Nari Nari Naduma Murari Telugu Review
Telugu360 Rating: 2.75/5
చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది సామజవరగమన. ఇప్పుడు అదే క్రియేటివ్ టీంతో శర్వానంద్ హీరోగా తయారైన సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. నిర్మాత అనిల్ సుంకరకి దర్శకుడు రామ్ అబ్బరాజు, రైటింగ్ టీం మీద మంచి గురి. అందుకే సంక్రాంతికి ఇంత భారీ పోటీలో కూడా చివరాఖరి సినిమాగా జనవరి 14 సాయంత్రం ఆటతో రిలీజ్ చేశారు. మరి నిర్మాతల నమ్మకం నిజమైందా? రేసులో లేటుగా వచ్చిన ఈ సినిమా లేటెస్ట్ విజయాన్ని అందుకుందా?
గౌతమ్ (శర్వానంద్), నిత్య (సాక్షి వైద్య) ప్రేమించుకుంటారు. నిత్య తండ్రి మిర్చి సంపత్ మొదట్లో వారి ప్రేమకి విముఖత చూపించినప్పటికీ చివరికి అంగీకరిస్తాడు. అయితే ఒక కండిషన్ పెడతాడు – పెళ్లి రిజిస్టర్ ఆఫీస్‌లో జరగాలి. సరిగ్గా ఇదే సమయంలో గౌతమ్ మాజీ ప్రేయసి దియా (సంయుక్త) తను పని చేస్తున్న ఆఫీస్‌లో జాయిన్ అవుతుంది. తర్వాత ఏం జరిగింది? దియా – గౌతమ్ ప్రేమ సంగతి నిత్యకి తెలిసిందా? ఈ రిజిస్టర్ పెళ్లి కండిషన్ వల్ల గౌతమ్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.
ప్రతి కథకి ఒక యూఎస్పీ ఉండాలి. అది ఉంటే సినిమా సగం సక్సెస్ అయిపోయినట్టే. సామజవరగమనకి ఒక యూఎస్పీని పట్టుకున్నాడు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ప్రేమించిన అమ్మాయి వరసకి చెల్లి అయితే పరిస్థితి ఎలా ఉంటుందనే పాయింట్ మీద కథనం అల్లుకున్నాడు. నిజానికి అలాంటి థాట్‌తో అప్పటికి ఏ సినిమా రాలేదు. దీంతో ప్రతి సీన్‌కి ఓ కొత్తదనం వచ్చింది. నారీ నారీ నడుమ మురారికీ ఓ యూఎస్పీ ఉంది. మణిరత్నం ‘సఖి’ కథని మరో యాంగిల్లో ఆలోచించాడు దర్శకుడు. ఇంతకంటే ఎక్కువ చెబితే స్పాయిలర్ అవుతుంది. నిజంగా ఈ పాయింట్‌తో ఇప్పటివరకు ఏ సినిమా రాలేదు. చెప్పడానికి ఒక కొత్త పాయింట్ ఉన్నప్పుడు కథనం ఆటోమేటిగ్గా సమకూరుతుంది. సామజవరగమన స్టయిల్లో ఈ పాయింట్‌ని హిలేరియస్‌గా ప్రజెంట్ చేసే ప్రయత్నం కుదిరింది.
నరేష్ ‘మళ్ళీ పెళ్లి’ ఎపిసోడ్‌తో కథని మొదలుపెట్టిన వైనం మంచి కామెడీ టచ్ ఇచ్చింది. ఆటో డ్రైవర్ లవకుశ పాత్రలో సత్య పంచిన హాస్యం ఆ తర్వాత శర్వా ప్రేమకథ కూడా చకచక తెరపైకి వస్తుంది. కేరళ నేపధ్యంలో సాగే సన్నివేశాలు కాస్త నింపాదిగా ఉన్నప్పటికీ, ఆ ఎపిసోడ్ పూర్తయిన తర్వాత వచ్చే టాటూ రిమూవల్ సీక్వెన్స్ భలే నవ్విస్తుంది. దియా, గౌతమ్ ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే రిజిస్టర్ ఆఫీస్ సీన్ ఈ కథకు ఆయువు పట్టు. సునీల్ పాత్రతో అక్కడ వేసిన ముడి ఈ కథని ముందుకు నడిపే ప్రధాన ఇంధనంగా మారింది. దియా మళ్లీ గౌతమ్ జీవితంలోకి వచ్చిన విధానం రొటీన్‌కి భిన్నంగా డిజైన్ చేశారు. అది సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకొచ్చింది.
ఈ సినిమా కథ, హీరో టార్గెట్, క్లైమాక్స్ ఎలా ఉండబోతుందనేది ఫస్ట్ హాఫ్‌లోనే ఓపెన్ చేసి పెడతారు. సెకండ్ హాఫ్‌లో కూడా అదే టార్గెట్ చుట్టూ గౌతమ్ పాత్ర తిరగడంతో ఇందులో కొన్ని సీన్స్ రిపీట్‌గా అనిపించే ఛాన్స్ ఉంది. నిజానికి చాలా చిన్న లైన్ ఇది. దర్శకుడు కథ కంటే ఫన్ పండించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రతి సీన్లో కనీసం ఒక్క డైలాగ్ అయినా నవ్వించేలా చూసుకున్నాడు. అది చాలా వరకు వర్క్ అవుట్ అయ్యింది. కోర్ట్ సీన్, సీమంతం, బర్త్‌డే పార్టీ, గుణశేఖర్ (వెన్నల కిషోర్) ట్రాక్ సెకండ్ హాఫ్‌లో వినోదానికి ఓ భుజం కాశాయి. ఈ కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు కూడా లైటర్ వెయిన్‌లో ఉంటుంది.
