ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ , విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో ఆయన అత్యంత బిజీ షెడ్యూల్‌తో గడుపుతున్నారు. సింగపూర్ చేరుకున్న లోకేష్‌కు అక్కడి ప్రవాసాంధ్రులు ఘనస్వాగతం పలికారు. రాయల్ ఎన్ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలను ఏపీకి తీసుకురావడంలో ఆయన పోషించిన పాత్రకు ఎన్ఆర్ఐలు కృతజ్ఞతలు తెలియజేశారు.
మంత్రి లోకేష్ తన పర్యటనను అధికారికంగా జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంతో ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి 11:30 గంటల వరకు ఎంటీఐ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సాగుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్ , సింగపూర్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి సమన్వయ వేదికే ఈ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ . ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం, పట్టణ ప్రణాళిక, మౌలిక సదుపాయాల కల్పన , ఆర్థికాభివృద్ధి రంగాల్లో సింగపూర్ ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు కంపెనీల భాగస్వామ్యాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ తరపున కీలక మంత్రులు, ఉన్నతాధికారులు, సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతినిధులతో కూడిన ఈ కమిటీ.. పెట్టుబడుల ఆకర్షణ, సాంకేతిక బదిలీ , నైపుణ్యాభివృద్ధి వంటి అంశాల్లో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తూ ప్రాజెక్టులు నిర్ణీత కాలపరిమితిలో పూర్తయ్యేలా చూస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ నుంచి నేటి ఆధునిక స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల వరకు సింగపూర్ ప్రభుత్వ సహకారాన్ని సమన్వయం చేయడంలో ఈ కమిటీది కీలక పాత్ర. అమరావతి రాజధాని అభివృద్ధి, పట్టణీకరణ , స్మార్ట్ సిటీ ప్రాజెక్టులలో సింగపూర్ సాంకేతిక సహకారంపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.
మధ్యాహ్నం నుంచి ఆయన వరుసగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు. ప్రఖ్యాత సన్ టెక్ సిటీలో కమోడిటీస్ ఇంటిలిజెన్స్ సెంటర్ సీఈవో, సీఎఫ్ఓలతో సమావేశమై ఆర్థిక, డేటా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. అనంతరం ప్రపంచ ప్రసిద్ధ నిర్మాణ రంగ సంస్థ డీపీ ఆర్కిటెక్ట్స్ ‘ ప్రతినిధులతో సమావేశమై ఏపీలో అత్యాధునిక మౌలిక వసతుల కల్పన, వినూత్న డిజైన్ల అమలుపై తన ఆలోచనలు పంచుకుంటారు.
కేవలం ఐటీ, పరిశ్రమలే కాకుండా విద్యా రంగానికి కూడా లోకేష్ ఈ పర్యటనలో ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 37 మంది ఉపాధ్యాయులను శిక్షణ కోసం సింగపూర్ పంపారు. అక్కడి విద్యా విధానాలను ఏపీలో ఎలా అమలు చేయాలన్న కోణంలోనూ ఆయన అధ్యయనం చేస్తున్నారు.


