ఈ ప‌రిస్థితికి కారణం మోత్కుప‌ల్లి స్వ‌యంకృత‌మే..!

తెలుగుదేశం పార్టీకి సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు దూరం అవుతున్నారా అంటే.. అవున‌నే స‌మాధానం వ‌చ్చేలానే ప‌రిస్థితులు మారుతున్నాయి. ఆయన కాదు.. పార్టీయే ఆయన్ని దూరం చేస్తోందని చెప్పొచ్చు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో జ‌రుగుతున్న మ‌హానాడు కార్య‌క్ర‌మానికి ఆయ‌న‌కి ఆహ్వానం అంద‌లేదంటేనే ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చు! దీంతో తీవ్ర అస‌హనంతో ఉన్నారు మోత్కుప‌ల్లి. ద‌ళిత నాయకుడైన త‌న‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని వాపోతున్నారు. తెలుగుదేశం పెట్టిన ద‌గ్గ‌ర నుంచీ ఎన్నో త్యాగాల‌కు ఓర్చి పార్టీకి క‌ట్టుబ‌డి ఉన్నాన‌ని అంటున్నారు.

కొంత‌మంది ప‌నికిమాలిన వాళ్ల వ‌ల్లే తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీకి దుస్థితి ప‌ట్టింద‌న్నారు. రేవంత్ రెడ్డి ప‌క్కా డ‌బ్బు మ‌నిషి అని ఆరోపించారు. ఆయ‌న రాహుల్ గాంధీని క‌లిసి, త‌రువాత విజ‌య‌వాడ వెళ్లి… తెలంగాణ టీడీపీని కాంగ్రెస్ లో క‌లిపేద్దామ‌ని ప్ర‌తిపాదించినా చంద్ర‌బాబు ఆగ్ర‌హించ‌లేద‌న్నారు. దండేసి పంపించార‌న్నారు. కానీ, తాను తెరాస‌లో టీడీపీని విలీనం చేస్తే అనే ప్ర‌తిపాద‌న తీసుకుని రాగానే చంద్ర‌బాబు ఆగ్ర‌హించార‌న్నారు. కాంగ్రెస్ భావ‌జాలంతో పోల్చుకుంటే, తెరాస‌తో ముందుకు సాగ‌డ‌మే ఇక్క‌డున్న ప‌రిస్థితుల్లో టీడీపీకి శ్రేయ‌స్క‌రం అని తాను అలా మాట్లాడ‌న‌న‌న్నారు. అయితే, పార్టీ అధ్య‌క్షుడిగా త‌న అభిప్రాయాన్ని ఆయ‌న ప‌క్క‌న పెట్టేసినా, ఆయ‌న ఆదేశాల‌ను పాటిస్తాం క‌దా, త‌న‌పై ఎందుకీ ఆగ్ర‌హం అని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.

ఏదేమైనా, ఒక‌టి మాత్రం స్ప‌ష్టం… తెలంగాణ టీడీపీ నాయ‌క‌త్వం ఆయన్ని ప‌క్క‌నపెట్టే క్ర‌మంలో ఉంది. అది కూడా మోత్కుప‌ల్లి స్వ‌యంకృత‌మే. త‌న‌కు గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఇప్పించ‌లేద‌న్న అక్క‌సుతో సొంత పార్టీ మీదే అసంతృప్తి వెళ్ల‌గ‌క్క‌డం మొద‌లుపెట్టారు. అది కూడా తెరాస‌లో విలీనం అన‌డంతో… ఆ పార్టీకి వ్య‌తిరేకంగా పోరాడుతున్న కేడ‌ర్ మ‌నోభావాలు దెబ్బ‌తినేలా మాట్లాడారు. నిజానికి, ప్ర‌స్తుతం రాష్ట్రంలో కాస్తోకూస్తో ఉన్న కేడ‌ర్ ను మెల్ల‌గా నిల‌బెట్టుకుందామ‌నీ, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌రింత బ‌లోపేతం చేసే దిశ‌గా న‌డిపిద్దామ‌నే ప్ర‌య‌త్నంలో చంద్ర‌బాబు ఉన్నారు. ఇలాంటి స‌మ‌యంలో పార్టీ అస్తిత్వానికే ఎస‌రు పెట్టేలా మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించేస‌రికి రాష్ట్ర నేత‌లు ఆగ్ర‌హించారు. అంతేకాదు, గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఒకేఒక్క క‌ల‌తో పార్టీలో క్రియాశీల కార్య‌క్ర‌మాలు త‌గ్గించేశారు. చివ‌రికి త‌న సొంత నియోజ‌క వ‌ర్గంలో పార్టీ ప‌రిస్థితిని కూడా ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఎప్ప‌ట్నుంచో విమ‌ర్శ‌లున్నాయి. ఎన్డీయేతో టీడీపీ త‌ల‌ప‌డుతున్న‌ప్పుడే ఇక గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి సాధ్యం కాద‌ని అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం మోత్కుప‌ల్లి చెయ్య‌లేదు. అదేదో పార్టీ త‌న‌కు చేసిన అన్యాయం అనే వాద‌న‌కే ప‌రిమిత‌మౌతూ వ‌చ్చారు. ఫ‌లితం… పాతికేళ్ల టీడీపీతో ప్ర‌యాణం దాదాపు తెగ‌తెంపుల ద‌శ‌కు వ‌చ్చింద‌నే చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com