శిల్పా వెర్సెస్ భూమా నుంచి జ‌గ‌న్ వెర్సెస్ బాబు వ‌ర‌కు..!

నంద్యాల ఉప ఎన్నిక షెడ్యూల్ వ‌చ్చేయ‌డంతో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌చార జోరు పెంచాయి. అభివృద్ధే త‌మ‌ని గెలిపిస్తుంద‌ని టీడీపీ ధీమాగా ఉంటే, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌తే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తుంద‌ని వైసీపీ గ‌ట్టిగా న‌మ్ముతోంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ వైకాపా, టీడీపీ నేత‌ల మ‌ధ్య వ్యూహ ప్ర‌తివ్యూహాల‌కు ప‌రిమితమైన ఈ ఉప ఎన్నిక‌.. ఇప్పుడు ముఖ్య‌మంత్రి, ప్ర‌తిప‌క్ష నేత మ‌ధ్య పోరుగా మారిపోయింది. నంద్యాల‌లో ఇప్ప‌టికే రెండుసార్లు ప్ర‌చారం చేశారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. ఇప్పుడు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ కూడా నంద్యాలలో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించేందుకు సిద్ధ‌ప‌డుతున్నారు. ఆగ‌స్టు 3న నంద్యాల‌లో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించ‌బోతున్న‌ట్టు పార్టీ ప్ర‌క‌టించింది. ఈ స‌భ‌ను స‌క్సెస్ చేయ‌డం కోసం భారీ ఎత్తున జ‌న స‌మీక‌ర‌ణ కోసం ఇప్ప‌ట్నుంచే పార్టీ వ‌ర్గాలు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

దీంతో ఈ ఉప ఎన్నిక నంద్యాల నియోజ‌క వ‌ర్గ స్థాయి నేత‌ల నుంచీ.. సీఎం, ప్ర‌తిపక్ష నేత‌ల మ‌ధ్య పోరుగా రూపాంత‌రం చెందుతోంది. 2019 ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్ గా ఈ ఉప ఎన్నిక‌ను భావిస్తున్నారు. నంద్యాల గెలుపు ప్ర‌భావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంద‌నీ, ఈ గెలుపు ఉత్సాహంతో పార్టీని ఉర‌క‌లు వేయించవ‌చ్చ‌నేది రెండు పార్టీల వ్యూహం. నంద్యాల‌లో ఎక్క‌డికి వెళ్లినా ప్ర‌జ‌లు త‌మ‌కు బ్ర‌హ్మర‌థం ప‌డుతున్నార‌నీ, అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నార‌నీ, అవినీతి వైసీపీపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మౌతోంద‌ని చెబుతున్నారు టీడీపీ అభ్య‌ర్థి బ్ర‌హ్మానంద రెడ్డి. నంద్యాలల్లో ప్ర‌తీ గ‌ల్లీలోనూ స‌మ‌స్య‌లున్నాయ‌నీ, చంద్ర‌బాబు స‌ర్కారు అవినీతి గురించి ప్ర‌జ‌లు మాట్లాడుతున్నార‌నీ అంటున్నారు వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి. ఇలా రెండు పార్టీల అభ్య‌ర్థులూ జ‌గ‌న్‌, చంద్ర‌బాబుల ఇమేజ్ ల మీదే ఆధార‌ప‌డుతున్నారు. సో.. దీంతో ఉప ఎన్నిక రంగు పూర్తిగా మారిపోయింది.

ఈ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై కూడా ఇప్ప‌ట్నుంచే కొన్ని అంచ‌నాలు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. టీడీపీ, వైసీపీల్లో గెలుపు ఓట‌ములు అనేవి ఎవ‌రికి వ‌చ్చినా… భారీ ఎత్తున ఫిరాయింపుల‌కు ఆస్కారం ఉండ‌టం ఖాయం అనేది సుస్ప‌ష్టంగా క‌నిపిస్తోంది! టీడీపీ గెలిస్తే.. వైకాపా నుంచి మ‌రింత‌మందిని ఆకర్షించ‌డం ద్వారా వ‌చ్చే ఎన్నిక‌ల్లోపు ఆ పార్టీ కాన్ఫిడెన్స్ ను మ‌రింత దెబ్బ‌తియ్యొచ్చు అనేది అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. వైసీపీ కూడా ఇదే ప్లాన్ లో ఉన్న‌ట్టు స‌మాచారం. నంద్యాలలో గెలిచిన త‌రువాత‌, తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున నేత‌ల్ని పార్టీలో చేర్చుకుంటే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో టీడీపీని ఎదుర్కోవ‌డం న‌ల్లేరు మీద న‌డ‌క అయిపోతుంద‌ని ఆ పార్టీ వ్యూహంతో ఉంది. అందుకే, నంద్యాల ఉప ఎన్నిక‌ని సెమీ ఫైన‌ల్ గా చెబుతున్న‌ది. అధికార ప్ర‌తిప‌క్షాల వ్యూహ‌ప్ర‌తివ్యూహాల‌ను ప్ర‌భావితం చేసే స్థాయికి ఈ ఉప ఎన్నిక చేరిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.