‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే చిత్రం కావాలి – కె.సి.ఆర్

నందమూరి నటసింహ బాలకృష్ణ 43 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకులను, నందమూరి అభిమానులను అలరిస్తూ.. వారికి నచ్చేవిధంగా అందరూ మెచ్చేవిధంగా 99 సినిమాలను పూర్తి చేశారు. ఏ పాత్ర ఇచ్చినా అందులో పరకాయ ప్రవేశం చేసి తన సహజ సిద్ధమైన నటనతో అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్నారు. జానపద, సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక చిత్రాల్ని చేసి తనకు తానే సాటి అని నిరూపించుకుని తండ్రికి తగ్గ తనయుడుగా ఖ్యాతి గడించారు. బాలయ్య వందో చిత్రం ఎప్పుడెప్పుడు స్టార్ట్‌ అవుతుందా! ఆ చిత్రం ఎలా వుంటుంది అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అందరి అంచనాలకు థీటుగా బాలయ్య వందో చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ‘గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, కంచె’ చిత్రాలను రూపొందించి కేవలం నాలుగు చిత్రాలైనా దర్శకుడిగా తానేంటో నిరూపించుకున్నారు క్రిష్‌. ‘కంచె’ చిత్రంతో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డ్‌ని కైవసం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. తెలుగు జాతిని ఏకఛత్రాధిపత్యంలో పరిపాలించిన 23వ రాజు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఆ మహానుభావుడి జీవిత కథాంశంతో నందమూరి నటసింహ బాలకృష్ణ – జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌) దర్శకత్వంలో ఫస్ట్‌ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌పై బిబో శ్రీనివాసరావు సమర్పణలో కొమ్మినేని వెంకటేశ్వరరావు ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు సంయుక్తంగా నిర్మిస్తోన్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఏప్రిల్‌ 22న హైదరాబాద్‌ అన్నపూర్ణ 7 ఏకర్స్‌ స్టూడియోలో సినీ, రాజకీయ ప్రముఖులు, నందమూరి అభిమానుల సమక్షంలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, దర్శకరత్న డా. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేష్‌, ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు, కోదండ రామిరెడ్డి, బి.గోపాల్‌, బోయపాటి శ్రీను, శ్రీవాస్‌, ప్రముఖ నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, అంబికా కృష్ణ, నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, 14 రీల్స్‌ అధినేతలు రామ్‌, గోపీ, అనీల్‌ సుంకర, సాయి కొర్రపాటి, ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌-లక్ష్మణ్‌, పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, చిత్ర యూనిట్‌ సభ్యులు పాల్గొన్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం నటసింహ బాలకృష్ణపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు క్లాప్‌ కొట్టగా, మెగాస్టార్‌ చిరంజీవి కెమెరా స్విచాన్‌ చేశారు. విక్టరీ వెంకటేష్‌ కెమెరాని ఆపరేట్‌ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకరత్న డా. దాసరి గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, సింగీతం శ్రీనివాసరావులు స్క్రిప్ట్‌ని దర్శక, నిర్మాతలకి అందజేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మాట్లాడుతూ – ”నాకు అత్యంత అభిమాన నటులైన నటరత్న ఎన్టీఆర్‌ గారి అబ్బాయి బాలకృష్ణ గారు నూరవ చిత్రానికి చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఇది చిన్న విషయం కాదు. ఒక శకానికి నాంది పలికినటువంటి పురుషుడు గౌతమీపుత్ర శాతకర్ణుడు. అంతకు ముందు మన తెలుగు జాతికి తెలిసిన పద్ధతిలో బిఫోర్‌ క్రైస్ట్‌, ఆఫ్టర్‌ క్రైస్ట్‌ అనే పద్ధతిలో మనం ఉన్నాం. కానీ వందవ చిత్రానికి బాలకృష్ణగారు తెలుగు ప్రజలందరికీ చిరకాలం గర్వంగా గుర్తుండిపోయే విధంగా ఈ సినిమా నిర్మించ తలపెట్టడం చాలా సంతోషంగా ఉంది. బాలకృష్ణకంటే కొంచెం నేను పెద్ద కాబట్టి అన్నగారి అభిమానిగా బాలకృష్ణగారికి నా హృదయపూర్వక ఆశీస్సులు, నా దీవెనలు. బాలయ్య వందో చిత్రం ఖచ్చితంగా వంద రోజులు ఆడుతుంది అని చెప్పగలను. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి ప్రతి తెలుగు వారు తెలుసుకోవాల్సిన అవసరం వుంది. తను వందో చిత్రం చేయడమే కాకుండా తెలుగు వారికి, నందమూరి కుటుంబానికి వున్న అభిమానం, ప్రేమ తెలియచెప్పడానికి తెలుగుతనాన్ని మరోసారి ప్రపంచానికి తెలియ చెప్పడానికి మద్రాసీయులు అని పిలవబడుతున్న తెలుగు వారిని ఆంధ్రప్రదేశ్‌ అనేది ఒకటి వుంది. తెలుగు జాతి ఒకటి వుంది అని తెలియ చేసినటువంటి మహానాయకుడు ఎన్‌.టి. రామారావుగారు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డ ఆయన. ఇటీవల హైదరాబాద్‌లో అంబేద్కర్‌ విగ్రహం పెడుతుంటే కొంత మంది దుష్ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో వున్న ఎన్టీఆర్‌ గార్డెన్‌ ఏదైతే వుందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్‌ గార్డెన్‌గానే ఉంటుంది. ఎందుకంటే ఎన్‌.టి. రామారావుగారు ఒక తరం నటుడు కాదు. తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప బిడ్డ. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలకు పోయినా ఎన్టీఆర్‌ గారి గురించి, ఆయన కుటుంబం గురించి తెలియని వారు లేరు. అంతటి మహా నాయకుడు, గొప్ప వ్యక్తి స్మారక చిహ్నాన్ని తెలుగు వారు గుండెల్లో పెట్టి చూసుకునే గొప్ప అవకాశం. వారి కొడుకు బాలకృష్ణ వందవ చిత్రం అన్నివిధాలుగా విజయవంతం కావాలని ఇంతమంది పెద్దల సమక్షంలో ప్రారంభమైన ఈ సినిమా వేగవంతంగా షూటింగ్‌ పూర్తి చేసుకుని తెలుగు జాతి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా మిగిలిపోతుంది. సినిమా రిలీజ్‌ అయ్యాక మొట్టమొదటి బ్యాచ్‌లో నాకు సినిమా చూపించాలి. మన చరిత్రకు సినిమా కాబట్టి మా ఫ్యామిలీ అంతా కలిసి చూడాలని ఆశపడుతున్నా. ఈ స్టేజిమీద ఉన్న బ్యాచే ఫస్ట్‌ ఆడియన్స్‌ కావాలని అందుకు బాలకృష్ణ అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను” అన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ – ”వందవ చిత్రమనేది చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వందవ చిత్రంగా నిర్ణయం తీసుకోవడం మొట్టమొదటి విజయంగా భావిస్తున్నా. ఇది మైలురాయిలాంటి సినిమా. ఈ వందవ చిత్రం బాలకృష్ణగారి చరిత్రలో అపూర్వమైనటువంటి సినిమాగా మిగిలిపోవడం ఖాయం. ఎందుకంటే డైరెక్టర్‌ క్రిష్‌ని ఎప్పుడైతే ఆయన కథని ఆమోదించి క్రిష్‌ని దర్శకుడుగా పెట్టుకున్నారో అప్పుడే ఈ విజయం తథ్యం అన్న విషయం తేటతెల్లమై పోయింది. ఇలాంటి చారిత్రాత్మక సినిమాలకు సరైన దర్శకుడు క్రిష్‌. కారణం ఆయనలో ఆథెంటసిటీ ఉంటుంది. ఉదాహరణకి ఈమధ్య క్రిష్‌ దర్శకత్వం వహించిన సినిమా ‘కంచె’ సెకండ్‌ వరల్డ్‌ వార్‌ సినిమా. మన తెలుగులో హాలీవుడ్‌ స్థాయిని మైమరపించే విధంగా తీయడం ఆషామాషీ కాదు. అది క్రిష్‌ వల్లే అవుతుంది. అప్పట్లో శాతకర్ణుడు ఏం చేశాడు, రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అనేది కళ్లకు కట్టినట్లుగా తెరపై చూపించగలడు. అన్నిరకాలుగా క్రిష్‌ న్యాయం చేస్తాడు అని పూర్తి నమ్మకం నాకుంది. గౌతమీపుత్ర శాతకర్ణి పాత్రలో ఇమిడిపోయి అత్యద్భుత నటనతో మనందర్నీ బాలకృష్ణ అలరిస్తాడు అనే నమ్మకం నాకుంది. ఇలాంటి పాత్రలు చేయడం బాలకృష్ణకు అవలీలగా ఉంటుంది. అది ఆయనకి కేక్‌ వాక్‌. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి అభిమానుల్ని అలరిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమధ్య కాలంలో వంద రోజుల సినిమా ఆడటం అనేది గగనం అయిపోయింది. అలాంటిది ఈ సినిమా సిల్వర్‌ జూబ్లీ, గోల్డెన్‌ జూబ్లీ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అద్భుతమైన చిత్రంగా నిలబడాలని కోరుకుంటున్నాను. చిత్ర యూనిట్‌కి నా అభినందనలు. ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

విక్టరీ వెంకటేష్‌ మాట్లాడుతూ – ”పెద్దలకు, బాలకృష్ణ ఫ్యాన్స్‌ అందరికీ స్వాగతం. ‘లెజెండ్‌’, ‘సింహా’, ‘లయన్‌’ చిత్రాల కథానాయకుడు నా ఫ్రెండ్‌ బాలకృష్ణ వందవ చిత్రం చేయడం చాలా హ్యాపీగా వుంది. ఒక్కటి చెప్పగలను వెయ్యి థియేటర్లలో 200 రోజులు ఆడాలని కోరుకుంటూ క్రిష్‌కి, టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌” అన్నారు.

దర్శకరత్న డా|| దాసరి నారాయణరావు మాట్లాడుతూ ”బాలయ్యబాబు చరిత్రలో వందవ సినిమా మొట్టమొదటి తెలుగు చక్రవర్తి గౌతమిపుత్ర శాతకర్ణి కథని ఎన్నుకోవడం తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. ఇది మామూలు విషయం కాదు. 