వైసీపీవైపు నాదెండ్ల చూపు..

నాదెండ్ల మ‌నోహ‌ర్‌… కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్ర‌ముఖ నేత‌. ఉమ్మ‌డి రాష్ట్రానికి ఆఖ‌రు స్పీక‌ర్‌. మాజీ ముఖ్య‌మంత్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు త‌న‌యుడు. ఈయ‌న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర‌బోతున్నారా? అవే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర విభ‌జ‌న‌లో కాంగ్రెస్ పార్టీ అనుస‌రించిన వైఖరి ప్ర‌జ‌ల‌లో ఆ పార్టీ ప‌ట్ల అంతులేని విద్వేషాన్ని ర‌గిల్చింది. స్వార్థ చింత‌న‌తోనో.. టీఆర్ఎస్ నాయ‌కుల నుంచి మూట‌లకొద్దీ ముడుపులు అందుతాయ‌న్న ఆశ‌తోనో.. లేదా మాట ప్ర‌కారం కేసీఆర్ టీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో క‌లిపేస్తార‌నో దురాశ‌తోనో సోనియా మ‌హాత‌ల్లి బ‌ల‌వంతంగా రాష్ట్రాన్ని చీల్చేసిన నాటి జ్ఞాప‌కాలు ఆంధ్రోళ్ళ మ‌న‌స్సులోంచి చెరిగిపోవ‌నీ, పార్టీకి ఇక పుట్ట‌గ‌తులుండ‌వ‌నీ ఇంత‌కాలానికి గ్ర‌హించారో ఏమో గానీ మ‌నోహ‌ర్ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటున్నారు. గ‌తంలోనే క‌ళ్ళు తెరిచిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, పురంద్రీశ్వ‌రి, త‌దిత‌ర పెద్ద‌లు కాషాయ ద‌ళంతో మ‌మైక‌పోయారు. తాజాగా ముంద‌స్తు ఎన్నిక‌ల న‌గారా మోగుతుంద‌న్న వార్త‌లు ముప్పిరిగొంటున్న వేళ మ‌నోహ‌ర్ ముగ్ధ‌మ‌నోహ‌ర‌మైన నిర్ణ‌యాన్ని తీసుకోడానికి సిద్ధ‌మైపోతున్నారు.

రాజ‌కీయాల్లో క్రియాశీలంగా ఉండాలంటే టీడీపీ, వైసీపీ రెండింటిలో ఏదో ఒక పార్టీలో ఉండ‌క త‌ప్ప‌ని స‌రి ప‌రిస్థితి. బొత్స‌, ధ‌ర్మాన‌, ధ‌ర్మ‌శ్రీ‌, లాంటి నేత‌లు ఇప్ప‌టికే కాంగ్రెస్ తానుముక్క‌లో చేరిపోయారు. డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ లాంటి నేత‌లు డ‌బుల్ గేమ్‌తో టీడీపీలో చేరి పొందాల్సిన ల‌బ్ధి పొందారు. మ‌నోహ‌ర్‌కు అలాంటి అవ‌కాశం లేదు. కార‌ణం ఆయ‌న తండ్రి నాదెండ్ల భాస్క‌ర‌రావు ఎన్టీరామారావును వెన్నుపోటు పొడిచిన ఉదంతం. ఎంత రాజ‌కీయంగా ల‌బ్ధిపొందుతామ‌న్న సూచ‌న‌లు క‌నిపించిన‌ప్ప‌టికీ ఆ కుటుంబాన్ని టీడీపీ ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌దు. ఇక వైయ‌స్ఆర్ కాంగ్రెస్ త‌ప్ప మ‌నోహ‌ర్‌కు ప్ర‌త్యామ్నాయం లేదు. అందుకే ఆయ‌న చూపులు అటువైపు. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు వివిధ కార‌ణాల‌తో టీడీపీలో చేరిపోయి ఇచ్చిన ఝ‌ల‌క్‌లు వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పార్టీని ప‌టిష్టం చేసుకునేందుకు ప్ర‌య‌త్నించే విధంగా మార్చాయి. తాజాగా శిల్పా మోహ‌న్ రెడ్డి ఉదంత‌మూ అంతే. నంద్యాల టికెట్ ఇవ్వ‌క‌పోతే జ‌గ‌న్‌కు జైకొడ‌తాన‌న్నారు. ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా అంత‌కు మించిన ప్రయోజ‌నం చేకూరేలా ఏర్పాటు చేస్తారు. శిల్పా డ‌బుల్ గేమ్‌ను ప‌సిగ‌ట్ట‌లేని వైసీపీ.. ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేయ‌డానికి సిద్ధ‌మైపోయింది. జ‌రిగే న‌ష్టాన్ని ఊహించి, ముఖ్య‌మంత్రి ప్ర‌ణాళిక ప్ర‌కారం వ్య‌వ‌హ‌రించి, శిల్పాను ఓదార్చారు. మ‌నోహ‌ర్‌కు ఇలాంటి అవ‌కాశ‌మే లేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల కాల‌మే మిగిలి ఉంది. ఈలోగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పున‌రుజ్జీవించే అవ‌కాశాలు ఏ మాత్రం లేవు. పార్టీలోనే కొన‌సాగితే- రాజ‌కీయ స‌మాధేన‌న్న వాస్త‌వాన్ని ఆయ‌న గుర్తించారు. తాజాగా జ‌గ‌న్ గుంటూరులో నిర్వ‌హించిన రైతు దీక్ష స‌మ‌యంలో వైఎస్ఆర్ సీపీ నాయ‌కులు మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే కోన ర‌ఘుప‌తిల‌తో ఆయ‌న నిరంత‌రం సంప్ర‌దింపులు నిర్వ‌హించార‌ని అంటున్నారు. పార్టీలో ఎవ‌ర్ని చేర్చుకున్నా ప‌ర‌వాలేదు. మ‌న‌ద‌గ్గ‌ర నెగ్గి మ‌రో శిబిరాన్ని చూసుకునే వారిని జ‌గ‌న్ ముందే గుర్తిస్తే మేలు.

-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.