రివ్యూ: పుణ్యం… పురుషార్థం ద‌క్కించిన ‘ఓం న‌మో వేంక‌టేశాయ‌’

భ‌క్తి చిత్రాలు ప్ర‌యోగం అనుకొంటుంటారు చాలామంది. కానీ లాజిక్‌గా ఆలోచిస్తే… అంత సేఫ్ ప్రాజెక్టులు ఇంకేం ఉండ‌క‌పోవొచ్చు. కుటుంబ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డానికి ద‌గ్గ‌ర టెక్నిక్ అది. దాన్ని రాఘ‌వేంద్రరావు అన్న‌మ‌య్య స‌మ‌యంలోనే ప‌ట్టేశారు. ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ హిట్స్ ఇచ్చిన రాఘ‌వేంద్ర‌రావు కెరీర్‌లో అన్న‌మ‌య్య ప్ర‌త్యేకంగా నిలిచిపోవ‌డ‌మే కాదు, ఆయ‌న స్థాయిని పెంచింది.దాంతో ఆయ‌న దృష్టి పూర్తిగా ఆ త‌ర‌హా చిత్రాల‌పై మ‌ళ్లింది. రామ‌దాసుతో మ‌రో మెట్టు ఎక్కారు. శిరిడీసాయి నిరాశ ప‌రిచినా… కేవ‌లం కుటుంబ ప్రేక్ష‌కుల మీద భ‌రోసాతో.. ‘ఓం న‌మో వేంక‌టేశాయ‌’ అంటూ మ‌రో ప్ర‌య‌త్నం చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? మ‌హా భ‌క్తుడు హాథీరామ్ బాబా జీవిత క‌థ‌ని రాఘ‌వేంద్ర‌రావు త‌న‌దైన శైలిలో తెర‌కెక్కించిన విధానం ఎలా ఉంది? క‌మ‌ర్షియ‌ల్‌గా ఈ చిత్రం ఎంత వ‌ర‌కూ వ‌ర్క‌వుట్ అవుతుంది? ఇవ‌న్నీ కాస్త వివ‌రంగా తెలుసుకొంటే….!

* క‌థ‌

రామ(నాగార్జున) దేవుడ్నిచూడాల‌న్న ఏకైక ఆశ‌యంతో ఇళ్లు విడిచి వెళ్లి అనుభవానంద స్వామి ( సాయికుమార్) ద‌గ్గ‌ర శిష్యుడిగా చేర‌తాడు. ఓంకార నామం చేస్తూ కఠోర తపస్సు చేస్తే దేవుడు ప్ర‌త్య‌క్షం అవుతాడ‌న్న ఆశ‌తో… దీక్ష‌లో కూర్చుంటాడు. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు బాలుడి రూపంలో దిగి వ‌చ్చి తపోభంగం చేస్తాడు. అయితే సాక్ష్యాత్తూ వెంక‌టేశ్వ‌రుడే ఈ రూపంలో వ‌చ్చాడ‌న్న విష‌యాన్ని రామ గుర్తించ‌డు. దేవుడు త‌న‌పై క‌రుణ చూప‌డం లేద‌న్న బాధ‌తో.. రామ మ‌ళ్లీ ఇంటికి వెళ్లిపోతాడు. అక్క‌డ త‌న‌ మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి నిశ్చ‌యం అవుతుంది. అయితే మ‌న‌స్సంతా స్వామి వారిపైనే ఉండ‌డంతో.. మ‌ళ్లీ ఇల్లు వ‌డిచి వెళ్లిపోతాడు. త‌న త‌పోభంగం చేసిన బాలుడే.. స్వామివార‌న్న నిజం తెలుసుకొని, ఎలాగైనా స్వామిని మ‌రోసారి ద‌ర్శించుకోవాల‌ని తిరుమ‌ల వెళ్లిపోతాడు. మ‌రి ఈసారి స్వామి క‌రుణించాడా? ప‌ర‌మ భ‌క్తుడు రామ‌.. హాథీరామ్ బాబాగా ఎలా మారాడు? కొండ‌పై ఉన్న‌ కృష్ణమ్మ (అనుష్క) ఎవ‌రు? గోవిందరాజులు (రావూ రమేష్) తో హాథీరామ్ కి ఎదురైన స‌మ‌స్య‌లేంటి? ఇవ‌న్నీ తెర‌పై చూసి తెలుసుకోవాల్సిన విష‌యాలే.

* విశ్లేష‌ణ‌

ఈ క‌థ చెప్పాల‌నుకోవ‌డంలో రాఘ‌వేంద్ర‌రావు ఉద్దేశ్యాలు రెండు కావొచ్చు. ఒక‌టి.. హాథీరామ్ బాబా జీవితాన్ని ఆవిష్క‌రించ‌డం, రెండోది తిరుమ‌ల తిరుప‌తి క్షేత్ర మ‌హాత్యం చెప్ప‌డం. ఈ రెండు విష‌యాల్లోనూ రాఘ‌వేంద్ర‌రావు విజ‌యం సాధించార‌నే చెప్పాలి. హాథీరామ్ బాబా గురించి చాలా మందికి తెలీదు. చ‌రిత్ర‌లో ఉన్న వివ‌రాలూ చాలా త‌క్కువే. అయినా స‌రే.. వాటి ఆధారంగా రెండు గంట‌ల సినిమా మ‌ల‌చ‌డం సాధార‌ణ‌మైన విష‌యం కాదు. అందుకే తెలివిగా… ఇటు వేంక‌టేశ్వ‌ర స్వామి మ‌హిమ‌ల్నీ, తిరుమ‌ల విశేషాల్నీ, అక్క‌డ చేసే సేవ‌ల్నీ పూస గుచ్చిన‌ట్టు విడ‌మ‌ర్చి చెప్ప‌డంతో సినిమాకి కావ‌ల్సిన అవుట్ పుట్ వ‌చ్చేసింది. దానికి తోడు రాఘ‌వేంద్రుడు సృష్టించుకొన్న‌ కృష్ణ‌మ్మ లాంటి క‌ల్పిత పాత్ర‌లూ క‌థ‌కు బలాన్నిచ్చాయి. నిజం చెప్పాలంటే హాథీరామ్ బాబా గురించి ఈ సినిమాలో చెప్పిన స‌మాచారం కూడా త‌క్కువే. అయితే… కొన్న‌యినా తెలియ‌ని విష‌యాల్ని తెలిశాయి కాబ‌ట్టి అవి బోన‌స్ అనుకోవాలి. తిరుమ‌లలో వేంక‌టేశ్వ‌ర‌స్వామిని చాలా మంది ద‌ర్శించుకొని ఉంటారు. వాళ్లంద‌రికి తెలియ‌ని విష‌యాలు కూడా విడ‌మ‌ర‌చి చెప్పే ప్ర‌య‌త్నం క‌చ్చితంగా ఆక‌ట్టుకొంటుంది. ఏ సేవ ఎందుకు చేస్తున్నారు? అస‌లు తిరుమ‌ల క‌లియుగ వైకుంఠం ఎందుకు అయ్యింది? హాథీరామ్ బాబాతోనే దేవుడు ఎందుకు పాచిక‌లు ఆడాడు? అనే తెలియ‌ని విష‌యాల‌కు ఈ చిత్రం ఓ డాక్యుమెంట‌రీ రూపం. అయితే వాటిని రాఘ‌వేంద్ర‌రావు త‌న‌కు తెలిసిన క‌మర్షియ‌ల్ విద్య‌ల‌న్నీ పొందుప‌ర‌చి చ‌క్క‌టి సినిమాగా మ‌లిచారు.