33 రాజ్యాల్ని జయించి చక్రవర్తి అయిన గౌతమిపుత్ర శాతకర్ణి కథని వందవ చిత్రంగా బాలకృష్ణ చేయడం సంతోషించదగ్గ విషయం. మనందరం చేసుకుంటున్న ఉగాది, ఉగాది పచ్చడి అనేది ఆయనతోనే ప్రారంభం అయింది. అటువంటి మహానాయకుడు చారిత్రాత్మక కథని నిజంగా తీయాలనే ఆలోచన క్రిష్‌కి రావడం, దానిని బాలయ్యబాబు ఆమోదించడం నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ విషయం. ఏ పాత్ర చేసినా ఆ పాత్రలో ఒదిగిపోయే బాలయ్య ఈ పాత్రలో మామూలుగా కనిపించడు. జానపదం, పౌరాణికం, సాంఘికం, యాక్షన్‌, సెంటిమెంట్‌, ఏ యాంగిల్‌లోకి వెళ్లినా తనని తను మలచుకుని ఆ పాత్రకి న్యాయం చేయగల బాలయ్య ‘గౌతమీపుత్ర శాతకర్ణి’గా చూడటానికి ఎదురు చూద్దాం. ఇది చరిత్ర సృష్టించాలని మనసారా కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ – ”ఒక కొత్త సినిమా చూస్తున్నాం అనే దానికన్నా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లాంటి ఒకగొప్ప చక్రవర్తి కథని బాలయ్యబాబుకి చెప్పినపుడు మరు క్షణమే దానిని ఆమోదించి రా మనం కలసి సినిమా చేద్దాం అని నన్ను ముందుకు నడిపించిన బాలయ్యకు నా ధన్యవాదాలు. జై బాలయ్య, జై జై బాలయ్య” అన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ – ”నా 43 ఏళ్ల నట జీవితంలో ఎన్నో వైవిద్యభరితమైన పాత్రల్ని పోషించాను. నా వందో చిత్రానికి సంబంధించి ఎన్నో కథలు విన్నాను. కొన్ని నచ్చాయి, కొన్ని నచ్చలేదు. నూరవ చిత్రం స్థాయికి తగ్గట్టుగా అనిపించలేదు. అనుకోకుండా, యాదృచ్ఛికంగా నా వందో సినిమాగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎన్నో మంచి గొప్ప సినిమాలు చేయాలని తాపత్రయం వుంది నాలో. కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ స్వీకరించి ఆదరిస్తారు. నాన్నగారి కాలం నుంచి కూడా కాలానికి తగ్గట్టుగా ఆయన నడచుకుంటూ ఎన్నో మంచి సినిమాలు చేశారు. ప్రేక్షకులు ఆదరించారు. అలాగే నాకు కూడా ఎన్నో వైవిద్యభరిత పాత్రలు చేయాలని తపన ఉంది. అభిమానులు అందరూ నా వందో సినిమా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ సమయంలో క్రిష్‌ వచ్చి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథ చెప్పడం జరిగింది. చాలాగొప్ప పాత్ర. మన కాలాన్ని ఇద్దరే సూచించారు. ఒకటి క్రైస్త్‌ అయితే రెండోది గౌతమిపుత్ర శాతకర్ణి. తెలుగు క్యాలెండర్‌, కాలం యొక్క కొలమానం ఆయనతోనే ప్రారంభమైంది. చాలా మందికి ఈయన గురించి తెలియదు. అది నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆయనలో ఉన్న ఆవేశం, తపన నాలో కూడా స్ఫూర్తి నింపింది. ఇది ఒక మంచి సినిమా అవుతుంది. కరీంనగర్‌ జిల్లా కోటిలింగాలలో తల్లిగారి ఊరులో పుట్టి అక్కడ రాజ్యాన్ని పరిపాలించాడు. అక్కడ నుంచి ఆంధ్రలో అమరావతిలో రాజధానిని ఏర్పాటు చేశారు. అది గౌతమిపుత్ర శాతకర్ణి ప్రస్థానం. ఈయన జీవిత చరిత్ర గురించి ప్రతి ఒక్క తెలుగు వారికి తెలియచెప్పాలని ఈ సినిమా చేస్తున్నాం. 33 మంది రాజుల్ని ఓడించి ప్రపంచాన్ని ఏక ఛత్రాధిపత్యం పరిపాలించిన గొప్ప చరిత్ర గల గౌతమిపుత్ర శాతకర్ణి గురించి అంతర్జాతీయ స్థాయిలో తెలియచెప్పాలి. నాకు లొంగిపోండి లేదా మరణమే అని ప్రత్యర్ధులకు ఆప్షన్‌ ఇచ్చేవాడు ఆయన. ఈ పాత్ర కోసం ఎంతో రీసెర్చ్‌ చేసి అద్భుతమైన టీమ్‌ని ఏర్పాటు చేశాం. ‘నర్తనశాల’ టైంలో నాన్నగారు బృహన్నల పాత్ర కోసం ఎలాగైతే టీమ్‌ని ఏర్పాటుచేసి ఎంత కేర్‌ తీసుకుని చేశారో ఈ సినిమాకి కూడా అలాంటి అద్భుతమైన టీమ్‌ సెట్‌ అయింది. భారత దేశమంతటా తిరిగి శాతకర్ణి స్టాట్యూస్‌ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ పరిశీలించి గెటప్‌ని స్కెచ్‌ వేయడం జరిగింది. శాతకర్ణి పాత్ర ఆహార్యం, వాచకం విషయంలో ఎంతో కేర్‌ తీసుకుని చేస్తున్నాను. 