అఖిల ప్రియ పొలిటిక‌ల్ కెరీర్ కి ఇదో ప‌రీక్ష‌..!

నంద్యాల ఉప ఎన్నిక విష‌య‌మై తెలుగుదేశం పార్టీలో అంతా సాఫీగానే ఉన్న‌ట్టు పైపైకి క‌నిపిస్తున్నా… ఈ ఎల‌క్ష‌న్స్ చుట్టూ చాలా అంశాలు ముడిప‌డి ఉన్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కూ శిల్పా వ‌ర్గం, భూమా వ‌ర్గం టీడీపీ టిక్కెట్లు కోసం సిగ‌ప‌ట్లు ప‌ట్టాయి. శిల్పా మోహ‌న్ రెడ్డి వైకాపాలో చేరిపోవ‌డంతో భూమా వ‌ర్గానికి టీడీపీలో లైన్ క్లియ‌ర్ అయిపోయింది. భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు బ్ర‌హ్మానంద రెడ్డికి టీడీపీ టిక్కెట్ ఖ‌రారు చేసింది. నిజానికి, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌ర‌కూ టీడీపీ అభ్య‌ర్థుల‌ను చంద్ర‌బాబు ఖ‌రారు చెయ్య‌రు. కానీ, నంద్యాల ఉప ఎన్నిక విష‌యంలో అభ్య‌ర్థి పేరును ముందే ప్ర‌క‌టించ‌డం విశేషం. అయితే, ఇదే త‌రుణంలో భూమా సన్నిహితుడైన ఏవీ సుబ్బారెడ్డి హాట్ టాపిక్ అయ్యారు. జ‌గ‌న్ నుంచి త‌న‌కేదో ఆఫ‌ర్ ఉందంటూ ప్ర‌చారం, అఖిల ప్రియ‌తో విభేదాలు ఉన్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. దాంతో వెంట‌నే అఖిల ప్రియ స్పందించ‌డ‌మూ… ఆ వార్త‌ల్లో వాస్త‌వాలు లేవంటూ కొట్టిపారేయ‌డ‌మూ జ‌రిగిపోయింది. అయితే, రానురానూ ప‌రిణామాలు ఎలా మారుతున్నాయంటే… ఈ ఎన్నిక‌ల్లో గెలుపు బాధ్య‌త అంతా అఖిల ప్రియ వ‌ర్గ‌మే మోయాల్సి వ‌స్తోంది! ఓర‌కంగా ఆమెకి ఈ బై ఎల‌క్ష‌న్స్ అగ్నిపరీక్షే అని చెప్పాలి.

బ్రహ్మానంద రెడ్డి అభ్య‌ర్థిత్వాన్ని నంద్యాల టీడీపీలోని అంద‌రూ అంగీక‌రిస్తున్నారా అనేది అస‌లు ప్ర‌శ్న‌. ఎందుకంటే, భూమా మ‌ర‌ణించారు కాబ‌ట్టి.. ఆ ఫ్యామిలీకి టిక్కెట్ ఇవ్వ‌డం ఆన‌వాయితీ అన్న లెక్క‌ల్లో ఆయ‌న‌కి ఇచ్చేశారు. దీంతో ఒక‌వేళ ఈ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ ఓట‌మి పాలైతే దానికి తాను బాధ్యుడిని కాను అని ముందే ప్రిపేర్ అవుతున్న‌ట్టు ఏవీ సుబ్బారెడ్డి తీరు ఉంటోంది. సో.. బ్ర‌హ్మానంద రెడ్డిని గెలిపించుకోవాల్సిన బాధ్య‌త అంతా ఒక్క అఖిల ప్రియ భుజ‌స్కందాల‌పైనే ఉంద‌నేది అర్థ‌మౌతోంది. కాబ‌ట్టి, ఆమె ఒక్క‌రే భారీ ఎత్తున ప్ర‌చారానికి వెళ్ల‌క త‌ప్ప‌దు. ఎందుకంటే, అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డంతో త‌మ బాధ్య‌త పూర్తైపోయిన‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిజానికి, నంద్యాల గెలుపుపై టీడీపీ పెద్ద‌ల‌కే ఫిఫ్టీ ఫిఫ్టీ న‌మ్మ‌కాలున్నాయ‌ని అంటున్నారు. ఎందుకంటే, గ‌తంలో టీడీపీ టిక్కెట్ తో భూమా అక్క‌డ గెల‌వ‌లేదు క‌దా! వైకాపాలో ఉండ‌గా గెలిచి.. త‌రువాత టీడీపీలోకి ఫిరాయించారు.

నంద్యాల‌లో టీడీపీకి చేదు అనుభ‌వం ఎదురైతే దానికి ప‌రిపూర్ణ బాధ్యురాలు అఖిల ప్రియే అనే చిత్రీక‌ర‌ణ ఉండొచ్చు! అఖిల ప్రియ మంత్రి ప‌ద‌వికే ఎస‌రు ప‌డొచ్చు. భూమా వ‌ర్గానికి ఒక అవ‌కాశం ఇచ్చామ‌నీ, కానీ వారు నిరూపించుకోలేక‌పోయాంటూ పార్టీలో ప్రాధాన్య‌త త‌గ్గించే అవ‌కాశ‌మూ క‌చ్చితంగా ఉంటుంది. రానురానూ భూమా సెంటిమెంట్ కూడా ప్ర‌జ‌ల్లో త‌గ్గుతుంది క‌దా. భూమా మ‌ర‌ణించాక ఏక‌గ్రీవం కావాల్సిన స్థానంలో కూడా జ‌గ‌న్ పోటీ పెట్టించార‌నీ, కుళ్లు రాజ‌కీయాలు చేశార‌నీ కూడా టీడీపీ విమ‌ర్శ‌లు చేసుకోవ‌చ్చు! సో.. ఏ కోణం నుంచి చూసుకున్నా ఈ ఎన్నిక అఖిల ప్రియ రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు పరీక్ష‌గానే మారింద‌ని అన‌డంలో సందేహం లేదు. మ‌రి, ఈ అవ‌కాశాన్ని భూమా వ‌ర్గం ఎలా వాడుకుంటుందో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com