ఒకప్పుడు విరివిగా సినిమాలు తీసి, మేకర్స్ దృష్టిని ఆకర్షించిన సంస్థ.. యూవీ క్రియేషన్స్. ప్రభాస్ తో వరుసగా సినిమాలు తీయడంతో యూవీ పేరు గట్టిగా వినిపించింది. అయితే కొన్నాళ్లుగా యూవీ ట్రాక్ తప్పింది. విజయాలు లేకపోవడం ఒక ఎత్తయితే, ‘విశ్వంభర’ సినిమా విడుదల వాయిదా పడడం మరో ఎత్తు. వీటితో యూవీ సతమతమయ్యింది. హీరోలకు, దర్శకులకు అడ్వాన్సులు ఇచ్చినా, ఆ ప్రాజెక్టుల్ని టేకాఫ్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు యూవీ కొద్ది కొద్దిగా కోలుకొంటోంది. ఇటీవల విడుదలైన ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమా లాభాల్ని తెచ్చి పెట్టింది. చిన్న సినిమానే అయినా, యూవీ కాస్త తేరుకోవడానికి ఈ సినిమా దోహదపడింది.
శర్వానంద్ తో యూవీ క్రియేషన్స్ ఓ సినిమా చేసింది. అదే.. ‘బైకర్’. రిలీజ్ కు ముందే ఈ చిత్రం టేబుల్ ప్రాఫిట్ ని తీసుకొచ్చిందని సమాచారం. నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో రూ.43 కోట్లు వచ్చాయని, థియేట్రికల్ రైట్స్ ద్వారా మరో పాతిక కోట్ల వరకూ అందాయని టాక్. ఎలా చూసినా, ఈ సినిమా వల్ల యూవీ లాభపడింది. వరుసగా రెండు టేబుల్ ప్రాఫిట్ సినిమాలు దక్కడంతో యూవీ ఊపిరి పీల్చుకొంది.
మరోవైపు ‘విశ్వంభర’ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అవుతోందని టాక్. జీ5 సంస్థ ఓటీటీ హక్కుల్ని దక్కించుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఓటీటీ డీల్ క్లోజ్ అయితే… రిలీజ్ కు మార్గం సుగమం అయినట్టే. జులై 10న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఉగాది రోజున రిలీజ్ డేట్ ఫిక్సయ్యే అవకాశం ఉంది.
