నాగ్ కోసం ఆ ద‌ర్శ‌కుడు కిందా.. మీదా

సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాతో నాగార్జున‌కు ఓ సూప‌ర్ డూప‌ర్ హిట్ ఇచ్చాడు క‌ల్యాణ్ కృష్ణ‌. నాగ్ త‌న కెరీర్‌లో ఎప్పుడూ రూ.50 కోట్ల క్ల‌బ్ లోకి వెళ్ల‌లేదు. కానీ.. సోగ్గాడే ఆ లోటు తీర్చేసింది. ఆ భ‌రోసాతోనే ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆఫ‌ర్ ఇచ్చాడు. ఈ సినిమా త‌ర‌వాత నాగ్‌తో `బంగార్రాజు` కూడా ఉంటుంద‌ని చెప్పుకొన్నారు. వ‌రుస‌గా అన్న‌పూర్ణ బ్యాన‌ర్‌లో మూడో సినిమా చేస్తున్నందుకు క‌ల్యాణ్‌ని లక్కీ ఫెలో అనుకొన్నారంతా. అయితే.. ఇప్పుడు ఆ ‘బంగార్రాజు’ ఊసెత్త‌డం లేద‌ట నాగార్జున‌. ఇప్ప‌టికే స్టోరీ లైన్ సిద్ధం చేసుకొన్నా – అది విన‌డానికి నాగ్ ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ‘బ‌య‌ట మ‌రో సినిమా చేసుకురా… అప్పుడు ఆలోచిద్దాం’ అంటున్నాడ‌ట నాగ్‌.

నిజానికి చైతూతో సినిమా కంటే నాగ్ తో `బంగార్రాజు` చేయ‌డానికే క‌ల్యాణ్ కృష్ణ ఎక్కువ ఆస‌క్తి చూపించాడు. కానీ.. నాగ్ మాత్రం త‌న‌యుడికి మంచి హిట్ ఇవ్వాల‌న్న ఉద్దేశంతో క‌ల్యాణ్ కృష్ణ‌తో బ‌ల‌వంతంగా ఈ ప్రాజెక్టు ఓకే చేయించాడ‌ని తెలుస్తోంది. ”ఎలాగూ బంగార్రాజు చేస్తాంలే” అన్న‌ధీమాతో చైతూ తో ఈ ప్రాజెక్ట్ ఒప్పుకొన్నాడ‌ట‌. క‌థ‌, క‌థ‌నాలు, సాంకేతిక నిపుణుల ఎంపిక‌.. ఇలా ప్ర‌తీ విష‌యంలోనూ నాగ్ ఇన్‌వాల్వ్ అయ్యాడు. అంతేకాదు.. ఎడిటింగ్ టేబుల్ ద‌గ్గ‌రా… కూర్చున్నాడు. చాలా సీన్లు… నాగ్ ఆలోచ‌న మేర‌కు రూపుదిద్దుకొన్న‌వే. అయినా… ఈ సినిమా రిజ‌ల్ట్ అంతంత మాత్రంగానే వ‌చ్చింది. దాంతో…. క‌ల్యాణ్ కృష్ణ‌తో సినిమా విష‌యంలో నాగ్ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. అయితే… బంగార్రాజు స్క్రిప్టుపై న‌మ్మ‌కంతో ఉన్న క‌ల్యాణ్ కృష్ణ‌.. ఎలాగైనా ఈ క‌థ‌ని ఒకే చేయించుకోవాల‌ని కిందా మీదా ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి నాగ్ క‌నిక‌రిస్తాడో లేదో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.