కథ కంటే ఇందులో క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. గౌతమ్ పాత్రని శర్వా భలే యీజ్‌తో చేశాడు. చాలా చిల్‌గా ఉండే క్యారెక్టర్ అది. ఇందులో తన లుక్స్, టైమింగ్ అన్నీ యూత్‌ఫుల్‌గా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత శర్వాని ఇంత లైవ్లీ క్యారెక్టర్లో చూడటం ఫ్రెష్‌గా అనిపించింది. నిజంగా తను ఇలాంటి కథలపై దృష్టి పెడితే బెటర్.
ఈ సినిమాకి సెకండ్ హీరో నరేష్. కార్తిక్ పాత్రలో ఆయన పంచిన వినోదం సూపర్ అంతే. ఆయన నటించినందుకు, తన పర్సనల్ లైఫ్ పాత్రని ఈ సినిమా కోసం ఇచ్చినందుకు డబుల్ రెమ్యునరేషన్ ఇవ్వాలి. ఆ పాత్రపై పడే సెటైర్లు మామూలుగా ఉండవు. సెల్ఫ్ సెటైర్‌ని ఆయన చాలా పాజిటివ్‌గా తీసుకుని నవ్వేసిన తీరు భలే ముచ్చటగా ఉంటుంది. బ్రో డాడీ కామెడీని కావాల్సినంతగా వాడుకున్నారు. “తండ్రి కొడుకులు కలసి మందుకొట్టడం చూశాను. దమ్ముకొట్టడం చూశాను. సినిమాకి వెళ్ళడం చూశాను. కానీ ఒకేసారి విడాకులు తీసుకోవడం ఎక్కడా చూడలేదు” అని నెల్లూరు సుదర్శన్ చెప్పే డైలాగ్‌కి థియేటర్ ఒక్కసారిగా నవ్వులతో ఊగిపోయింది. ఇలాంటి ఫన్ లైన్స్ సినిమాలో బోలెడు ఉన్నాయి.
సంయుక్త పాత్ర పరిధి తక్కువే కానీ ఈ కథకి ఎమోషనల్ టచ్ ఇచ్చిన క్యారెక్టర్ అది. రొటీన్‌కి భిన్నంగా ఉంటుంది. సాక్షి పెర్ఫార్మెన్స్ డీసెంట్‌గా ఉంది. సునీల్ పాత్రలో కావాల్సిన ఫన్ పండింది. సత్యని లిమిటెడ్‌గా వాడుకున్నారు. ఆయన కనిపించిన ప్రతి సీన్ నవ్వించాడు. జాకీ క్యారెక్టర్లో సుదర్శన్ మంచి ఫన్ ఇచ్చాడు. జాకీ పేరుకి చివర్లో వచ్చిన జస్టిఫికేషన్ కూడా ఇస్తాడు శ్రీవిష్ణు. ఆయన కనిపించింది కాసేపైనా తన ప్రెజెన్స్, డైలాగ్ డిక్షన్ ఎనర్జీ యాడ్ చేసింది. గుణశేఖర్‌గా వెన్నెల కిషోర్ ‘అతి’ గురుభక్తి నవ్వించింది. మిర్చి సంపత్, గెటప్ శీను దాదాపు ప్రతి పాత్ర ఎంతోకొంత వినోదాన్ని యాడ్ చేసింది.
సినిమాకి మ్యూజిక్ వీక్ అయ్యింది. ఆహ్లాదంగా, అల్లరిగా అనిపించిన బీజీఎం తప్పితే ఒక్క సాంగ్ కూడా రిజిస్టర్ కాలేదు. సీతారామం లాంటి ఆల్బమ్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ సరైన పాటలు ఇవ్వకపోవడం ఒక లోటే. కెమెరా, ఆర్ట్ వర్క్ డీసెంట్‌గా ఉన్నాయి. కథ తగ్గట్టుగా నిర్మాణ విలువలు కనిపించాయి. డైలాగులకు స్పెషల్ మార్కులు పడిపోతాయి. ఈ సినిమాని నిలబెట్టింది డైలాగులే. ఏవో ప్రాసల కోసం రాసినట్టుగా కాకుండా, క్యారెక్టర్, సిట్యువేషన్‌కి తగ్గట్టుగా రాయడం మెచ్చుకోదగ్గ అంశం. అక్కడక్కడా ద్వంద్వార్థాలు ధ్వనిస్తాయి కానీ అవి మరీ కంప్లయింట్ చేసేలా ఉండవు.
కంప్లీట్ ఫ్యామిలీ సినిమా ఇది. దర్శకుడు కుటుంబం మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనే ఉద్దేశంతో తీశాడు. సామజవరగమన లాంటి ఫన్ని ఆస్వాదించిన ఆడియన్స్‌కి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చేస్తుంది.
మొత్తంగా చూస్తే, నారీ నారీ నడుమ మురారి శర్వానంద్‌కు మరో డీసెంట్ సినిమా, అలాగే మరో సంక్రాంతి సీజన్ సక్సెస్. థియేటర్లో చూసేయండి
Telugu360 Rating: 2.75/5


