హైదరాబాద్ శివార్లలో రియల్ ఎస్టేట్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో, కొనుగోలుదారులను బురిడీ కొట్టించే ఫేక్ అప్రూవల్స్ దందా కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ప్రధానంగా రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో వెలుస్తున్న కొత్త లేఅవుట్లలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నట్లు రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
హెచ్ఎండిఏ , డీటీసీపీ అనుమతులు ఉన్నాయని నమ్మబలికి, నకిలీ పత్రాలు చూపిస్తూ అమాయక కొనుగోలుదారుల నుంచి భారీగా అడ్వాన్స్‌లు వసూలు చేస్తున్నారు. కొనుగోలుదారులు ఏదైనా ప్లాట్ లేదా ఫ్లాట్ బుక్ చేసుకునే ముందు తెలంగాణ రేరా వెబ్సైట్లో ఆ ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యిందో లేదో సరిచూసుకోవడం అత్యంత ముఖ్యం. రేరా నిబంధనల ప్రకారం, ఏ ప్రాజెక్ట్ అయినా రేరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు ఇవ్వడం లేదా అమ్మకాలు జరపడం చట్టవిరుద్ధం. బిల్డర్ లేదా డెవలపర్ చెప్పే మాటలను నమ్మకుండా, అధికారిక వెబ్సైట్లో సెర్చ్ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ సెక్షన్ ద్వారా లేఅవుట్ ప్లాన్, అనుమతుల గడువు , ప్రాజెక్ట్ స్థితిగతులను స్వయంగా తనిఖీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
నకిలీ అనుమతులతో పాటు ప్రీ-లాంచ్ ఆఫర్స్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలి. తక్కువ ధరకు వస్తుందని ఆశపడి, సరైన అనుమతులు లేని ప్రాజెక్టులలో పెట్టుబడి పెడితే భవిష్యత్తులో ఎల్ఆర్ఎస్ సమస్యలు, విద్యుత్ , నీటి కనెక్షన్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో హైడ్రా వంటి సంస్థల చర్యల వల్ల ఆక్రమణలకు గురైన కట్టడాలు కూల్చివేతకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అందుకే కేవలం బ్రోకర్ల మాటలు నమ్మకుండా, స్వయంగా లీగల్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాతే ఆర్థిక లావాదేవీలు జరపాలి.
కొనుగోలుదారులు చెల్లించే ప్రతి రూపాయికి రసీదు తీసుకోవడంతో పాటు, బ్యాంకు రుణం పొందే అవకాశం ఉన్న ప్రాజెక్టులకే మొగ్గు చూపడం క్షేమకరం. ఎందుకంటే బ్యాంకులు సదరు ప్రాజెక్ట్ యొక్క లీగల్ డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రుణాలను మంజూరు చేస్తాయి. తక్కువ ధరలో వస్తుందని ఫార్మ్‌ల్యాండ్, అన్‌అప్రూవ్డ్ ప్లాట్ల జోలికి వెళ్లి జీవితకాల కష్టాన్ని వృధా చేసుకోవడం అవుతుంది.


