ఈ ఒక్క సినిమా విష‌యంలో న‌న్ను క్ష‌మించండి – నారా రోహిత్ తో ఇంట‌ర్వ్యూ

కొత్త క‌థ‌ల్ని, కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నాల్నీ ప్రోత్స‌హించ‌డంలో ఎప్పుడూ ముందుండే క‌థానాయ‌కుడు నారా రోహిత్‌. హీరో ఒంటిచేత్తో కొడితే వంద మంది గాల్లోకి లేచి, పాతిక కిలోమీట‌ర్ల అవ‌త‌ల ప‌డే రొడ్డ‌కొట్టుడు ఫార్ములాల‌కు రోహిత్ వ్య‌తిరేకం. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా – అత‌ని ప్ర‌య‌త్నం లో నిజాయ‌తీ క‌నిపిస్తుంది. అదే.. నారా రోహిత్‌కి ఓ ప్ర‌త్యేక‌త తీసుకొచ్చాయి. రోహిత్ నుంచి సినిమా వ‌స్తోందంటే… క‌చ్చితంగా అందులో విష‌యం ఉంటుంద‌న్న న‌మ్మ‌కానికి వ‌చ్చేస్తున్నారు ప్రేక్ష‌కులు. ఈత‌రానికి కొత్త‌ద‌న‌పు రుచులు ప‌రిచ‌యం చేసిన వాళ్ల‌లో అత‌ని పేరూ వినిపిస్తుంది. అయితే త‌న కెరీర్‌లోనే తొలిసారి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశాడు. అదే.. ‘బాల‌కృష్ణుడు’. రోహిత్ లుక్‌, ట్రైల‌ర్‌, అందులో డాన్సులు చూస్తుంటే – క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్ ప‌ట్టేసిన‌ట్టు అనిపిస్తోంది. ఈ శుక్ర‌వారం ‘బాల‌కృష్ణుడు’ విడుద‌ల అవుతున్న సంద‌ర్భంగా తెలుగు 360.కామ్ నారా రోహిత్‌తో ప్ర‌త్యేకంగా సంభాషించింది.

హాయ్ రోహిత్ గారూ..

హాయ్ అండీ…

మీ కెరీర్‌లో తొలిసారి ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేసిన‌ట్టున్నారు…

ఎప్ప‌టి నుంచో ఈ త‌ర‌హా సినిమా చేయాల‌ని అనుకొంటున్నా. మ‌ధ్య‌లో రెండు క‌థ‌లు కూడా ఓకే చేశా. కానీ అవి మెటీరియ‌లైజ్ కాలేదు. చివ‌రికి ‘బాల‌కృష్ణుడు’ ఓకే చెప్పేశా. ద‌ర్శ‌కుడు ఈ క‌థ చెబుతున్నంత సేపూ నేను న‌వ్వుతూనే ఉన్నా. ఓ ప్రేక్ష‌కుడిగా సినిమాని ఎంజాయ్ చేశా.

మొత్తానికి క‌మ‌ర్షియ‌ల్ మీట‌ర్‌పై దృష్టి పెట్టిన‌ట్టున్నారు..

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌కూడ‌ద‌ని కాదు. నిజానికి ఈత‌ర‌హా సినిమాల‌కే రీచ్ ఎక్కువ ఉంటుంది. శ్రీ‌మంతుడు, జ‌న‌తా గ్యారేజ్ సినిమాల్ని తీసుకోండి. అవి రెండూ వాణిజ్య ప్రధాన‌మైన సినిమాలే. ఓ మంచి మెసేజ్ కూడా అందులో మేళ‌వించారు. స్టార్స్ ఇలాంటి సినిమాలు చేస్తే… ఆ స్థాయి వేరేలా ఉంటుంది. నేను కొత్త త‌ర‌హా సినిమాల్ని చేసుకొంటూ వ‌చ్చాను. నా ప‌ద్ధ‌తి పూర్తిగా అల‌వాటు ప‌డిన త‌ర‌వాత అప్పుడు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేద్దామ‌నుకొన్నా. అందులో భాగంగానే ‘బాల‌కృష్ణుడు’ వ‌స్తోంది.

ఎప్పుడూ కొత్త క‌థ‌ల‌పై దృష్టి పెట్టే మీరు.. ఈ సినిమాలో ఏం చూపించ‌బోతున్నారు?

ఈ సినిమా గురించి ముందే చెప్పేస్తున్నా. ఇదేం కొత్త క‌థ కాదు. మనంద‌రికీ తెలిసిన క‌థే. దాన్ని కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాం. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి ఎప్పుడూ గిరాకీ ఉంటుంది. క్లాస్, మాస్ లేకుండా వినోదాన్ని ఆస్వాదిస్తారు. అలాంటివాళ్లంద‌రికీ ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. ఫృథ్వీతో చేసిన సన్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయి. ఈ సినిమాకి ఆ స‌న్నివేశాలే బ‌లం. ఆ సీన్లు చేస్తున్న‌ప్పుడు ఎంత న‌వ్వుకొన్నానో, తెర‌పై చూస్తున్న‌ప్పుడు కూడా అంతే ఎంజాయ్ చేశా. త‌ప్ప‌కుండా.. ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించే అంశాల్లో ఫృథ్వీ కామెడీ కూడా ఉంటుంది.

