ప్రొ.నాగేశ్వర్ : ముస్లిం రిజర్వేషన్లపై కేసీఆర్ ప్రధానిని ఒప్పింగలరా..?

తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లను కేంద్రంతో పోరాడైనా సాధిస్తమని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. కానీ భారతీయ జనతాపార్టీ వైఖరి మాత్రం దీనికి భిన్నంగా ఉంది. మతపరమైన .. ముఖ్యంగా ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించదు. అలాగే.. యాభై శాతం దాటి.. ఏ రాష్ట్రంలోనూ..రిజర్వేషన్లు అంగీకరించబోమని బీజేపీ తన విధానంగా చెబుతోంది. తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే.. మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం దాటిపోతాయి. గుజరాత్ లో పటేళ్లకు ఈ కారణంగానే రిజర్వేషన్లు ఇవ్వలేదని బీజేపీ చెబుతోంది. రాజకీయంగా నష్టం జరిగే అవకాశం ఉన్నా కూడా బీజేపీ అదే విధానంపై నిలబడింది.పటేళ్లు దూరమైన.. ఓబీసీలను దగ్గరకు తీసుకోవాలనే రాజకీయ వ్యూహం నడిపింది తప్పా.. తన విధానాలను మార్చుకోలేదు. .

ముస్లిం రిజర్వేషన్లను బీజేపీ అంగీకరించే ప్రసక్తే లేదు..!

రిజర్వేషన్ల విషయంలో భారతీయ జనతా పార్టీ విధానాలు ఒకటి.. మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం…రెండు.. యాభైశాతానికి మించకపోవడం. ఈ రెండు కారణాల వల్ల… తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలుపడం సులభం కాదు. ఇంతే కాదు.. దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల ఆందోళనలు జరుగుతున్నాయి. మహారాష్ట్రాలో మరాఠా ఉద్యమం నడుస్తోంది. రాజస్థాన్ లో గుజ్జర్లు, హర్యానాలో జాట్లు, గుజరాత్ లో పటేళ్లు అడుగుతున్నారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను అంగీకరిస్తే.. ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున డిమాండ్లు పెరిగే అవకాశం ఉంది. కేంద్రానికి ఇబ్బందికరంగా మారుతుంది. తెలంగాణలో పన్నెండు శాతం ముస్లింలు ఉన్నారు. అస్సాంలో 32 శాతం ముస్లింలు ఉన్నారు. బెంగాల్ లో 25 శాతం ముస్లింలు ఉన్నారు.. ఇతర చోట్ల కూడా సహజంగానే ముస్లిం రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ వస్తుంది. ఈ కారణాల వల్ల కేంద్రం తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేసే అవకాశం లేదు. ప్రధాని నరేంద్రమోడీ, కేసీఆర్ కి మధ్య మంచి సంబంధాలు ఉండవచ్చు. టీఆర్ఎస్, బీజేపీకి మధ్య అవగాహన ఉండొచ్చు.కానీ విధానపరమైన విషయాల వల్ల కానీ.. ఇతర ఇబ్బందులు వచ్చే అవకాశం ఉన్నందు వల్ల కానీ.. కేంద్రం ఆమోదించడం అసాధ్యమే. ఇది రాజకీయ కోణం

రాజ్యాంగం, కోర్టు తీర్పులు కూడా వ్యతిరేకం..!

రిజర్వేషన్లు ఆమోదించకపోవడానికి రాజ్యాంగపరమైన కారణం కూడా ఉంది. అసలు ముస్లిం రిజర్వేషన్లు భారతదేశంలో సాధ్యమా..? మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వరాదని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా.. మత పరమైన రిజర్వేషన్లు లేవు. చారిత్రకంగా చూసుకున్నా.. బ్రిటిష్ పాలనలో.. హిందువులుకు, ముస్లింలకు వేర్వేరు నియోజకవర్గాలు అన్న విధానం తెచ్చారు. కానీ అది దేశ విభజనకు కారణం అయింది. అందు వల్ల రాజ్యాంగ పరంగా చూసుకున్నా… చారిత్రకంగా చూసుకున్నా.. భారతదేశంలో మతపరమైన రిజర్వేషన్లు.. ఇవ్వడం సాధ్యం కాదు. బాగా వెనుకబడిన వర్గాలకే తప్ప.. ఇతర వర్గాలకు రిజర్వేషన్ ఫలాలు ఇవ్వడానికి కోర్టులు అంగీకరించవు. కోర్టులు చాలా స్పష్టంగా చెప్పాయి.

అత్యంత వెనుకబడిన వర్గాలకే రిజర్వేషన్ల ఫలాలు..!

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25,26 ప్రకారం ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ ఉంటుంది. మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం కల్పించింది. ఆ సందర్భంలో చెప్పిన దాని ప్రకారం చూస్తే.. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వరాదు. .. మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు నిరాకరించరాదని.. రాజ్యాంగంలో ఉంది. అప్పుడు ఏం చేయాలంటే ముస్లింలలో బాగా వెనుకబడిన వర్గాలను గుర్తించి.. వారికి మాత్రమే రిజర్వేషన్స్ కల్పించాలి. ఇప్పటికీ పలు రాష్ట్రాల్లో ముస్లిం మతాన్ని ఆచరించే.. విశ్వసించే .. బాగా వెనుకబడిన కొన్ని వర్గాలకు ఈ సదుపాయం ఉంది. అలాంటి వర్గాలకు గుర్తించి ఇవ్వడమే తప్పా.. మొత్తం ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం సాధ్యం కాదు.

జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు రాజ్యాంగ వ్యతిరేకం..!

ముస్లింలలో వెనుకబాటు తనం ఉంది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం.. భారతదేశంలో ముస్లంలు ఓబీసీల కన్నా వెనుకబడి ఉన్నారు. అయితే ఈ కారణంగా… రిజర్వేషన్లు ఇవ్వలేరు. సుప్రీంకోర్టు చెప్పిందేమిటంటే.. పూర్తిగా నిర్లక్ష్యానికి గురయిన.. వెనుకబడిన వర్గానికి మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలి. ఈ కేటగిరిలోకి.. తెలంగాణలో కానీ.. భారతదేశంలో కానీ ముస్లింలు రారు. కేసీఆర్ పన్నెండు శాతం ముస్లింలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి… 12 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం..జనాభా ఎంత శాతం ఉంటే అంత శాతం రిజర్వేషన్లు ఉండవు.. ఓబీసీలు యభై సాతం ఉంటే.. వారికి యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేయలేరు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం లేదు. భారత ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇందిరా సహానీ కేసులో.. చాలినంతగా ప్రాతినిధ్యం ఉండేలా చూసేందుకు రిజర్వేషన్లు కానీ…. జనాభా ప్రాతిపదిక కాదు. జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు ఇవ్వడం అనేది భారత రాజ్యాంగం అనుమతించదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

రిజర్వేషన్లతో రాజకీయ క్రీడ
.
అంటే మొత్తంగా చూడాలంటే.. ఈ రిజర్వేషన్ల వ్యవహారం ఇలా నడుస్తూనే ఉంటుంది. కేసీఆర్ ఢిల్లీ వెళ్తూనే ఉంటారు. ప్రధానిని కలుస్తూనే ఉంటారు. కానీ అడుగు మాత్రం ముందుకు పడదు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా ఇవ్వలేరు. సుప్రంకోర్టు తీర్పు ప్రకారమూ ఇవ్వలేరు. ఓ రాజకీయ క్రీడలో భాగంగా ఈ వ్యవహారం మాత్రం అలా నడుస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com