తెలంగాణపై ‘ఈనాడు’ది కపటప్రేమ: ‘నమస్తే తెలంగాణ’

హైదరాబాద్: ‘ఈనాడు’ దినపత్రిక తెలంగాణపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తుందని, తెలంగాణ కోసం కొట్లాడుతున్నట్లు అనిపించేటట్లు చేస్తుందని ‘నమస్తే తెలంగాణ’ ధ్వజమెత్తింది. కానీ అదంతా తెలంగాణను వైఫల్యంగా చూపించే కుట్రలో భాగంగా జరుగుతుందని తెలంగాణవారికి ఎప్పుడోకానీ అర్థం కాదంటూ ఇవాళ తమ పత్రికలో ఒక బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ఈనాడు పత్రిక నిన్న తెలంగాణ, హైదరాబాద్ ఎడిషన్‌లలో మొదటి పేజిలో ‘రాజధానికి దాహార్తి’ అంటూ మొదటి పేజిలో ఇచ్చిన కథనంపై ‘నమస్తే తెలంగాణ’ మండిపడింది.

దాదాపు కోటి జనాభాతో, వందల కాలనీలతో విస్తరించిన హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంక్షోభం తలెత్తిందని, గుక్కెడు నీటికోసం వందల కాలనీలు అలమటిస్తున్నాయని, ప్రధాన ప్రాంతాలకు సరఫరా నిలిచిపోయిందని, 3 నుంచి పదిరోజులకోసారి తాగునీరు ఇస్తున్నారని ‘ఈనాడు’ పత్రిక నిన్నటి తమ కథనంలో పేర్కొంది. ట్యాంకర్‌లు బుక్ చేస్తే పదిరోజులకు కూడా రావటంలేదని రాసింది. మంజీరా, సింగూరులనుంచి తాగునీటి సరఫరా ఆగిపోతుందని జలమండలి అధికారులకు తెలుసని, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌ల పరిస్థితి గురించీ అవగాహన ఉందని, ఈ నాలుగు ప్రధాన జలాశయాలనుంచి సరఫరా ఆగిపోతే నగరంలో నీటి సంక్షోభం తప్పదని అధికారులకూ తెలుసని, అయినాకూడా ముందస్తుగా పక్కా ప్రణాళిక రూపొందించలేదని ఈనాడు విమర్శించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సమస్య తీవ్రతను పసిగట్టి గోదావరి జలాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినా, గోదావరినుంచి 75 ఎంజీడీ(మిలియన్ గ్యాలన్స్ పర్ డే) మాత్రమే తీసుకునే అవకాశం ఉందని, కుత్బుల్లాపూర్ వరకు మాత్రమే ఆ నీరు వస్తాయని పేర్కొంది.

‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఆ కథనంపై స్పందిస్తూ, ఈనాడును ధృతరాష్ట్రుడుతో పోల్చింది. ఒకడు ద్వేషంకొద్దీ కొట్టి చంపాలని చూస్తాడని, ఒకడు ప్రేమగా కౌగలించుకుని చంపాలని చూస్తాడని, మొదటి వాడు దుర్యోధనుడని, రెండోవాడు ధృతరాష్ట్రుడని పేర్కొంది. మొదటివాడు శత్రువు అని ముందే తెలిసిపోతుందని, రెండోవాడు శత్రువు అని గుర్తించేలోపుగానే మనం కిందపడిపోతామని రాసింది. ఈనాడును రెండో రకం శత్రువుగా అభివర్ణించింది. ఈనాడు అధినేత రామోజీరావు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఇటీవల సత్సంబంధాలు నెరుపుతున్న నేపథ్యంలో ‘నమస్తే’ ఇలా రాసినట్లు కనబడుతోంది. ఇక ఈనాడు కథనంపై పాయింట్‌లవారీగా ఎదురుదాడి చేసింది. హైదరాబాద్‌లో కనీవినీ ఎరగని పరిస్థితి వచ్చి పడిందని ఈనాడు తెగ బాధపడిపోయిందని ‘నమస్తే’ తన కథనంలో రాసింది. హైదరాబాద్‌లో నీటి సమస్య వచ్చిన మాట వాస్తవమేనని పేర్కొంది. అయితే సమస్య రెండో పార్శ్వాన్ని ఈనాడు చెప్పటంలేదని విమర్శించింది. అసలు హైదరాబాద్ ఇలా ఎందుకు తయారయ్యిందో చెప్పదని రాసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సమైక్యాంధ్ర మహా దార్శనికులు 60 ఏళ్ళపాటు ఈ హైదరాబాద్ నగరాన్ని ఒక్కసారి కరువొస్తే తట్టుకోలేని దుస్థితికి తీసుకొచ్చారని రాయటంలేదని మండిపడింది. సమైక్యాంధ్రులు రాకముందు హైదరాబాద్‌కు సరస్సుల నగరంగా పేరు ఉండేదని, ఏడాదిలో 6 మాసాలు వర్షాలుండేవని, ఉష్ణోగ్రత 37 డిగ్రీలకు మించేది కాదని, ఎక్కడ చూసినా నీటి తటాకాలేనని పేర్కొంది. సమైక్యాంధ్ర విజనరీల ఏలుబడిలో వందలాది చెరువును, డ్రైనేజిలను కూడా కబ్జా చేశారని, హైదరాబాద్‌లో ఎక్కడా చుక్క నీరు ఇంకని దుస్థితికి తీసుకొచ్చారని ఆరోపించింది. సీమాంధ్ర పత్రికలు హైదరాబాద్‌కు సమస్యలన్నీ ఇప్పుడే వచ్చినట్లు జనాన్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. ఒక పద్ధతి ప్రకారం తెలంగాణపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని టీఆర్ఎస్‌ను దెబ్బతీయటానికి ఈనాడు ఈ ప్రచారం సాగిస్తోందని దుయ్యబట్టింది.

‘ఈనాడు’ పత్రిక కథనంలో వాస్తవమున్నప్పటికీ గోదావరి జలాలు నగరానికి తరలివస్తున్న ఈ సందర్భంలో ఆ కథనాన్ని ఇవ్వటం అధికార పక్షాన్ని రెచ్చగొట్టినట్లే అయింది. దానితో సహజంగానే అధికారపార్టీ కరపత్రిక అయిన ‘నమస్తే తెలంగాణ’ వెంటనే ‘ఈనాడు’ కథనంపై స్పందించింది. కనీసం ఈనాడు పత్రిక, తన కథనానికి శీర్షికను – ‘గోదావరి జలాలు వస్తే నగర నీటి సమస్య తీరుతుందా?’ అన్నట్లు ఇచ్చినా బాగుండేది. గోదావరి జలాలను నగరానికి తెప్పించామన్న ఉత్సాహంలో ఉన్న అధికారపార్టీకి ‘రాజధానికి దాహార్తి’ అన్న శీర్షిక ఆగ్రహం కలగచేయటం సహజమే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com