జ‌బ‌ర్‌ద‌స్త్ బూతుని ఆపేస్తారా? లేదా?

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్‌ద‌స్త్ బూతుల గోల మ‌రోసారి పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు వ‌ర‌కూ వెళ్లేలా చేసింది. ఈటీవీలో గురు, శుక్ర‌వారాల్లో ప్ర‌సారం అవుతున్న జ‌బ‌ర్‌ద‌స్త్ పోగ్రాం ముందు నుంచీ… విమ‌ర్శ‌ల పాల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఎవ‌రు ఎన్నిసార్లు గోల చేసినా, పోలీస్ స్టేష‌న్ మెట్లు ఎక్కినా.. అటు ఈటీవీ యాజ‌మాన్యం గానీ, ఇటు మ‌ల్లెమాల సంస్థ‌గానీ ఏమాత్రం వెనుకంజ వేయ‌డం లేదు. స‌రి క‌దా.. ఆ బూతు డోసు మ‌రింత పెంచుకొంటూ వెళ్తున్నారు. ఈటీవీ ప్ల‌స్‌లో ప్ర‌సారం అవుతున్న ప‌టాస్‌లో కూడా విచ్చ‌ల‌విడిగా బూతులు దొర్లేస్తున్నాయి. దాన్ని కామెడీ గా తీసుకొని న‌వ్వుకోమంటోంది ఈటీవీ యాజ‌మాన్యం. మ‌రోసారి.. జ‌బ‌ర్‌ద‌స్త్‌పై విరుచుకుప‌డ్డాయి మ‌హిళా సంఘాలు. వాళ్ల‌కు సెన్సార్ బోర్డు సభ్యులు నంద‌నం దివాక‌ర్ కూడా తోడ‌య్యారు.

జబర్దస్త్, పటాస్ కార్యక్రమాలపై మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌‌లో సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్ ఫిర్యాదు చేశారు. జబర్దస్త్ కార్యక్రమంలోని కొన్ని ఎపిసోడ్స్‌‌లో అనైతిక దృశ్యాలు, అసంబద్ధ పదాలు వాడుతున్నార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కార్య‌క్ర‌మాలు అస్స‌లు సెన్సార్ చేయ‌డం లేద‌ని, వీటిపై త‌క్ష‌ణం స్పందించి చ‌ర్య‌లు తీసుకోమ‌ని దివాకర్ డిమాండ్ చేశారు. అంతేకాదు జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న నాగబాబు, రోజాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ పై ఇలాంటి ఆరోప‌ణ‌లు లెక్క‌లేన‌న్ని వ‌చ్చాయి. వంద‌లాది ఫిర్యాదులలు అందాయి. రోజా, నాగ‌బాబుని దుయ్య‌బ‌డుతూ చాలామంది మైకులు విర‌గొట్టేసేంత ప‌ని చేశారు. కానీ… ఏం జ‌రిగింది? దానివ‌ల్ల ఉప‌యోగం ఏముంది? తెలుగు భాష‌ని గౌర‌విస్తున్నాం, సంస్ర్కృతిని కాపాడుతున్నాం అని గొప్ప‌గా చెబుతున్న ఈటీవీ యాజ‌మాన్యానికి జ‌బ‌ర్‌ద‌స్త్‌లో ఉన్న బూతులు క‌నిపించ‌డం లేదా? వినిపించ‌డం లేదా?? అయినా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు ఎందుకు ఊరుకొంటున్నారు? దానికి కార‌ణం. జ‌బ‌ర్ ద‌స్త్‌తో ఈటీవీకి క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. బూతు పోగ్రాంని సొమ్ములు చేసుకొంటూ ఈటీవీ ఖుషీ చేసుకొంటోంది. అదీ.. అస‌లు వ్య‌వ‌హారం. అందుకే… ఈ బూతు పై జ‌నం చేస్తున్న గోల వాళ్ల‌కు ప‌ట్ట‌దు గాక ప‌ట్ట‌దు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com