టీఆర్ఎస్ పేరుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపిందని.. తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని ఈసీ గుర్తించిందని.. స్వయంగా ఎన్నికల అధికారులే కవిత ఇంటికి వచ్చి లేఖ ఇచ్చారని .. కవిత పీఆర్ టీం మీడియాకు సమాచారం ఇచ్చింది. ఈ విషయం మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది కూడా. కానీ ఇక్కడ చాలా తేడాలు కనిపిస్తున్నాయి. అందులో మొదటిది తెలంగాణ రక్షణ సేన అనే పేరు. కవిత ఇటీవల ఆవిష్కరించిన పార్టీ రక్షణ సేన కాదు.. రాష్ట్ర సేన. తెలంగాణ రాష్ట్ర సేన పేరును ఆమె ఆవిష్కరించారు. కొత్తగా రక్షణ సేన అని ఎప్పుడు మార్చారో?
అంతే కాదు.. ఎన్నికల సంఘం అధికారులే ఇంటికి వచ్చి అనుమతి పత్రం ఇచ్చారని కవిత పీఆర్ టీం చెబుతోంది. కానీ ఎన్నికల సంఘం అధికారులేమీ ఈడీ, సీబీఐ అధికారులు కాదు ఇంటికి వచ్చి మరీ నోటీసులు ఇచ్చినట్లుగా పార్టీ రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వడానికి. అనుమతి ఇస్తే మహా అయితే ఆన్ లైన్ లో అప్ లోడ్ చేస్తారు. అంతే తప్ప.. ఇంటికి వచ్చి .. పత్రాలు చేతిలో పెట్టి అభినందించి వెళ్లరు. అలాంటి సంప్రదాయాలు లేవు.. అసలు అది రూల్స్ కూడా విరుద్ధం. మరి కవితకు అనుమతి పత్రాలు ఇచ్చిన వారు ఎవరు?
టీఆర్ఎస్ పేరుకు అభ్యంతరాలు ఉన్నాయి. ఆ పేరును ఆమోదించవద్దని.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు చాలా ఫిర్యాదులు చేశారు. కవిత పార్టీ ప్రకటించే నాటికి ఇంకా దరఖాస్తు కూడా చేయలేదని ఆన్ లైన్ రికార్డులు చెబుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్ర సేన పేరును .. రక్షణ సేనగా మార్చి ఎప్పుడు దరఖాస్తు చేశారు.. ఎప్పుడు అనుమతించారు?. ఇవన్నీ కవిత పీఆర్ టీం క్లారిటీ ఇవ్వాల్సిన విషయాలుగా కనిపిస్తున్నాయి.
