నాగ్ పెట్టిన కండీష‌న్లు అన్నీ ఇన్నీ కావ‌యా..!

ప‌దిహేనేళ్ల త‌ర‌వాత నాగార్జున ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాడు. అదే… బ్ర‌హ్మాస్త్ర‌. అమితాబ్ బ‌చ్చ‌ర్‌, ర‌ణ‌బీర్ క‌పూర్… ఇలా బ్ర‌హ్మాండ‌మైన స్టార్ కాస్ట్ ఉందీ చిత్రంలో. ఇలాంటి సినిమాలో న‌టించే అవ‌కాశం వ‌స్తే ఎవ‌రైనా ఎగిరి గంతేస్తారు. కానీ.. నాగార్జున మాత్రం అంత సుల‌భంగా ఒప్పుకోలేద‌ట‌. ఈ చిత్ర‌బృందానికి చాలా కండీష‌న్లు పెట్టాడ‌ట‌. ఎవ‌రైనా పూర్తి స్క్రిప్టు చెప్ప‌మంటారు. నాగ్ మాత్రం `త్రీడీ వెర్ష‌న్‌` అడిగాడ‌ట‌. అంటే.. నాగ్ పాత్ర‌ని యానిమేష‌న్‌లో చేసి చూపించాల‌న్న‌మాట‌. దానికోసం చిత్ర‌బృందం మూడు నెల‌లు క‌ష్ట‌ప‌డింద‌ట‌. `నేను ఎంత సేపు ఉన్నా. ఓకే. కానీ.. నా పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి.. నేను తప్ప ఇంకెవ్వ‌రూ చేయ‌కూడ‌ద‌న్న‌ట్టు క‌నిపించాలి. అలా అయితేనే చేస్తా అన్నాను.. దానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఒప్పుకున్నారు. తెర‌పై నేను క‌నిపించేది 15 నిమిషాలే. కానీ… ఆ ఇంపాక్ట్ మాత్రం బలంగా ఉంటుంది“ అంటున్నాడు నాగ్‌. “శివ స‌మ‌యంలోనే బాలీవుడ్ వెళ్లిపోవాల్సింది. కానీ రెండు ప‌డ‌వ‌లపై ప్ర‌యాణం చేయ‌డం నాకిష్టం లేదు. అందుకే తెలుగులోనే ఉండిపోదామ‌నుకున్నాను. దాదాపు ప‌దిహేనేళ్ల త‌ర‌వాత ఓ బాలీవుడ్ సినిమా చేస్తున్నాను. నాకు ఆ పాత్ర అంత న‌చ్చింది“ అంటున్నాడు నాగ్‌. త్వ‌ర‌లోనే నాగ్ ఓ త‌మిళ సినిమా కూడా చేస్తున్నాడ‌ట‌. వివ‌రాలు మ‌రో వారం రోజుల్లో బ‌య‌ట‌కు వ‌స్తాయి.

‘బంగార్రాజు’పై మ‌ళ్లీ ఆశ‌లు

సోగ్గాడే చిన్ని నాయ‌న త‌ర‌వాత మొద‌ల‌వ్వాల్సిన సినిమా ‘బంగార్రాజు’. కానీ ఆ స‌మ‌యంలో త‌న‌కంటే చైతూకే క‌ల్యాణ్ కృష్ణ అవ‌స‌రం ఎక్కువ ఉంద‌ని న‌మ్మిన నాగార్జున‌… వాళ్లిద్ద‌రి కాంబినేష‌న్ సెట్ చేశాడు. ఫ‌లితంగా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ పట్టాలెక్కింది. క‌నీసం మూడో సినిమాగానైనా ‘బంగార్రాజు’ వెళ్తుంద‌నుకున్నారు. కానీ కుద‌ర్లేదు. ర‌వితేజ‌తో తీసిన ‘నేల‌టికెట్టు’ చూసి నాగ్ కంగారు ప‌డ్డాడ‌ని, ఆ ప్రాజెక్టు ప‌క్క‌న పెట్టేశాడ‌ని వార్త‌లొచ్చాయి. నాగ్ కూడా ‘ఆ క‌థ ఇంకా ఓ కొలిక్కి రాలేదు’ అని చెబుతూనే ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మ‌ళ్లీ ఆశ‌లు చిగురిస్తున్నాయి. ‘బంగార్రాజు’ ఇప్పుడు సీరియ‌ర్ రైట‌ర్ స‌త్యానంద్ చేతుల్లోకి వెళ్లింది. ఈ క‌థ‌లో ఆయ‌న మార్పులు చేర్పులూ చేస్తున్నారు. నాగ్ సూచ‌న‌ల‌కు త‌గ్గ‌ట్టుగా ఇప్పుడు స్క్రిప్టు రెడీ అవుతోంది. త్వ‌ర‌లోనే ఈసినిమా ప‌ట్టాలెక్కే అవ‌కాశం ఉంది. ఈ విష‌యాన్ని నాగ్ సూత‌ప్రాయంగా చెప్పాడు కూడా. ”ప్ర‌స్తుతం ఈ స్క్రిప్టుపై క‌ల్యాణ్‌, స‌త్యానంద్‌లు ప‌నిచేస్తున్నారు. స్క్రిప్టు పూర్త‌యిన వెంట‌నే.. ఓ నిర్ణ‌యానికి వ‌స్తాం” అంటున్నాడు నాగ్‌. సో… ‘బంగార్రాజు’పై ఆశ‌లు పెట్టుకోవ‌చ్చ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com