ఫుల్ పేజీ ప్రకటనల్లేవు. బహిరంగసభలు పెట్టి డబ్బా కొట్టుకోవడాల్లేవు. బటన్ నొక్కేశాను.. ఇక మీ ఖాతాల్లో డబ్బులు పడటమే ఆలస్యం అని ఏదో తన డబ్బు ఇచ్చినట్లుగా గొప్పలు చెప్పుకోవడాల్లేవు. సింపుల్ గా .. విద్యార్థుల ఫీజులను ఏపీ ప్రభుత్వం చెల్లించింది.ఈ విషయాన్ని నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విద్యార్థుల విద్యా ప్రస్థానంలో ఎలాంటి అడ్డంకులు ఉండకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల కోసం ప్రభుత్వం మంగళవారం రూ.1,200 కోట్ల నిధులను విడుదల చేసింది.
గత ప్రభుత్వ వైఫల్యాలకు ముగింపు
గత జగన్ ప్రభుత్వం అమలు చేసిన విద్యా దీవెన పథకంలో నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయడం వల్ల అనేక సమస్యలు తలెత్తాయి. ఆ నిధులను చాలా మంది ఇతర కుటుంబ అవసరాలకు వాడుకోవడంతో కాలేజీలకు ఫీజులు చెల్లింపులు జరగలేదు. ఫలితంగా విద్యాసంస్థల్లో వేల కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయి, విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిచిపోయే పరిస్థితి దాపురించింది. జగన్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి సుమారు రూ.4,000 కోట్లకు పైగా బకాయిలను భారంగా మిగిల్చింది. ఈ తప్పుడు విధానాల వల్ల విద్యార్థులు, యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి.
నేరుగా కాలేజీలకే నిధులు – పారదర్శక పాలన
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యపై దృష్టి సారించింది. గతంలో మాదిరిగా కాకుండా, ఈ నిధులను నేరుగా కాలేజీల ఖాతాల్లోకే జమ చేసేలా విధానపరమైన మార్పులు చేపట్టింది. తాజాగా విడుదల చేసిన రూ.1,200 కోట్లతో పాత బకాయిలతో పాటు ప్రస్తుత విద్యా సంవత్సరం ఫీజులను కూడా క్లియర్ చేస్తూ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకుంది.
చదువుకోండి.. మీ వెంటే ప్రభుత్వం!
నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులకు మా విజ్ఞప్తి.. విద్యా విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దు. పాత బకాయిలన్నీ తీర్చి, ఇకపై సకాలంలో నిధులు అందేలా చూడటమే మా లక్ష్యం. మీరు ధైర్యంగా చదువుకోండి – మీ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని పేర్కొన్నారు. ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ విద్యా రంగాన్ని గాడిలో పెడుతున్న లోకేష్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