శిరిడీ సాయి లో ప్ర‌ధాన‌మైన లోపం.. కామెడీ ట్రాక్‌. ఈ విష‌యాన్ని నాగార్జున కూడా అంగీక‌రించాడు. అన‌వ‌స‌రంగా కామెడీ ని జోడించ‌డం శిరిడీ సాయిపై ప్ర‌తికూల ప్ర‌భావాన్ని చూపించిందన్న‌ది నాగ్ కామెంట్‌. ఆ త‌ప్పుని రాఘ‌వేంద్ర‌రావు ఈ సినిమాలో చేయ‌లేదు. గోవింద‌రాజులు పాత్ర ప‌లికే సంభాష‌ణ‌ల్లో కాస్త వెట‌కారం ధ్వ‌నిస్తుంది త‌ప్ప‌.. కామెడీ కోస‌మ‌ని ప్ర‌త్యేకంగా ట్రాకులు పెట్టే సాహ‌సాలు చేయ‌లేదు. రాఘ‌వేంద్ర‌రావు చేసిన తెలివైన ప‌ని.. ఈ సినిమాని భ‌క్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో న‌డ‌ప‌డం. భ‌క్తులు ఈ సినిమాని ఏ దృష్టితో చూడాల‌ని వ‌స్తారో బాగా గ్ర‌హించిన రాఘ‌వేంద్ర‌రావు.. క‌థ‌ని, స‌న్నివేశాల్ని అందుకు త‌గ్గ‌ట్టుగానే మ‌లిచాడు. ఎవ‌రికి న‌చ్చినా, న‌చ్చ‌క‌పోయినా కుటుంబ ప్రేక్ష‌కులు, మ‌రీ ముఖ్యంగా పూజ‌లు పున‌స్కారాల‌కు ప్రాధాన్యం ఇచ్చేవారు, అందులోనూ తిరుమ‌ల భ‌క్తులు ఈ సినిమా చూస్తున్నంత సేపూ పూర్తిగా భ‌క్తి పార‌వ‌శ్యంలో మునిగిపోవ‌డం ఖాయం.

ప‌తాక స‌న్నివేశాలు మ‌రింత రక్తి క‌ట్టిస్తాయి. అస‌లు ఈ సినిమా ప్రాణ‌మంతా అక్క‌డే ఉంది. ఎందుకు హాథీరామ్ బాబా అంత గొప్ప భ‌క్తుడ‌య్యాడ‌న్న విష‌యాన్ని రాఘ‌వేంద్ర‌రావు స్ప‌ష్టంగానే చెప్ప‌గ‌లిగారు. జీవ స‌మాధి అయిన స‌న్నివేశాలు క‌ల్పిత‌మా? నిజంగా జ‌రిగిందా? అస‌లు ఈ సినిమాలో చెప్పిన స్వామి వారి సంగ‌తుల‌కు, హాథీరామ్ బాబా క‌థ‌కు ప్రామాణికత ఏది? అనేది మ‌రో పెద్ద డిబేట్‌. కాక‌పోతే… దాదాపుగా చ‌రిత్ర‌ని వ‌క్రీక‌రించకుండా ద‌ర్శ‌కేంద్రుడు జాగ్ర‌త్త ప‌డిన‌ట్టు స్ప‌ష్టం అవుతుంది.

అలాగ‌ని బ‌ల‌హీన‌త‌లు లేవా అంటే.. అవీ ఉన్నాయి. అన్న‌మ‌య్య‌, శ్రీ‌రామ‌దాసుతో పోలిస్తే… ఆయా సినిమాల్లో క‌నిపించిన డ్రామా ఇందులో పండ‌లేదు. స‌న్నివేశాల‌న్నీ అలా.. అలా సాగిపోతాయంతే. అన్న‌మ‌య్య లాంటి క్లాసిక్‌తో పోల్చుకొని ఈ సినిమా చూస్తే మాత్రం నిరాశ ప‌డ‌తారు. ఒక‌ట్రెండు పాట‌లు క‌థాగ‌మ‌నానికి అడ్డుత‌గిలాయి. అవి లేక‌పోయినా సినిమాకి వ‌చ్చిన న‌ష్ట‌మైతే లేదు. మేకింగ్ బాగున్నా.. కొన్ని చోట్ల స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోలేదేమో అనిపిస్తుంది.

