టీటీడీ ఛైర్మ‌న్ నియాక‌మంలో కొత్త ట్విస్ట్ ఉంటుందా..?

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి నియామ‌కం గురించి ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు మాట్లాడ‌టం విశేషం. చిత్తూరు జిల్లాలో జ‌రిగిన ఓ విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… టీటీడీ పాల‌క మండ‌లిని త్వ‌ర‌లోనే నియ‌మించ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టం చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎవ‌రికి క‌ట్ట‌బెడ‌తార‌నే ప్ర‌స్థావ‌నకు రావ‌డం గ‌మ‌నార్హం. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్టు ఆ మ‌ధ్య క‌థ‌నాలు వ‌చ్చాయి క‌దా! అయితే, ఈ క‌థ‌నాల‌ను ముఖ్య‌మంత్రి తోసిపుచ్చ‌డం విశేషం. దీంతో ఇంత‌కీ టీటీడీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం ఎవ‌రి పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు…? ఉన్న‌ట్టుండి సుధాక‌ర్ యాద‌వ్ పేరును కూడా ప‌క్క‌న పెడుతున్నారా అనే చ‌ర్చకు మ‌రోసారి ఆస్కారం ఇచ్చిన‌ట్ట‌యింది.

నిజానికి, గ‌త ఏడాది మే నెల‌లోనే టీటీడీ బోర్డు కాల ప‌రిమితి ముగిసింది. అప్ప‌ట్నుంచీ అదిగో ఇదిగో నియామ‌కాలు అంటూనే కాల‌యాప చేస్తూ వ‌చ్చారు. ఈ అంశం తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌తీసారీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కోసం కొంత‌మంది పేర్లు తెర‌మీదికి రావ‌డం ప‌రిపాటి అయిపోయింది. అంతేకాదు, అధికార పార్టీ నుంచి నేత‌ల ప్ర‌య‌త్నాలు కూడా ఎక్కువ కావ‌డంతో ఛైర్మ‌న్ ప‌ద‌విని ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఇచ్చేదే లేద‌ని చంద్ర‌బాబు తెగేసి చెప్పేశారు. అయితే, చిట్ట చివ‌రిగా మైదుకూరు నియోజ‌క వ‌ర్గ ఇన్ ఛార్జ్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ పేరు తెర‌మీదికి వ‌చ్చింది. ఆయ‌న పేరు దాదాపు ఖ‌రారు అనుకున్నారు. ఆయ‌న్ని టీటీడీకి తీసుకొస్తే… మైదుకూరులో డీఎల్ ర‌వీంద్రా రెడ్డికి పార్టీ త‌ర‌ఫున అవ‌కాశం ఇవ్వొచ్చ‌నే రాజ‌కీయ లెక్క‌లూ టీడీపీ పెద్ద‌లు వేశారు. కానీ, ఆ ప్ర‌తిపాద‌న కూడా నెమ్మ‌దిగా తెర మ‌రుగైంది. పుట్టా నియామ‌కానికి బ్రేక్ ప‌డింది.

ఇదే స‌మ‌యంలో సుధాక‌ర్ యాద‌వ్ పై కొన్ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆయ‌న క్రైస్త‌వ మ‌త ప్ర‌చార స‌భ‌ల్లో పాల్గొంటున్నార‌నే క‌థ‌నాలు వినిపించాయి. దీంతో కొంత వ్య‌తిరేకత వ్య‌క్త‌మైంది. అయితే, ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్న మ‌రో క‌థ‌నం ఏంటంటే… పుట్టాను టీటీడీ ఛైర్మ‌న్ చేస్తే మంత్రి మాణిక్యాల రావుతో రాజీనామా చేయిస్తామంటూ ఆర్‌.ఎస్‌.ఎస్‌. జోక్యం చేసుకునే అవ‌కాశం ఉంద‌ట‌. ఇప్ప‌టికే దేవ‌స్థానంలో ప‌నిచేస్తున్న అన్య మ‌త‌స్థుల సంఖ్య ఎక్కువ‌వౌతోంద‌నీ, పాల‌క‌మండ‌లి స‌భ్యుడిగా ఉన్నప్పుడే సుధాక‌ర్ యాద‌వ్ క్రైస్త‌వ మతానికి కొంత ప్రాధాన్య‌త ఇచ్చేవార‌నీ, అలాంటివారిని ఛైర్మ‌న్ ఎలా చేస్తార‌నేది ఆర్‌.ఎస్‌.ఎస్‌. వాద‌న‌గా వినిపిస్తోంది. అందుకే, ఈ వ్య‌వ‌హారాన్ని కాస్త సీరియ‌స్ గానే వారు తీసుకుంటున్నారు. ఎలాగూ ఏపీలో భాజ‌పా, టీడీపీల మ‌ధ్య ఉండాల్సిన పొర‌పొచ్చాలూ ఈ వివాదానికి కొంత నేప‌థ్యంగా ప‌నిచేసే అవ‌కాశ‌మూ ఉంది. దీంతో సుధాక‌ర్ యాద‌వ్ పేరును అనుకున్నంత ఈజీగా ఖరారు చేసే ప‌రిస్థితి లేద‌ని అనిపిస్తోంది. మ‌రి, ఈ లెక్క‌లు ఎలా స‌రిచేస్తారో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.