ఆ ఐదుగురిలో ఇద్ద‌రికి సీట్లు ద‌క్క‌డం అనుమాన‌మే..!

ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఐదుగురు వైకాపా ఎంపీలు ప‌ద‌వీ త్యాగం చేసిన సంగ‌తి తెలిసిందే..! ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం నాలుగేళ్లుగా అలుపెరుగ‌ని పోరాటం చేసిన వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్‌, కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెంచే చివ‌రి అస్త్రంగా ఎంపీల‌తో రాజీనామాలు చేయించారు. నిజానికి, ఆ ఐదుగురు ఎంపీల‌తోనే ఉప ఎన్నిక‌ల‌కు వెళ్తారేమో, గెలిచి స‌త్తా చాటుకుంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ, ఉప ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కే అన్ని పార్టీలూ సిద్ధ‌మౌతున్నాయి. పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ ఇప్ప‌టికే అసెంబ్లీ నియోజ‌క వ‌ర్గాల అభ్య‌ర్థుల్ని ఖ‌రారు చేసుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే 80 మంది అభ్య‌ర్థుల విష‌యంలో జ‌గ‌న్ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌నీ, పాద‌యాత్ర పూర్త‌య్యేలోపు ఇత‌ర నియోజక వ‌ర్గాల్లో కూడా ఎవర్ని నిల‌బెట్టాల‌నే అంశంపై నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉంద‌ని పార్టీ ప్ర‌చారం జ‌రుగుతోంది.

పాద‌యాత్ర ద్వారా జ‌నాల్లో ఊపు తీసుకొచ్చినా, అభ్య‌ర్థుల ఎంపిక‌లో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌క‌పోతే గ‌త ఎన్నిక‌లు మాదిరిగానే దెబ్బ‌తినే అవ‌కాశం ఉంద‌న్న టెన్ష‌న్ జ‌గ‌న్ లో ఉంద‌నీ స‌మాచారం. అందుకే, అభ్య‌ర్థుల ఖ‌రారు విష‌యంలో ఒకే నివేదిక‌పై ఆయ‌న ఆధార‌ప‌డ‌టం లేద‌ని స‌మాచారం. సీనియ‌ర్ నేత‌ల‌తో ఒక క‌మిటీ, రాజ‌కీయ స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిషోర్ టీమ్ త‌యారు చేసిన మ‌రో నివేదిక‌తోపాటు మ‌రో మూడు సంస్థ‌ల ద్వారా స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నార‌నీ… వాట‌న్నింటినీ ప‌రిగణ‌న‌లోకి తీసుకుని అభ్య‌ర్థుల్ని విష‌యంలో నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే, ఈ క్ర‌మంలో పార్ల‌మెంటు అభ్య‌ర్థుల విష‌య‌మై కూడా జ‌గ‌న్ ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిలో ఉన్న‌ట్టు స‌మాచారం.

ఈసారి వైకాపా త‌ర‌ఫున పార్ల‌మెంటు నియోజ‌క వ‌ర్గాల్లో బ‌రిలోకి దిగే అభ్య‌ర్థుల విష‌య‌మై ఎన్నిక‌ల‌కు రెండు నెల‌ల ముందు మాత్ర‌మే జ‌గ‌న్ ఓ నిర్ణ‌యం తీసుకుంటార‌ని స‌మాచారం. అయితే, ఈ క్ర‌మంలో ప్ర‌త్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురిలో ఓ ఇద్ద‌రికి మ‌రోసారి సీట్లు ద‌క్కే అవ‌కాశం త‌క్కువ‌గా ఉన్న‌ట్టు వైకాపా వ‌ర్గాల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జ‌గ‌న్ వ‌రుస‌గా చేయిస్తున్న స‌ర్వేల్లో ఆ ఇద్ద‌రి నేత‌ల‌పై స్థానికంగా అసంతృప్తి వ్య‌క్త‌మౌతోంద‌నీ, ప్ర‌జాద‌ర‌ణ విష‌యంలో బాగా వెన‌క‌బ‌డి ఉన్నార‌ని తేలింద‌ట‌! దీంతో ఆ ఇద్ద‌రికీ ఈసారి సీట్లు ద‌క్క‌డ‌ం అనుమానమే అంటున్నారు. అంతేకాదు, ఆ ఇద్ద‌రు మాజీ ఎంపీల‌తో ఇప్ప‌టికే వైకాపా కీల‌క నేత‌లు సంప్ర‌దింపులు మొద‌లుపెట్టార‌నీ, టిక్కెట్టు ద‌క్క‌లేద‌న్న అసంతృప్తితో అనూహ్య నిర్ణ‌యాలు తీసుకోకుండా ఉండేందుకు బుజ్జ‌గింపులు ప్రారంభించార‌నీ స‌మాచారం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com