నారా రోహిత్ అంటే కొత్త క‌థ అని ఆశించే వాళ్ల‌కు ఏం ఇస్తారు? వాళ్లేమైనా నిరాశ ప‌డ‌తారేమో..?

ఈ ఒక్క సినిమా విష‌యంలో వాళ్లంతా న‌న్ను పెద్ద మ‌న‌సుతో క్ష‌మించాలి.. (న‌వ్వుతూ). నేనెప్పుడూ కొత్త కొత్త జోన‌ర్లు ప్ర‌య‌త్నిస్తుంటా. క‌మ‌ర్షియ‌ల్ సినిమా కూడా ఓ జోన‌రే. ఆ విధంగా చూస్తే నాకిది కొత్త క‌థే.

లుక్ ప‌రంగా చాలా మ‌ర్పు క‌నిపిస్తోంది. ఈ క్రెడిట్ ఎవ‌రికి ఇస్తారు?

నా ద‌ర్శ‌కుడికి, నా టీమ్‌కీ ఇస్తా. ఈమ‌ధ్య బాగా ఒళ్లు చేశా. ఆ సంగ‌తి నాకూ తెలుస్తూనే ఉంది. `రోహిత్ త‌గ్గితే బాగుంటుంది` అని వెబ్ సైట్ల‌లోనూ వార్త‌లు రాశారు. వాళ్లు కూడా ఓ కార‌ణం. ఈ సినిమా చేస్తున్న‌ప్పుడు కొంచెం కొంచెం త‌గ్గ‌డం మొద‌లెట్టా. అందుకే కొన్ని సన్నివేశాల్లో లావుగా, ఇంకొన్ని స‌న్నివేశాల్లో స్లిమ్‌గా క‌నిపిస్తా. ఇక ముందు మ‌రింత త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నిస్తా.

వెబ్ సైట్ల‌లో వార్త‌లు, రివ్వూల‌కు మీరూ ప్రాధాన్యం ఇస్తారా?

ఇవ్వాల్సిందే. సినిమా బాగుంది, బాగోలేద‌ని చెప్పే హ‌క్కు సినిమా చూసేవాళ్ల‌కు ఉంటుంది. త‌మ ఆదాయంలో ఎంతో కొంత వెచ్చింది సినిమా చూస్తారు. ఆ టికెట్ ధ‌ర‌కైనా గౌర‌వం ఇవ్వాల్సిందే. కొన్ని కొన్ని వ్యాఖ్య‌లు హ‌ర్ట్ చేస్తాయి. బాధ ప‌డిన సంద‌ర్భాలున్నాయి. కాక‌పోతే అవి కూడా మ‌న మంచికే అనుకోవాలి.

ఉచ్ఛ‌ర‌ణ బాగుండే అతి కొద్ది మంది తెలుగు క‌థానాయ‌కుల్లో మీరొక‌రు.. తెలుగు భాష‌పై అంత ప‌ట్టు ఎలా వ‌చ్చింది?

తెలుగు ఉచ్ఛ‌ర‌ణ కోసం ప్ర‌త్యేకంగా క్లాసుల‌కు వెళ్లా. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అనే గురువుగారు డిక్ష‌న్ నేర్పించారు. అది సినిమాల్లోకి వ‌చ్చిన త‌ర‌వాత బాగా ఉపయోగ‌ప‌డింది. మ‌రీ ముఖ్యంగా ‘బాల‌కృష్ణుడు’కి బాగా ప్ల‌స్ అయ్యింది. ఈ సినిమాలో నేను తెలంగాణ‌, ఆంధ్రా, చిత్తూరు మాండ‌లికాల్లో మాట్లాడాను. అదంతా ఒక‌ప్పుడు నేను నేర్చుకొన్న పాఠాల వ‌ల్లే.

మీ కెరీర్‌లో ఉత్త‌మ క‌థా చిత్రాలు చాలా ఉంటాయి.. కానీ వాటిలో స‌గం వ‌ర‌కూ బాక్సాఫీసు ద‌గ్గ‌ర నిల‌బ‌డ‌లేక‌పోయాయి. మంచి సినిమా చేసినా ఆడ‌లేద‌న్న బాధ మిమ్మ‌ల్ని ఎప్పుడైనా వెంటాడిందా?

