మోత్కుప‌ల్లి కడుపుమంట‌కు కార‌ణం ఇదేనా..?

టీడీపీ నాయ‌కుడు రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం ఇంత తీవ్రం కావ‌డానికి ఓర‌కంగా మోత్కుప‌ల్లి న‌ర్సింహులు ఓ కార‌ణం అని చెప్పొచ్చు! మ‌ధ్య‌లో ఆయ‌న‌కేం సంబంధం అంటారా..? గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి రాక‌పోయేస‌రికి మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాలు చేయాల‌ని మోత్కుప‌ల్లి నిర్ణ‌యించుకున్న సంగ‌తి తెలిసిందే. అలాగ‌ని, రేవంత్ నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం ఆయ‌న‌కు ఇష్టం లేద‌నే ప్ర‌చార‌మూ ఎప్ప‌ట్నుంచో ఉన్న‌దే. గ‌వ‌ర్న‌ర్ గిరీ రాద‌న్న‌ది తేలిపాయే, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఇస్తాన‌ని మాటిచ్చిన రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌డం కూడా అనుమాన‌మే. ఈ నేప‌థ్యంలో పార్టీలో ప‌ట్టుకోస‌మో ఏమో తెలీదుగానీ.. పొత్తుల విష‌యమై బ‌హిరంగంగా మాట్లాడ‌టం మొద‌లుపెట్టింది ఈయ‌నే. రేవంత్ ప్ర‌తిపాదించిన కాంగ్రెస్ తో పొత్తు అంశాన్ని నిర్ద్వంద్వంగా, బ‌హిరంగంగా ఖండించిందీ ఈయ‌నే! రేవంత్ రెడ్డి పార్టీ మార్పు చ‌ర్చ‌కు పునాదులు వేసింది ముఖ్య‌మంత్రి కేసీఆర్ అయినా, సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టుగా మోత్కుప‌ల్లి కూడా రేవంత్ మీద ఆయ‌న‌కి ఉన్న‌ది ఆవేద‌నో ఆగ్ర‌హమో ఆవేశ‌మో అదేదోగానీ, ఇప్పుడు వెళ్ల‌గ‌క్కేస్తున్నారు!

రేవంత్ రెడ్డి తీరుపై మోత్కుప‌ల్లి మీడియా ముందు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత‌కీ నీ స్థాయి ఏంద‌నీ, పార్టీలో మ‌మ్మ‌ల్ని అంద‌రినీ ప‌క్క‌న పెట్టేసి మ‌రీ నీకు అవ‌కాశం ఇచ్చార‌ని రేవంత్ ను ఉద్దేశించి మోత్కుప‌ల్లి చెప్పారు. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ హోదా ఇచ్చార‌నీ, పార్టీ మీద స‌ర్వ హ‌క్కులూ క‌ల్పించార‌నీ, కానీ ఇవాళ్ల నువ్వు చేసిన ప‌నేందనీ, న‌మ్మ‌క ద్రోహం కాదా ఇదీ అంటూ మండిప‌డ్డారు. చంద్ర‌బాబు నాయుడుకి తెలియ‌కుండా పొత్తుల గురించి రాహుల్ గాంధీతో చ‌ర్చించే హ‌క్కు ఎవ‌రిచ్చారంటూ రేవంత్ ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసు ద్వారా చంద్ర‌బాబు నాయుడుకు మ‌చ్చ తెచ్చింది ఈయ‌నే అనీ, నేరుగా డ‌బ్బు సంచులు ప‌ట్క‌పోయి, ఏర‌కంగా దొరికిపోయిండో మీ అంద‌రికీ తెలుసు అన్నారు. ఈయ‌న తీరు వ‌ల్ల‌నే పార్టీలోని ఎమ్మెల్యేలంతా బ‌య‌ట‌కి పోయార‌నీ, ఈ స్టార్ కేంపెయిన‌ర్ ను న‌మ్ముకున్నాక కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒక్క సీటు గెల‌వ‌లేని ప‌రిస్థితి వ‌చ్చింద‌ని మోత్కుప‌ల్లి మండిప‌డ్డారు.

ఓటుకు నోటు కేసుపై మోత్కుప‌ల్లి ఇలా వ్యాఖ్యానించ‌డం మ‌రీ విడ్డూరం! ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన తంతు విష‌యంలో చంద్ర‌బాబుగానీ, పార్టీకిగానీ ఎలాంటి సంబంధం లేద‌న్న‌ట్టుగా ఈయ‌న మాట్లాడుతున్న‌ట్టుంది. ‘అంద‌రినీ ప‌క్కపెట్టి, రేవంత్ కు అవ‌కాశం ఇచ్చారు’ అని అంటున్నారు. అంటే, రేవంత్ కార‌ణంగానే ముఖ్యంగా తాను బాగా వెన‌క‌బ‌డిపోయాన‌నే ఆవేద‌న ఆయ‌న మాట‌ల్లో మ‌రో కోణంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా, ఈ అవ‌కాశాన్ని మోత్కుప‌ల్లి స‌ద్వినియోగం చేసుకుంటున్నార‌నే చెప్పాలి! చంద్ర‌బాబు నాయుడుపై స్వామి భ‌క్తిని అద్భుతంగా ప్ర‌ద‌ర్శించ‌డంతోపాటు, పార్టీలో త‌న‌కు ద‌క్క‌ని ప్రాధాన్య‌త గురించి ఎత్తి చూపేందుకు ప్ర‌స్తుత ప‌రిస్థితిని వాడుకుంటున్నట్టుగా ఆయన వ్యాఖ్యలున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.