీయాల మధ్య రేవంత్ వంటి నేతలకు గ్లాస్ సీలింగ్ ఉంటుందని మోదీ పరోక్షంగా హెచ్చరించారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ నుంచి జ్యోతిరాదిత్య సింధియా వరకు ఎందరో కాంగ్రెస్ నేతలు బీజేపీలోకి వచ్చి అత్యున్నత పదవులు అలంకరించిన ఉదాహరణలను మోదీ ఈ ఆఫర్ ద్వారా గుర్తుచేశారు.
కాంగ్రెస్ వేసే తప్పటడుగుపైనే మోదీ కన్ను
మోదీ వ్యాఖ్యల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్నదే ఇప్పుడు అసలు ఉత్కంఠ. కాంగ్రెస్ సంస్కృతిలో సాధారణంగా సొంత నేతలపైనే నిఘా ఉంచడం, ఫిర్యాదులను ప్రోత్సహించడం ఎక్కువ. ఇప్పుడు మోదీ ఆఫర్‌ను అడ్డం పెట్టుకుని, రేవంత్ వ్యతిరేకులు ఢిల్లీ వేదికగా ఆయనపై ఫిర్యాదుల పర్వం మొదలుపెడితే, మోదీ పన్నిన ట్రాప్ పారినట్లే అవుతుంది. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం రేవంత్‌ను అనుమానించి దూరం చేసుకోవడం ప్రారంభిస్తే, ఆ నిరాశే రేవంత్‌ను బీజేపీ వైపు అడుగులు వేయించేలా చేస్తుందని కమలనాథుల లెక్క. మిత్రుడిలా నటిస్తూనే ప్రత్యర్థి పార్టీలో చిచ్చు పెట్టే ఈ వ్యూహం మోదీ మార్కు రాజకీయానికి పరాకాష్ట.
రేవంత్ ముందున్న సవాల్
రేవంత్ రెడ్డి ఇప్పుడు అత్యంత క్లిష్టమైన రాజకీయ సంధి కాలంలో ఉన్నారు. అటు రాష్ట్ర ప్రయోజనాల కోసం మోదీతో సఖ్యతగా ఉండాలి, ఇటు కాంగ్రెస్ హైకమాండ్ వద్ద తన విధేయతను నిరూపించుకోవాలి. మోదీ ఆఫర్ ద్వారా రేవంత్‌ను ఒక రకంగా పొలిటికల్ ఐసోలేషన్ లోకి నెట్టే ప్రయత్నం జరిగింది. అంటే, ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా, ఎప్పుడూ ఒక అనుమానిత నేత గానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అయితే రేవంత్ తన రాజకీయ చాణక్యంతో దీన్ని ఎలా తిప్పికొడతారన్నది ఆసక్తికరం. సిద్ధాంతాల కంటే అధికారం – ఫలితాల కు ప్రాధాన్యత ఇచ్చే నేతగా పేరున్న రేవంత్, కాంగ్రెస్ తనను ఇబ్బంది పెడుతుందని భావిస్తే బీజేపీ ఆప్షన్‌ను సీరియస్‌గా తీసుకునే అవకాశం లేకపోలేదు.
తెలంగాణలో మారనున్న సమీకరణాలు
మోదీ వ్యాఖ్యలు తెలంగాణ బీజేపీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఒకవేళ రేవంత్ నేరుగా బీజేపీలోకి రాకపోయినా, ఆయన చుట్టూ ఒక అనిశ్చితిని సృష్టించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలహీనపరచవచ్చని మోదీ భావిస్తున్నారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ అంతర్గత విభేదాలను పెంచి, వచ్చే ఎన్నికల నాటికి బీజేపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. మోదీ విసిరిన ఈ చిన్న పాచిక తెలంగాణ రాజకీయ చదరంగంలో ఎవరిని ఎక్కడ నిలబెడుతుందో చూడాలి. ఒకవేళ రేవంత్ నిజంగానే బీజేపీ గూటికి చేరితే, అది దక్షిణాదిలో కాంగ్రెస్‌కు కోలుకోలేని దెబ్బ కానుంది.
