మోత్కుప‌ల్లి మ‌ళ్లీ గ‌వ‌ర్న‌ర్ క‌ల‌లు కంటారా..?

మోత్కుప‌ల్లి న‌ర్సింహులు… తెలంగాణ తెలుగుదేశం పార్టీలో ఇమ‌డ‌లేక బ‌య‌ట‌కి వ‌చ్చేశారు. ఆ త‌రువాత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు మీద తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి కోసం తాను ఆంధ్రా వ‌స్తాన‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు వైకాపా ఎంపీ విజ‌య‌సాయి రెడ్డి కూడా ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఆ త‌రువాత‌, ఆయ‌న తిరుప‌తి వ‌చ్చి నాటి టీడీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేశారు. ఇంత‌కీ మోత్కుప‌ల్లి అక్క‌సు ఏంటంటే… ఆయ‌న చానాళ్లుగా గ‌వ‌ర్న‌ర్ అవుతార‌నే క‌ల‌లు క‌నేవారు. ఎన్డీయే ప్ర‌భుత్వంలో త‌న‌కు అవ‌కాశం వ‌స్తుంద‌ని అనుకున్నారు. టీడీపీ త‌న పేరును సిఫార్సు చేస్తుంద‌నుకున్నారు. కానీ, ప‌ద‌వి రాలేదు! క‌నీసం త‌న‌కు రాజ్య‌స‌భ సీటైనా టీడీపీ ఇస్తుంద‌నుకుంటే అదీ ద‌క్క‌లేదు. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన మోత్కుప‌ల్లి ఎన్నిక‌ల ముందు సొంత పార్టీకి వ్య‌తిరేకంగా కొంత హ‌డావుడి చేశారు. ఆ త‌రువాత సైటెంట్ అయిపోయారు.

ఇప్పుడు మ‌రోసారి క్రియాశీల రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆయ‌న సిద్ధ‌మౌతున్న‌ట్టు స‌మాచారం. ఈ నెల 18 హైద‌రాబాద్ లో భాజ‌పా ఓ స‌భ ఏర్పాటు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆరోజున దాదాపు 20 మంది చేరిక‌లుంటాయ‌ని ఇప్ప‌టికే క‌థ‌నాలు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ జాబితాలో మోత్కుప‌ల్లి పేరున్న‌ట్టు స‌మాచారం. కేంద్ర స‌హాయ‌మంత్రి కిష‌న్ రెడ్డి, రాష్ట్ర భాజ‌పా అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ తో ఇటీవ‌లే మోత్కుప‌ల్లి భేటీ అయ్యారు. పార్టీలో చేరాలంటూ వారే ఆయ‌న్ని ఆహ్వానించార‌నీ, దానికి మోత్కుప‌ల్లి సానుకూలంగా స్పందించార‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. భాజ‌పాలో చేరాక‌.. ఆయ‌న గ‌తంలో మాదిరిగా ఇంకా టీడీపీ మీదే విమ‌ర్శ‌లు చేస్తారా లేదా అనేది చూడాలి.

మొత్తానికి, క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూర‌మైన ఇత‌ర పార్టీల నేత‌లంద‌రినీ భాజ‌పా బాగానే ఆక‌ర్షిస్తోంది. ఓర‌కంగా వారికీ ఇదీ ఒక మంచి అవ‌కాశమే. ఎందుకంటే, ప్ర‌ధాన పార్టీల‌కు ఏ నాయ‌కుడు దూర‌మైతే దాదాపు ప్ర‌జ‌ల‌కూ దూరమైన‌ట్టే క‌దా! ఓర‌కంగా చెప్పాలంటే ఇలాంటివాళ్ల పొలిటిక‌ల్ కెరీర్ ముగిసిపోయింద‌ని కూడా చెప్పొచ్చు. కానీ, ఇప్పుడు భాజ‌పా వారికి కొత్త ఉత్సాహాన్నిస్తోంది. తెలంగాణ‌లో కాంగ్రెస్‌, టీడీపీల‌కు దూర‌మై… తెరాస‌లో చేర‌లేక మౌనంగా ఉండిపోయిన‌వారంద‌రినీ భాజ‌పా చేర్చుకుంటోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ర‌మ్మ‌ని ఆహ్వానిస్తే ఎవ‌రైనా ఎందుకు చేర‌రు..? ఇక‌, గ‌తంలో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి క‌ల‌లు క‌న్న మోత్కుప‌ల్లి… ఇప్పుడు కూడా అదే క‌ల‌ను సాకారం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారంటారా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com