కాంగ్రెస్ పై మోడీ ఎదురు దాడి

మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ బుధవారం లోక్ సభలో చెలరేగిన రాహుల్ గాంధీకి గట్టి కౌంటర్ ఎదురైంది. పక్కా హోం వర్క్ తో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన రాహుల్ గాంధీ ప్రసంగం ఆ పార్టీ వారికే కాదు, ఇంకా చాలా మందికి నచ్చింది. అయితే గురువారం ప్రధాని నరేంద్ర మోడీ అదే లోక్ సభా వేదికపై బలంగా ఎదురు దాడి చేశారు. రాహుల్ గాంధీ పేరును ప్రస్తావించకుండానే విమర్శల దాడి చేశారు.

ఈసారి మోడీ ప్రసంగం వినూత్నంగా సాగింది. కాంగ్రెస్ నాయకులకు తాను చెప్పదలచుకున్నది చెప్పారు. చేయాలనుకున్న హితబోధ చేశారు. పార్లమెంటును అడ్డుకోవడం పద్ధతి కాదంటూ తలంటారు. అయితే, ఇవన్నీ నా మాటలు కాదంటూ మాజీ ప్రధానుల వ్యాఖ్యలను ప్రస్తావించారు. సభలో చర్చ గురించి, హుందా తనం గురించి, సభ్యుల బాధ్యతల గురించి గతంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మోడీ ఉటంకించారు.

ఈ మధ్య పార్లమెంటులో, ముఖ్యంగా రాజ్యసభలో చాలా సమయం అరుపులు కేకలతో వృథా అవుతోంది. దీనివల్ల విలువైన ప్రజాధనం వృథా అవుతుందని మోడీ అన్నారు. చర్చద్వారా ప్రజలకు మేలు చేయడానికి పార్లమెంటు ఉత్తమ వేదిక అంటూ మాజీ ప్రధానులు వివిధ సందర్భాల్లో చేసిన ప్రసంగాలను మోడీ ప్రస్తావించారు. అలాగే, సీపీఎం కు చెందిన మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా మోడీ ఉటంకించారు. దీంతో, మోడీ ప్రసంగాన్ని అడ్డుకోలేక, తమ పూర్వీకుల వ్యాఖ్యలను తప్పు పట్టలేక కాంగ్రెస్ నాయకులు మౌనంగా వినడం తప్ప మరేమీ చేయలేకపోయారు. ఈ ప్రసంగంపై కనీసం నిరసనగా నినాదాలు చేసే అవకాశం లేని విధంగా మోడీ వ్యూహాత్మకంగా ప్రసంగించారు.

జీఎస్టీ బిల్లు వంటివాటిని ఎందుకు అడ్డుకుంటున్నారని కాంగ్రెస్ ను సూటిగా ప్రశ్నించారు. మేకిన్ ఇండియాను ఎందుకు అవహేళన చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వ పథకం సరిగా అమలు కాకపోతే, ఏం చేస్తే బాగుంటుందో సూచనలు ఇవ్వవచ్చు కదా అని ప్రశ్నించారు. అడుగడుగునా కాంగ్రెస్ ను తప్పుపడుతూ మోడీ తన వాగ్ధాటిని ఉపయోగించారు. ఎక్కడా ఆవేశపడలేదు. అరవలేదు. కూల్ గా, తాను చెప్పదలచుకున్న విషయాలు చెప్పారు.

పనిలో పనిగా మోడీ కొన్ని సూచనలు కూడా చేశారు. ఈనెల 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోజు పార్లమెంటులో మహిళా సభ్యులు మాత్రమే మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. దీంతో బీజేపీకి చెందిన మహిళా సభ్యులు హర్షధ్వానాలు చేశారు. పార్లమెంటు పనితీరు మెరుగుకు ఆయన మరికొన్ని సూచనలు చేశారు మొత్తం మీద, చర్చకు బదులు రచ్చ చేయడం పద్ధతి కాదు, మీ పూర్వీకులే ఈ మాటలు చెప్పారంటూ కాంగ్రెస్ వారికి చురకలు అంటించారు. ఇక ముందైనా సభ సాఫీగా జరుగుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. దీన్ని బట్టి, ఇక ముందు రచ్చ చేస్తే పలుచన అవుతామేమో అని కాంగ్రెస్ ఆలోచనలో పడాలనేది మోడీ వ్యూహం కావచ్చు. మొత్తానికి మోడీ ప్రసంగానికి కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుందో లేక సాఫీగా చర్చలకు, బిల్లుల ఆమోదానికి సహకరిస్తుందో చూద్దాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com