1973లో నాన్నగారు నా నుదుట నట తిలకం దిద్దారు. 43 ఏళ్ల నా నట ప్రస్థానంలో 99 చిత్రాలు పూర్తిచేశాను. వాటిలో కొన్ని పెద్ద హిట్‌లు, కొన్ని అపజయాలు వున్నాయి. 99 సినిమాల్లో 73 శత దినోత్సవాలు జరుపుకున్నాయి. అది నా తల్లిదండ్రుల యొక్క పుణ్యఫలం. ప్రేక్షక దేవుళ్ల యొక్క అభిమాన బలం. అలాగే నా ఆత్మబలం. నాఅభిమానుల యొక్క దీవెనలు. నా నుండి ఏమీ ఆశించకుండా నన్ను అభిమానిస్తూనే వున్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగనిది అభిమాన బలం. కొన్ని కోట్ల మంది అభిమానులు నన్ను అభిమానిస్తున్నారంటే అది ఏ జన్మ జన్మల అనుబంధమో ఏ రుణానుబంధమో అనిపిస్తుంటుంది. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు, దర్శకులు ఎంతో మంది నాతో పాటు నడిచారు. నా నడకలో అడుగు వేసిన ప్రతి ఒక్కరికీ, ప్రపంచ నలుమూలలా వున్న తెలుగు వారందరికీ ఈ వందో చిత్రాన్ని అంకితమిస్తాం. క్రీస్తు పూర్వం 2020 సంవత్సరంలో శాతవాహనుల వంశం స్టార్ట్‌ అయింది. దానికి ఆద్యుడు శ్రీముఖుడు. తర్వాత 420 సంవత్సరాలు వారు రాజ్యాన్ని పరిపాలించారు. అందులో 23వ రాజు గౌతమిపుత్ర శాతకర్ణుడు. ఏకఛత్రాధిపత్యంతో రాజ్యాన్ని గడగడలాడించాడు. అలాంటి గొప్ప మహావీరుడి చరిత్ర అందరికీ తెలియచేయాలి. మన గతం, మన సంస్కృతి, సంప్రదాయాలు, పునాదుల గురించి తెలియ చెప్పాల్సిన బాధ్యత మన కర్తవ్యం అని భావిస్తున్నాం. దీనివల్ల మంచి జరగాలని సినిమా చేస్తున్నాం. తెలుగు జాతిని స్ఫూర్తిదాయకంగా ప్రపంచ నలుమూలలా చాటిచెప్పాలని మా బాధ్యతగా భావిస్తున్నాం” అన్నారు.

ప్రముఖ రచయితలు వి. విజయేంద్రప్రసాద్‌, జె.కె. భారవి, ఎన్‌.శంకర్‌, ప్రతాని రామకృష్ణగౌడ్‌, సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌, మంత్రులు హరీష్‌రావు, జగదీశ్వర్‌రెడ్డి, అంబికా కృష్ణ, అంబికా రామచంద్రరావు, గుణ్ణం గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి రచనా సహకారం: భూపతిరాజా, మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: భూపేష్‌ ఆర్‌. భూపతి, డిఓపి: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌., ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, డాన్స్‌: బృంద, ఎడిటింగ్‌: సూరజ్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కొమ్మినేని వెంకటేశ్వరరావు, సమర్పణ: ‘బిబో’ శ్రీనివాసరావు, నిర్మాతలు: వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, రచన- దర్శకత్వం: జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్‌).

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com