నేనెప్పుడూ కథ‌ల్ని న‌మ్మే సినిమాలు చేశా. అయితే అవేం రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చూసేవాళ్ల కోసం తీసిన‌వి కావు. నా సినిమాలు ఓ వ‌ర్గాన్ని టార్గెట్ చేశాయ‌న్న సంగ‌తి నాకూ తెలుసు. రూ.5 కోట్ల‌తో సినిమా తీసి, రూ.20 కోట్లు రాలేద‌ని బాధ‌ప‌డ‌డంలో అర్థం లేదు. సోలో త‌ర‌వాత అలాంటి మ‌రో రెండు క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసుంటే ఆ లెక్క వేరేలా ఉండేది. కానీ నేనెప్పుడూ అలా ఆలోచించ‌లేదు.

కొత్త ద‌ర్శ‌కుల‌తో ప్ర‌యాణం చేసి రిస్క్ తీసుకొన్న‌ట్టు అనిపించ‌లేదా?

కొత్త ద‌ర్శ‌కుల‌తో చేస్తున్న‌ప్పుడు మంచి, చెడూ రెండూ ఉంటాయి. కొన్ని క‌థ‌లు చెబుతున్న‌ప్పుడు అద్భుతంగా అనిపిస్తాయి. వాటిని తెర‌కెక్కించ‌డంలో అనుభ‌వ‌లేమి క‌నిపిస్తుంది. దాంతో ప‌ల్టీకొడ‌తాయి. కొన్ని కొన్నిసార్లు బ‌డ్జెట్ స‌రిపోదు. రిలీజ్ డేట్ విష‌యంలో స‌మ‌స్య‌లొస్తాయి. అయితే ఫ‌లానా వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చి త‌ప్పు చేశానే అని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ల నుంచి నేను కూడా చాలా విష‌యాలు నేర్చుకోగ‌లిగాను. కొత్త వాళ్ల‌కు అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోతే ఓ అర్జున్ రెడ్డి, ఓ పెళ్లి చూపులు లాంటి సినిమాలు రావు.

మీ పెద‌నాన్న నారా చంద్ర‌బాబునాయుడు మీ సినిమాలు చూస్తుంటారా?

దాదాపు ప్ర‌తీ సినిమా చూస్తారు. జ్యో అత్యుతానంద ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఆ సినిమా రెండుసార్లు చూశార్ట‌. అన్న‌ద‌మ్ముల అనుబంధం నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఆయ‌న కూడా ఓ త‌మ్ముడికి అన్నే క‌దా.. అందుకే బాగా క‌నెక్ట్ అయి ఉంటుంది.

స‌ల‌హాలేమైనా ఇస్తారా?

ఆమ‌ధ్య క‌లిసినప్పుడు ‘బాగా లావ‌య్యావు.. కాస్త త‌గ్గితే బాగుంటుంది’ అన్నారు. అంద‌రూ చెప్పిన మాటే క‌దా. కాక‌పోతే… పెద‌నాన్న చెప్పేస‌రికి… ‘అవును.. మ‌నం త‌గ్గాలి’ అని గ‌ట్టిగా అనుకున్నా.

ఎన్టీఆర్ – బాల‌కృష్ణ‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది?

తార‌క్ నేనూ త‌ర‌చూ క‌లుస్తూనే ఉంటాం. ఫోన్లో మాట్లాడుకొంటాం. బాల‌కృష్ణ‌గారు బాగా ప్రోత్స‌హిస్తారు. మంచి మంచి స‌ల‌హాలిస్తారు. త‌ర‌చూ క‌లుస్తుంటాం. ప్ర‌తి సంక్రాంతికీ నారా వారి ప‌ల్లెకు వెళ్తాం. పండ‌గ‌ల‌ప్పుడు ఫ్యామిలీ గెట్ టుగెద‌ర్స్ ఉంటాయి.

మోక్ష‌జ్ఞ సంగ‌తులేంటి?

ఈమ‌ధ్య మోక్షూని క‌లిశా. త‌ను సినిమా కోసం సిద్ధ‌మ‌వుతున్నాడు. అంద‌రిలా నేనూ మోక్షూ ఎంట్రీ కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నా.

బాల‌య్య‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ ఆశించొచ్చా?

త‌ప్ప‌కుండా. ఆయ‌న కూడా ఇదే మాట చెబుతుంటారు. ‘మ‌న మిద్ద‌రం క‌లిసి చేశామంటే.. సినిమా అదిరిపోవాలి.. ఆ త‌ర‌హా క‌థ కోసం వెదుకుదాం’ అని చెబుతుంటారు.

ప్రొడ్యూస‌ర్‌గా కంటిన్యూ అవుతారా?

త‌ప్ప‌కుండా. విష్ణుతో ‘నీదీ నాదీ ఒక‌టే క‌థ‌’ సినిమా చేస్తున్నా. అది పూర్త‌యిపోయింది. ఓ వెబ్ సిరీస్ చేసే ఆలోచ‌న కూడా ఉంది.

ఓకే.. ఆల్ ద బెస్ట్‌
థ్యాంక్యూ..

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close