నోట్ల ర‌ద్దుకు రాజ‌కీయ రంగులేస్తున్న మోడీ..!

పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకుని ఏడాది కావొస్తోంది. ఈ నిర్ణ‌యంతో ఏం సాధించార‌నేది మోడీ స‌ర్కారు ఇంకా చెప్ప‌లేక‌పోతోంది. అనాలోచితంగా తీసుకున్న నిర్ణ‌యం కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ దెబ్బ‌తింద‌నే విమ‌ర్శ‌లు ఎక్కువౌతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని సీరియ‌స్ గా తీసుకుంది. న‌వంబ‌ర్ 8 న దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌కు ఆ పార్టీ సిద్ధ‌మౌతోంది. కాంగ్రెస్ తోపాటు ఇత‌ర పార్టీలు కూడా ఆరోజును నోట్ల ర‌ద్దు వ్య‌తిరేక దినంగా జ‌రిపేందుకు ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై స్పందించారు. గుజ‌రాత్ లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా ప‌లు స‌భ‌ల్లో ఆయ‌న పాల్గొన్నారు. ప్ర‌తీ స‌భ‌లోనూ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యాన్ని అవినీతిపై పోరాటంగా చెప్పారు.

కొంత‌మంది త‌న దిష్టిబొమ్మ‌లు త‌గుల‌బెట్టినంత మాత్రాన తాను భ‌య‌ప‌డిపోన‌ని మోడీ చెప్పారు. ఇందిరా గాంధీ ప్ర‌ధానమంత్రిగా ఉన్న స‌మ‌యంలోనే నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంద‌న్నారు. కానీ, ఆ అవ‌స‌రం ఉన్నా ఆమె ఆనాడు నోట్ల ర‌ద్దు ఆలోచ‌న చేయ‌ల‌ేద‌నీ, అందుకే ఇప్పుడు తాను నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింద‌ని మోడీ అన్నారు. త‌న నిర్ణ‌యంతో డొల్ల కంపెనీలు మూత‌ప‌డుతున్నాయ‌నీ, కోట్ల కొద్దీ మోసాలు వెలుగు చూస్తున్నాయ‌న్నారు. నోట్ల ర‌ద్దు నిర్ణయం త‌రువాత కాంగ్రెస్ నేత‌ల‌కు కునుకు లేకుండా పోతోంద‌న్నారు. బినామీ ఆస్తుల‌ను అడ్డుక‌ట్టే వేసేందుకు తాను చ‌ట్టం తెస్తానేమో అని కాంగ్రెస్ ఆందోళ‌న చెందుతోంద‌న్నారు. కాంగ్రెస్ నేత‌ల‌కు సంబంధించి పాత రూ. 500, రూ. 1000 నోట్ల కట్టలు వారి గోదాముల్లో మూలుగుతున్నాయ‌నీ, అందుకే వారిలో ఆగ్ర‌హం చ‌ల్లార‌డం లేద‌ని మోడీ ఎద్దేవా చేశారు.

మొద‌ట్లో, నోట్ల ర‌ద్దు అంశంపై మోడీ స్పందించడానికి కాస్త వెన‌కాడేవారు. కానీ, ఇప్పుడు దీన్నో రాజ‌కీయాంశంగా మార్చేశారు. కాంగ్రెస్ నేత‌లపై విమ‌ర్శ‌లు చేసేందుకు దీన్ని వాడుకుంటున్నారు. అప్ప‌ట్లో ఇందిరా గాంధీ ఎందుకు చేయలేదంటూ కొత్త వాద‌న వినిపిస్తున్నాయి. నిజానికి, ఒక ప్ర‌ధాన‌మంత్రిగా న‌రేంద్ర మోడీ నుంచి దేశ‌ ప్ర‌జ‌లు ఆశిస్తున్న వివ‌ర‌ణ ఇది కాదు. ప్ర‌జ‌లను నానా అవ‌స్థ‌ల‌కు గురిచేసి, అవ‌న్నీ పురిటి నొప్పులు అని చెప్పిన ఏడాది త‌రువాత కూడా ఏం సాధించారు అనేదే స‌గ‌టు భార‌తీయుడి సూటి ప్ర‌శ్న‌? న‌ల్ల‌ధ‌నం ఎంత బ‌య‌ట‌కి వ‌చ్చింది..? అవినీతి ఏవిధంగా త‌గ్గింది..? దీని ఫ‌లాలు సామాన్యుడికే అని ఆనాడు అన్నారు.. ఆ ఫ‌లాలు ఏమ‌య్యాయి… దేశ ప్ర‌జ‌ల‌కు మోడీ జ‌వాబు చెప్పాల్సిన అంశాలు ఇవి. అంతేగానీ.. ఇందిరా గాంధీ నోట్ల ర‌ద్దు చేయ‌లేదు, కాంగ్రెస్ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు అంటూ విమర్శించడం ఫ‌క్తు రాజ‌కీయ నాయ‌కుడి స్పంద‌న‌లా ఉంది! నోట్లు ర‌ద్దు చేస్తున్న‌ప్పుడు.. ఇది సామాన్యుడి మంచి కోస‌మే అన్నారు. విప‌క్షాల విమ‌ర్శల్ని ప‌ట్టించుకోవ‌ద్ద‌న్నారు. ఇవాళ్ల‌, ఆయ‌నే విమ‌ర్శ‌ల‌కు ప‌రిమిత‌మౌతూ, సామాన్యుడిపై ప‌డిన ప్ర‌భావం గురించి మాట్లాడ‌టం మానేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.