క్రికెట్ పిచ్‌పై మణికట్టు మ్యాజిక్‌తో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఈ మాజీ కెప్టెన్, ఇప్పుడు రాజకీయ పిచ్‌పై కూడా లాస్ట్ ఓవర్ ఫినిషింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. సరిగ్గా 90వ దశకంలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాట్ పట్టుకుని ఎలాగైతే గట్టెక్కించేవారో, ఇప్పుడు తన మంత్రి పదవి విషయంలోనూ అలాగే ఆఖరి బంతికి సిక్సర్ కొట్టి నాట్ అవుట్ గా నిలిచారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిగా ప్రమాణం చేసి, ఆరు నెలల గడువు ముగిసిపోయే ఆఖరి వారంలో.. క్లీన్ బౌల్డ్ అవుతారనుకున్న తరుణంలో ఎమ్మెల్సీగా గవర్నర్ ఆమోదం పొంది తన వికెట్‌ను కాపాడుకున్నారు. గత కొద్దిరోజులుగా అజహర్ పరిస్థితి నెర్వస్ నైంటీస్ లో ఉన్న బ్యాట్స్‌మన్‌లా తయారైంది. మంత్రి పదవి అయితే ఉంది కానీ, చట్టసభ సభ్యత్వం లేకపోయేసరికి.. అది ఎప్పుడు ఊడుతుందోనని ప్రత్యర్థులు సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటు వస్తుందా? రాదా? అన్న సస్పెన్స్ సినిమా క్లైమాక్స్‌ను తలపించింది. లోక్ భవన్ నుంచి క్లియరెన్స్ రావడం ఆలస్యమవ్వడంతో, అజహరుద్దీన్ తన పాత క్రికెట్ రోజుల కంటే ఎక్కువే టెన్షన్ పడ్డారు. కానీ, అంపైర్ గవర్నర్ చివరకు వేలు ఎత్తకుండా సేఫ్ అని సిగ్నల్ ఇవ్వడంతో అజహర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. గడువు ముగియడానికి కేవలం కొన్ని గంటల ముందే గవర్నర్ ఆమోద ముద్ర పడటంతో, ఆలస్యం చేస్తే ఎక్కడ టైమ్ అవుట్ అవుతానో అన్నట్లుగా సోమవారం ఉదయమే అధికారికంగా ప్రమాణ స్వీకారం చేసేశారు.
ఒకప్పుడు మైదానంలో పరుగు తీసిన దానికంటే, ఈ ప్రమాణ స్వీకారానికి ఆయన వేగంగా పరిగెత్తి ఉంటారు. రాజకీయాల్లో కూడా తనకు చివరి ఓవర్ల సెంటిమెంట్ కలిసి వస్తుందని అజహర్ నిరూపించారు. క్రికెట్లో బంతిని బౌండరీ దాటించినట్లుగానే, తనపై వచ్చిన విమర్శలను, అనర్హత వేటును చాకచక్యంగా తప్పించుకున్నారు. మొత్తానికి అజహరుద్దీన్ తన మంత్రి హోదాను నిలబెట్టుకుని సెకండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా ప్రారంభించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో పూర్తిస్థాయి మంత్రిగా ఆయన బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాలి.
