మోదీ ఇచ్చారు కాస్తంత మట్టి

మోదీ వస్తారు. ఎవో కానుకలు పట్టుకొస్తారనుకున్న వారికి ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాళ అమరావతిలో చేసిన ప్రసంగం ఏమాత్రం రుచించలేదు. ఏపీ హోదా సంగతి దెవుడెరుగు, కనీసం స్పెషల్ ప్యాకేజీ అయినా ప్రకటిస్తారని తెలుగువారు ఆశించారు. తాము కోరకపోయినా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారనీ, ఇప్పుడు ప్రధాని మోదీ గట్టి ప్యాకేజీ ప్రకటిస్తే బాగుండేదన్న అభిప్రాయం ఆంధ్రా ప్రజల్లో ఏర్పడింది. అయితే, పార్లమెంట్ ప్రాంగణం నుంచి మట్టిని, యమునా నది నుంచి పవిత్ర నీటిని తీసుకువచ్చిన మోదీ ఎంతో భావోద్వేగంతో తాను పూర్తిగా సహకరిస్తామని అన్యాపదేశంగా చెప్పడమే ప్రస్తుతానికి మనకు కలిగిన ఊరట. విభజన చట్టంలోని అన్ని అంశాలకు సంపూర్ణంగా న్యాయం చేస్తాని చెప్పడం కేవలం హామీ లాంటిదే. అలాకాకుండా స్పెషల్ ప్యాకేజీ వంటిది ప్రకటిస్తే నూతనోత్సాహం వెల్లివిరిసేది. మొత్తానికి ఇటు చంద్రబాబు, అటు ప్రధాని మోదీ భావోద్వేగాల రాజధాని నిర్మిస్తున్నట్లు కనబడుతోంది. మొత్తానికి వీరిద్దరూ కలసి అమరావతి రాజధాని శంకుస్థాపన ఘట్టాన్ని భేషుగ్గా పూర్తయిందన్న భ్రాంతిని ప్రజల్లో కలిగించినట్లున్నారు.

ప్రసంగంలోని ముఖ్యాంశాలు

కేంద్రానికీ, ఏపీకి మంచి అనుబంధం ఉంది.

ఎక్కడా విబేధాలు లేవు

మానవ వనరుల అభివృద్ధికి ఏపీలో చాలా అవకాశం ఉంది.

అందుకుతగ్గట్టుగా వివిధ సంస్థలు ఏర్పాటు చేయాల్సిన అవసరం గుర్తించాం.

వాటిని మంజూరు చేయడం జరిగింది

నా మట్టి, నా నీరు పథకం గురించి తెలియగానే నేను కూడా అలాగే తెచ్చాను

యమునా నది నుంచి పవిత్ర నీరు తెచ్చాను.

మట్టి తీసుకురావడమంటే మీ అభివృద్ధిలో కలసిఉంటామనే అర్థం

విభజన అనంతరం కూడా కొంతమంది రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

కొత్త నగరాల ఏర్పాటులో సమస్యలుంటాయి.

నగరాలు భూకంపం వంటి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేవిలా ఉండాలి.

అమరావతికి రమ్మనమని కేసీఆర్ ని చంద్రబాబు ఆహ్వానించినట్లు తెలుసుకుని చాలా సంతోషించాను.

భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఆనాటి పాలకులు రాష్ట్రాన్ని విభజించారు.

విభజనకు ముందు రెండు ప్రాంతాల్లో అపార నష్టం కలిగింది. అది నాకు చాలా బాధ అనిపించింది.

సమస్యలు పరిష్కరించకపోవడంతోనే ఆంధ్రా, తెలంగాణ మధ్య ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

రాష్ట్రాలు వేరైనా తెలుగు ఆత్మ ఒక్కటే. ఈ రెండు భుజంభుజం కలిపి పనిచేస్తే భారత్ కు మరింత బలం చేకూరుతుంది.

తెలుగువారి తెలివి అమోఘమైంది. వారు మంచిమంచి ఉద్యోగాల్లో ఉన్నారు.

యువకులపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ రాబోతుంది.

రెండు తెలుగురాష్ట్రాలు విడిపోయినా కలసి పనిచేస్తే అభివృద్ధి చెందుతాయి. అలా చేస్తాయన్న విశ్వాసం నాకుంది.

గతంలో వాజ్ పేయి హయాంలో మూడు రాష్ట్రాలు కొత్తగా ఏర్పాటైనా అవి కలసిమెలసి అభివృద్ధి పథంలో సాగాయి.

శతాబ్దాల చరిత్రకలిగి, వారసత్వం కలిగిన ఈ నాగరికవాసులు వాటన్నింటినీ గుర్తుచేసుకునేవిధంగా కొత్త రాజధాని నిర్మించుకుంటున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజుల్లోనే ప్రపంచంలోని ఎక్కెడెక్కడి మంచి ఆలోచనలను, సాంకేతిక జ్ఞానాన్ని సేకరించి ఇవ్వాళ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు చంద్రబాబు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మంచి నగరాల ఏర్పాటు జరగలేదు. అందుకే మంచి నగరాల ఆవశ్యకత ఉంది.

ప్రపంచదేశాలు శాస్త్రీయ సాంకేతిక నగరాలను ఎలా నిర్మిస్తున్నాయో, అదేవిదంగా మనదేశం కొత్త నగరాలను నిర్మించాలని భారత్ భావిస్తోంది.

కొత్త నగరాల్లో ప్రజల జీవనంలో మెరుగుదల ఉంటుంది.

వాహనాల అవసరం లేకుండా నడిచివెళ్ళి పనిచేసుకునే విధంగా , వ్యర్థాలు లేని నగరాలను మనం నిర్మించుకోవాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com