వైసీపీ సినిమాకు ఎండ్‌కార్డ్ వేసేది పసుపు సైన్యమేనని నారా లోకేష్ ప్రకటించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. అ గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీకి కేవలం ఒక క్రికెట్ టీమ్ మాత్రమే మిగిలిందని, అహంకారంతో ప్రవర్తిస్తే రాజకీయాల్లో ఏం జరుగుతుందో 2024 ఎన్నికలు నిరూపించాయని ఆయన ఎద్దేవా చేశారు.
యువతకు ఉపాధి కల్పనే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో తమ ప్రభుత్వం 800 కంపెనీలను రాష్ట్రానికి తీసుకువచ్చిందని గుర్తు చేస్తూ, తాజాగా 10,060 పోస్టులతో కూడిన జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసినట్లు ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తున్నామని, రాష్ట్రంలో నిరుద్యోగ రహిత వాతావరణాన్ని సృష్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేస్తూ, సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎక్కడికక్కడ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
గత ఐదేళ్లుగా అక్రమ కేసులు, వేధింపులను ఎదుర్కొని పార్టీని కాపాడుకున్న సైనికులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని లోకేష్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి ప్రాణవాయువని, వారి త్యాగాల వల్లే నేడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని కొనియాడారు. పార్టీ అప్పగించిన వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతను ఒక సవాల్‌గా తీసుకుని, చంద్రబాబు నాయుడి అడుగుజాడల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న శక్తులపై రాజీలేని పోరాటం చేస్తామని లోకేష్ హెచ్చరించారు. అమరావతి రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపనతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు. నూతన కార్యవర్గం అంతా సమన్వయంతో పనిచేసి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకూ చేరవేయాలని సూచించారు.
