చిన‌బాబుకి న‌ర‌ఘోష ఎక్కువైంద‌ట‌..!

సెంటిమెంట్ కి కేరాఫ్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. ఏ ప‌ని మొద‌లుపెట్టినా భారీ ఎత్తున పూజ‌లూ పున‌స్కారాలు. ఏ చిన్న స‌మస్య వ‌చ్చినా గ్ర‌హ‌శాంతులు, దోష నివార‌ణ పూజాధికాలు భారీగానే చేస్తారు! ఇవ‌న్నీ అంద‌రికీ తెలిసిన‌వే. అయితే, ఇంత‌గా సెంటిమెంట్లు ఫాలో అయ్యేవారికి లోకేష్ ఇంకోర‌క‌మైన అనుభ‌వాలు ప‌రిచ‌యం చేస్తున్నార‌ని చెప్పాలి. చిన‌బాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన సంగ‌తి తెలిసిందే. బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ సంద‌ర్భంగా ఆయ‌న తెలుగు భాషా పాండిత్యం ఏపాటితో అంద‌రూ చూశారు. ప్ర‌మాణ స్వీకార ప‌త్రం త‌ప్పుల త‌డ‌క‌గా చ‌దివారు. ఆ వీడియో వైర‌ల్ అయిపోయింది. మ‌రి, సెంటిమెంట్ ప్రకారం.. ప్ర‌మాణ స్వీక‌రం రోజునే ఇలా త‌డ‌బ‌డ‌టాన్ని ఏమ‌నుకోవాలి..?

స‌రే, ఆ ఘ‌ట‌న మ‌ర‌చిపోదాం అనుకునే లోపే తాజాగా మ‌రో అనుభ‌వం ఎదురైంది.! శుక్ర‌వారం నాడు వెల‌గ‌పూడిలోని స‌చివాల‌యంలో నారా లోకేష్ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ కార్య‌క్రమం అట్ట‌హాసంగా జ‌రిగింది. తెలుగుదేశం నేత‌లు క‌ళ్లు కాయ‌లు కాచేలా వేచి చూసింది ఈ సంబ‌రం కోస‌మే క‌దా. అందుకే, ఈ కార్య‌క్ర‌మాన్ని మంత్రులూ టీడీపీ నాయ‌కులూ భారీ ఎత్తున వ‌చ్చారు. శాస్త్రోక్తంగా పూజ‌లు చేశారు. పండితుల దీవెన‌లు ఇచ్చారు. అస‌లే యువ‌రాజు ప‌ట్టాభిషేక‌మాయే.. టీడీపీ నేత‌లంతా శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం, ఫైలు మీద సంత‌కం చేయ‌డం కోసం లోకేష్ కుర్చీలో కూర్చున్నారు. సంత‌కం చెయ్యాలంటే పెన్ను కావాలి క‌దా! అదే.. లోకేష్ మ‌ర‌చిపోయి వ‌చ్చారు. దాని కోసం అటూఇటూ త‌డుముకున్నారు.

వెంట‌నే భ‌ద్ర‌తా సిబ్బందిని పెన్ను అడిగారు. వారు అటూఇటూ తిరిగారు. చివ‌రికి, పంచాయ‌తీ రాజ్ శాఖ క‌మిష‌న‌ర్ రామాంజ‌నేయులు త‌న జేబులోని పెన్ను తీసి చిన‌బాబుకి ఇచ్చారు. దాంతో ఆయ‌న ఫైలు మీద సంత‌కం చేశారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైర‌ల్ అయిపోతోంది. యుద్ధానికి క‌త్తి మ‌ర‌చిపోయిన వ‌చ్చిన లోకేష్ అంటూ సెటైర్లు ప‌డిపోతున్నాయి.

విష‌యం వైర‌ల్ అయిపోయింది కాబ‌ట్టి, తెలుగుదేశం కూడా ఈ ప్ర‌చారాన్ని ఖండించే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. పైపెచ్చు, ఇదంతా న‌ర‌ఘోష ఫ‌లితం అంటూ స‌రిపెట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ట‌! అంద‌రి కళ్లూ చిన‌బాబు మీదే ఉన్నాయీ… అందుకే ఇలాంటి చిన్న‌చిన్న‌వి జ‌రుగుతున్నాయ‌ని త‌మ‌దైన సెంటిమెంట‌ల్ భాష‌లో సముదాయించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు స‌మాచారం. పోన్లెండీ… రేప్పొద్దున్న లోకేష్ పాల‌న‌ను ఎలా అర్థం చేసుకోవాలో ఇప్ప‌ట్నుంచే కొన్ని క్లూస్ ఇస్తున్నారు, సంతోషం!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.