ఏమిటేమిటి..? వైసీపీకి 23 …టీఆర్ఎస్‌కు పదేనా.. ?

“నువ్వు నాకు నచ్చావ్‌” సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఎందుకురా… కొట్టకుండానే అరుస్తున్నావంటే… తర్వాత ఏడవలేమోనని.. అని సునీన్ చెబుతాడు. ఇప్పుడు… జాతీయ మీడియాలో సర్వేలు చూస్తే పరిస్థితి ఇలానే వస్తోంది. ఏ మాత్రం నమ్మశక్యం కానీ.. అంకెలు వేసి.. క్షేత్ర స్థాయి పరిస్థితులపై ఏ మాత్రం అవగాహన లేకుండా .. విడుదల చేస్తున్న సర్వేలు ఎందుకో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీలో వైసీపీ దానినే సర్టిఫికెట్లుగా … ఎన్నికల ఫలితాలుగా.. అచ్చేసుకుని… ప్రచారం చేసుకుంటోంది. నిజానికి ఇలాంటి ఫలితాలు ఆయా సర్వే సంస్థలు విడుదల చేస్తాయని.. ముందుగానే… సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్ ను అలర్ట్ చేసి మరీ హంగామా చేస్తున్నారు… వైసీపీ నేతలు. ఎన్నికలకు సన్నద్ధం కాకుండా కాళ్లూపుకుంటూ కూర్చుని.. ఈ సర్వేలపై ఇంత హడావుడి పడుతున్నారంటే.. సునీల్ చెప్పినట్లు తర్వాత హడావుడి చేయలేమేమోననే సమాధానమే రావొచ్చు.

జాతీయ మీడియా సర్వేలు.. ఎంత వాస్తవ విరుద్దంగా ఉన్నాయో.. ఇటీవలి కాలంలో ఎన్నో ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. ఆయా మీడియా సంస్థలు.. తమకు అందిన ప్యాకేజీ ప్రకారం.. సీట్ల లెక్కలు వేస్తూ ఉంటాయని.. తెహల్కా, కోబ్రాపోస్ట్ లాంటి సంస్థలు… స్టింగ్ ఆపరేషన్ల ద్వారా బయటపెట్టాయి. కానీ ప్రజల నాడిని ఎంతో కొంత మంది వారి అభిప్రాయాల్లో మార్పు తెద్దామని.. కొన్ని రాజకీయ పక్షాలు మాత్రం.. మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటిలో వైసీపీ ముందు ఉంది. గత ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో.. చేసిన సర్వేలు.. చివరికి తెలుగు చానల్ ఎన్టీవీలో కూడా… తమకు అనుకూలమైన సర్వేలు ప్రసారం చేసేలా ప్యాకేజీ మాట్లాడుకున్నారన్న విషయం .. ఫళితాలతోనే తేలిపోయింది. ఎన్నికలకు ముందు ఇప్పుడు.. అదే ప్లాన్ వర్కవుట్ చేస్తున్నారు. అయితే అత్యుత్సాహంతో… వాటిని మొదలుకే నమ్మలేని పరిస్థితి తీసుకొస్తున్నారు.

తెలంగాణలో రెండు నెలల కిందటే ప్రజాభిప్రాయం వెల్లడయింది. చాలా ఏకపక్షంగా ఓటింగ్ జరిగింది. ఏ విధంగా చూసినా… అది సర్వే కాదు. పూర్తిగా బ్యాలెట్ ఓట్ల ద్వారా తేలిన నిర్ణయం. అంటే.. దాదాపుగా పదిహేను నియోజకవర్గాల్లో లక్షల ఓట్లతో టీఆర్ఎస్ ముందు ఉంది. అలాంటప్పుడు… ఆ పదిహేనులో.. ఐదు ఏ విధంగా టీఆర్ఎస్ కోల్పోతుంది. అసలు టైమ్స్ నౌ -వీఎమ్మార్ సర్వేలో.. టీఆర్ఎస్ కు పది.. కాంగ్రెస్ కు ఐదు సీట్లు .. బీజేపీకి ఒక సీటు రావడమే ఓ పెద్ద జోక్. బీజేపీకి సీటు కాదు.. డిపాజిట్ రాదని.. రాజకీయాలపై కనీస పరిజ్ఞానం ఉన్న వారు కూడా చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పరిస్థితి చూస్తే.. ఐదు సీట్లు వస్తాయని ఎవరూ అనుకోరు. అలాగే.. ఏపీలో వైసీపీకి 23 సీట్లు వస్తాయంటే.. అక్కడి ప్రజలు కూడా పగలబడి నవ్వుకుంటున్నారు. ఇలాంటి సర్వేలకు జగన్ మీడియా ప్రయారిటీ ఇచ్చి జగన్‌కు కాన్ఫిడెన్స్ నింపే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవ పరిస్థితుల్ని అంచనా వేసుకోలేకపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com