జగన్‌లో కొత్త భయాలు పుట్టిస్తున్న భేటీలు!

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి.. ఆ పార్టీనుంచి ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరిపోతుండడం గురించి.. జగన్‌ ఎంత మేరకు ఎలా స్పందిస్తున్నారనే సంగతి తరవాత… అయితే తాజా పరిణామాల్లో ఆయన జిల్లాలనుంచి ఎమ్మెల్యేలను పిలిపించి.. వారికి ధైర్యం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పార్టీ పరిస్థితి గురించి ఆందోళన వద్దని, జగన్‌ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఒక్కొక్క జిల్లాలనుంచి వారిని పిలిపించి భేటీలు అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఈ పరిణామాల్ని కాస్త లోతుగా గమనిస్తే.. జగన్‌ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం సంగతి తరవాత.. ఈ భేటీల పుణ్యమాని ఆయనలోనే కొత్త భయాలు పుట్టుకువచ్చే పరిస్థితి కనిపిస్తున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లాల ఎమ్మెల్యేలతో శుక్రవారం మొత్తం విడతలుగా భేటీలు జరిపిన జగన్‌లో పార్టీ పరిస్థితి గురించి కొత్త ఆందోళనలు పుడుతున్నాయని పార్టీ నాయకులే చెబుతున్నారు.

దీనికి ఒక బలమైన కారణం కూడా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలు తెలుగుదేశం వైపు చూడడం మానలేదనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహనరెడ్డి కాస్త వ్యూహాత్మకంగా అడుగులు కదిపారు. వెళ్లిపోతారనే అనుమానం ఉన్న ఎమ్మెల్యేలను మాత్రం పిలిపిస్తే వారికి అవమానంగా ఉంటుందనే ఉద్దేశంతో జిల్లాల వారీగా సమావేశాలు అని ప్రకటించారు. ఆ మేరకు శుక్రవారం గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో భేటీలు ఉంటాయని తొలుత వార్తలు వచ్చాయి. కానీ సాయంత్రానికి వాస్తవాల్ని పరిశీలిస్తే ఆయా జిల్లాలనుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు చెందిన అందరు ఎమ్మెల్యేలూ మాత్రం రానేలేదు. ఏదో తమకు వీలు చిక్కిన కొందరు ఎమ్మెల్యేలు మాత్రం జగన్‌తో భేటీలకు వచ్చి వెళ్లారు. రాకుండా మిగిలిపోయిన వారు చాలా మందే ఉన్నారు. నిజానికి పార్టీ వీడిపోతారనే పుకార్లు ఆ గైర్హాజరీ ఎమ్మెల్యేల చుట్టూతానే తిరుగుతున్నాయి.

జగన్‌ పరిస్థితి చూస్తే.. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడం కాదు కదా.. వారంతా కలిసి ఆయనకు ధైర్యం చెప్పడానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. వెళ్లిపోతున్న వారిని ఆపడానికి, ఒకవేళ వారు వెళ్లిపోతే.. ప్రత్యామ్నాయంగా పార్టీ బలాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాలను జగన్‌ వారితో చర్చిస్తున్నట్లుగా తెలుస్తున్నది.

ట్విస్టు ఏంటంటే.. జగన్‌ పాపం.. తనకున్న పరిమితమైన సమయంలో క్షణం కూడా వృథా కాకుండా సద్వినియోగం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే.. శుక్రవారం ఆయన నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సిన రోజు. ఈ రోజున ఆయన ఎక్కువ సమయం కోర్టులోనే గడపాల్సి వచ్చింది. దీంతో ప్రకాశం జిల్లాకు చెందిన నాయకులతో ఆయన అక్కడే భేటీలు వేశారు. బాలినేనితో కలసి వచ్చిన ఎమ్మెల్యేలు కోర్టు వద్దనే కాసేపు జగన్‌ తో మాట్లాడి.. తమ నాయకుడు చెప్పినట్లుగా తమను కూడా ఫోన్లలో సంప్రదిస్తున్నారని, కానీ పార్టీ వీడి వెళ్లేది లేదని ముక్తసరిగా ప్రకటించి వెళ్లిపోవడం విశేషం. కోర్టులో న్యాయమూర్తి పిలుపుకోసం నిరీక్షిస్తూ కూడా జగన్‌ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పార్టీ మీటింగులు నిర్వహించేయడమే కొసమెరుపు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com