* న‌టీన‌టుల ప్ర‌తిభ‌

ఇలాంటి పాత్ర‌లు, క‌థ‌లు నాగార్జున‌నే వెదుక్కొంటూ ఎందుకు వెళ్తాయి? అనే ప్ర‌శ్న‌కు మ‌రోసారి స‌మాధానం దొరికింది ఈ సినిమాతో. నాగ్ న‌ట‌న‌… నిజంగానే అపూర్వం అనిపించేలా ఉంది. అమాయ‌కత్వం, పార‌వ‌శ్యం, భ‌క్తి, క‌రుణ‌… . ఇలా అన్ని కోణాల్లోనూ నాగ్ న‌ట‌న పండింది. అనుష్క త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేసింది. వెంక‌టేశ్వ‌ర స్వామిగా సౌర‌భ్ జైన్ స‌రిపోతాడా, లేడా? అనే అనుమానాలు ఉండేవి. అయితే త‌న న‌ట‌న‌తో వాట‌న్నింటినీ ప‌టాపంచ‌లు చేసేశాడు సౌర‌భ్ జైన్‌. ఇది వ‌ర‌కు పౌరాణిక పాత్ర‌లు పోషించిన అనుభ‌వం అత‌నికి తోడైంది. జ‌గ‌ప‌తిది చిన్న పాత్రే. కానీ న‌ట‌న ఆక‌ట్టుకొంది. విమ‌లారామ‌న్‌, ప్ర‌గ్యాల పాత్ర‌ల ప‌రిధి త‌క్కువే.

* సాంకేతిక విభాగం

టెక్నిక‌ల్‌గా ఈసినిమా బాగుంది. గ్రాఫిక్స్ ప‌రంగానూ నాణ్య‌త క‌నిపించింది. కొండ‌లు, జ‌ల‌పాతాలు, అల‌నాటి తిరుమ‌ల దేవ‌స్థానం ఇవ‌న్నీ బాగా చూపించారు. కీర‌వాణి సంగీతం.. ఈ చిత్రానికి మ‌రింత వ‌న్నె తీసుకొచ్చింది. రాఘ‌వేంద్ర‌రావు మార్క్ అడుగ‌డుగునా క‌నిపించింది. ఆయ‌నతోనే ఇలాంటి సినిమాలు సాధ్య‌మ‌వుతాయ‌న్న విష‌యం ఈ సినిమా మ‌రోసారి నిరూపించింది. భార‌వి అందించిన సంభాష‌ణ‌లు ఫ‌ర్వాలేద‌నిపిస్తాయి. కొన్ని సంభాష‌ణ‌లు సుదీర్ఘంగా, ఉప‌న్యాస ధోర‌ణిలో సాగ‌డం మైన‌స్‌.

* ఫైన‌ల్ ట‌చ్‌: వెండి తెర‌పై తిరుమ‌ల ద‌ర్శ‌నం

తెలుగు 360 రేటింగ్‌: 3.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మేనిఫెస్టో మోసాలు : ఎస్సీ, ఎస్టీలకు చెప్పింది ఒక్కటి కూడా చేయలేదేందయ్యా !

జగన్ మోహన్ పాదయాత్రలో కొన్ని వందల హామీలు ఇచ్చారు. కానీ అవేమీ మేనిఫెస్టోలో పెట్టలేదు. అందుకే ఇప్పుడు తాము ఆ హామీలు ఇవ్వలేదని వాదిస్తూ ఉంటారు. తప్పుడు ఆలోచనలు చేసే వారి రాజకీయాలు...

ఇంటలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీ బదిలీ !

ఏపీ ఇంటలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాను ఈసీ బదిలీ చేసింది. వెంటనే వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించింది. వీరిద్దర్నీ ఎన్నికలకు సంబంధం లేని విధుల్లో నియమించాలని స్పష్టం...

ప్రతినిధి.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

నారా రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చిన సినిమా... 'ప్ర‌తినిధి 2'. జ‌ర్న‌లిస్ట్ మూర్తి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడి మార‌డం, ఎన్నిక‌ల సీజన్‌లో విడుద‌ల అవుతుండడం వ‌ల్ల ఈ సినిమాపై ఫోక‌స్ పెరిగింది....

అమితాబ్ బ‌చ్చన్ ‘హైటు’ పెంచిన నాగ అశ్విన్‌

స్టార్ డ‌మ్ లోనే కాదు, హైట్ లోనూ అమితాబ్ బ‌చ్చ‌న్‌ని కొట్టేవాళ్లే లేరు. బాలీవుడ్ స్టార్స్‌ల‌లో ఆయ‌న అత్యంత పొడ‌గ‌రి. ఆయ‌న ఎత్తు.. ఆర‌డుగుల రెండు అంగుళాల పైమాటే. అయితే... 'క‌ల్కి' కోసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close