సోలో హీరోగా నాగార్జున చేతిలో సినిమా లేదు. కాకపోతే.. ఆయన రెండు మల్టీస్టారర్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ వర్క్ జరుగుతోంది. మరోవైపు ‘కూలీ’ కూడా ఆగస్టులో రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాలూ నాగ్ కి చాలా కీలకం. భవిష్యత్తులో మరో హీరోతో స్క్రీన్ పంచుకోవాలా? పంచుకొంటే ఎలాంటి పాత్రలు చేయాలి? అనే విషయాల్ని నిర్దారించేది ఈ సినిమాలే. ఈ రెండు సినిమాల్లో అభిమానుల దృష్టి ‘కూలీ’పైనే ఎక్కువ. లోకేష్ కనగరాజ్ దర్శకుడు.. రజనీకాంత్ హీరో.. ఇలాంటి ప్రాజెక్టులో నాగ్ కి ఓ పాత్ర దొరకడం నిజంగా ప్రత్యేకమే. పైగా ఈమధ్య ఓ గ్లింప్స్ విడుదల చేసింది చిత్రబృందం. అందులో నాగ్ బ్యాక్ షాట్ బాగా వైరల్ అయ్యింది. నాగ్ స్వాగ్ ఏమిటో.. ఆ షాట్ ఒక్కటే చెప్పేస్తోంది. చిన్న షాట్ కే అక్కినేని ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. ఇక టీజరో, ట్రైలరో బయటకు వస్తే ఎలా ఉంటుందో?
ఈ సినిమాలో నాగ్ పాత్ర ఏమిటి? ఆయన ఎంత సేపు కనిపిస్తారు? అనే ప్రశ్నలు అక్కినేని అభిమానుల్ని ఊరిస్తున్నాయి. ఈ సినిమాలో నాగ్ పాత్ర గురించి ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే.. నాగ్ పాత్ర నిడివి ఎక్కువే అని, ఆయన పాత్ర కనీసం 45 నుంచి 50 నిమిషాల వరకూ ఉంటుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. నాగ్ – రజనీ మధ్య నడిచే సన్నివేశాలన్నీ లోకేష్ చాలా బాగా డిజైన్ చేశారని సమాచారం. రజనీ – నాగ్ మధ్య ఓ స్టైలీష్ ఫైట్ కూడా కంపోజ్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ అక్కినేని అభిమానులకు కిక్ ఇచ్చే అంశాలే. లోకేష్ కనగరాజ్ పై తెలుగు హీరోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. చిరంజీవి, నాగార్జునలను ఆయన బాగా అభిమానిస్తుంటారు. ఆ అభిమానం అంతా లోకేష్ ఈ సినిమాలో చూపించేశారేమో అనిపిస్తోంది. నాగ్ కూడా ఈ సినిమా గురించి, అందులోని తన పాత్ర గురించీ తన సన్నిహితులతో చాలా గొప్పగా చెబుతున్నారని, ఈ సినిమా కచ్చితంగా తనకో మైల్ స్టోన్ అవుతుందని, ఈ సినిమాతో తన కెరీర్ కొత్త దశలో ప్రవేశిస్తుందని నాగ్ భావిస్తున్నార్ట. అన్నట్టు ‘కూలీ’ కోసం నాగ్ మంచి పారితోషికాన్నే అందుకొన్నార్ట. అది సోలో హీరోగా చేసినదానికంటే మూడు రెట్లు అధికమని తెలుస్తోంది.