స‌మ‌ర్థుడైన మోడీలో ‘సామాన్యుడి’ ఇమేజ్ ఆరాటం..!

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మాట‌కారి అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆ మాట‌కారిత‌న‌మే గుజ‌రాత్ నుంచి ఆయ‌న్ని ఢిల్లీకి చేర్చింది. అదే మాట‌కారిత‌నం ఇప్పుడు ఆయ‌నపై వ్య‌తిరేక‌త పెంచ‌డానికీ కార‌ణ‌మ‌నీ చెప్పొచ్చు. సంద‌ర్భం ఏదైనాస‌రే, ప్ర‌జ‌ల‌ను ఇంప్రెస్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అయితే, ఆయ‌న ధోర‌ణిలో ఇటీవ‌ల క‌నిపించిన మార్పు ఏంటంటే… త‌న‌ని తాను అత్యంత సామాన్యుడిని అని చాటిచెప్పుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు! శుక్ర‌వారం నాడు అనూహ్యంగా ఆయ‌న ఢిల్లీ మెట్రో రైలు ఎక్కేశారు. స్టేష‌న్ లోకి వెళ్లి సెల్ఫీల‌కు ఫోజులిస్తూ హ‌డావుడి చేశారు. సాధార‌ణ ప్ర‌యాణికుడి మాదిరిగా ప్ర‌యాణించారు.

ఇక‌, దేశాన్ని కుదిపేస్తున్న రెండు అత్యాచారం ఘ‌ట‌న‌ల‌పై ఎట్ట‌కేల‌కు మోడీకే స్పందించారు. ఇప్ప‌టికే ఈ ఘ‌ట‌న‌ల‌పై ఆయ‌న స్పందించ‌డం లేద‌నీ, ప్ర‌ధాని స్పంద‌న కోసం దేశం ఎదురుచూస్తోందంటూ కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఇప్ప‌టికే చాలా హ‌డావుడి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మోడీ మాట్లాడుతూ… ఇలాంటి ఘ‌ట‌న‌లు నాగ‌రిక స‌మాచారంలో జ‌ర‌గాల్సినవి కావ‌న్నారు. మ‌న స‌మాజం సిగ్గుప‌డాల్సిన ప‌రిస్థితి ఇద‌నీ, తాను దేశానికి హామీ ఇస్తున్నాన‌నీ, మ‌న ఆడ‌బిడ్డ‌ల‌కు న్యాయం జ‌రిగేలా కృషి చేసి, దోషులు ఎంత‌టివారైనా శిక్ష ప‌డేలా చేస్తాన‌ని మోడీ మాటిచ్చారు! ఆ త‌రువాత‌, ద‌ళితులు అణ‌గారిన వ‌ర్గాల కేసుల‌ను త్వ‌ర‌తగ‌తిన ద‌ర్యాప్తు చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల‌ను ఏర్పాటు చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించారు. అంబేద్క‌ర్ ఆశ‌యాల సాధ‌న‌కు తాము కృషిచేసినంత‌గా గ‌తంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎన్న‌డూ ప్ర‌య‌త్నించ‌లేద‌ని ఆరోపించారు.

తాను నిరుపేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన కుటుంబంలో జ‌న్మించి ఉండ‌క‌పోతే.. అంబేద్క‌ర్ ఆశ‌యాలూ సిద్ధాంతాలూ త‌న‌కి తెలిసి ఉండేవి కావేమో అన్నారు! తాను నిరుపేద కుటుంబంలో పుట్టాను కాబ‌ట్టి, వారి క‌ష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోగ‌ల‌నని చెప్పారు. దేశానికి అంబేద్క‌ర్ చేసిన చేసిన సేవ‌ల్ని చెరిపేయాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నించింద‌నీ, ఆయ‌న పేరును చ‌రిత్ర‌లో లేకుండా చేయాల‌ని అనుకుంద‌న్నారు! ఇదీ ప్ర‌ధాని మాట‌ల్లో ప్ర‌ధానాంశాలు! తాను నిరుపేద కుటుంబం నుంచి వ‌చ్చాన‌నీ, టీ అమ్ముకుంటూ జీవితం ప్రారంభించి ఈ స్థాయికి ఎదిగాన‌నీ… ఈ మ‌ధ్య ఇలా చాలా సంద‌ర్భాల్లో మాట్లాడుతున్నారు. విప‌క్షాల‌న్నీ ఏక‌మై త‌న‌ను ఒంట‌రివాడిని చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయంటూ మొన్న‌టికి మొన్న ఒక‌రోజు నిర‌హార దీక్ష‌కు ముందు వ్యాఖ్యానించారు. ఓప‌క్క దేశ‌వ్యాప్తంగా బ‌ల‌హీన వ‌ర్గాల నుంచి మొద‌లైన వ్య‌తిరేక‌త‌ను ఎదుర్కొనేందుకు ఈ మార్గంలో ప్ర‌య‌త్నిస్తూనే… ఇంకోప‌క్క సింప‌థీ కోసం మోడీ ఆరాట‌ప‌డుతున్న‌ట్టుగా క‌నిపిస్తోంది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.