నిజాయితీ గా మాట్లాడిన హీరో నితిన్

సాధార‌ణంగా స‌క్సెస్ మీట్ల‌లో…. అంద‌రూ నిజాలేం మాట్లాడ‌రు. సినిమా ఫ్లాప్ అయినా అది స‌క్సెస్ మీట్ కాబ‌ట్టి… ‘మా సినిమా హిట్ట‌య్యింది.. వ‌సూళ్లు అదిరిపోతున్నాయ్‌..’ అంటూ బిల్డ‌ప్పులిస్తారు. ‘లై’ స‌క్సెస్ మీట్‌లో మాత్రం నితిన్ కాస్త నిజాలు చెప్ప‌డానికి ప్ర‌య‌త్నించాడు. ఈసినిమాపై వ‌స్తున్న డివైడ్ టాక్ గురించి డిటైల్డ్‌గా మాట్లాడాడు నితిన్‌. విడుద‌ల రోజు చాలామంది సినిమా బాగోలేద‌ని పెద‌వి విరిచార‌ని, ‘నేనేమైనా త‌ప్పు చేశానా’ అనిపించిందింద‌ని, టీమ్‌లో అంద‌రి మొహాలూ మాడిపోయాయ‌ని నిజాలు ఒప్పుకొన్నాడు. శ‌నివారం వ‌ర‌కూ స‌క్సెస్ మీట్ పెట్టే ఉద్దేశ‌మే లేద‌ని, ఒక‌వేళ స‌క్సెస్ మీట్ ఏర్పాటు చేసినా తాను వ‌చ్చేవాడ్ని కాద‌ని, ఆదివారం నాటికి.. మంచి రిపోర్ట్ రావ‌డంతో స‌క్సెస్ మీట్ పెట్ట‌డానికి ఒప్పుకొన్నా అంటున్నాడు నితిన్‌. ఇప్ప‌టికీ డివైడ్ టాక్ న‌డుస్తోంద‌ని, రానున్న రోజుల్లో ‘సినిమా బాగుంది’ అని యునానిమ‌స్‌గా అంద‌రూ అంటార‌ని న‌మ్మ‌కంగా చెప్పాడు. ఈ సినిమా ఆడినా ఆడ‌క‌పోయినా… హ‌ను రాఘ‌వ‌పూడి భ‌విష్య‌త్తులో మంచి ద‌ర్శ‌కుడు అవుతాడ‌ని కితాబిచ్చాడు. నితిన్ స్పీచ్‌.. వేదిక‌మీద కూర్చున్న‌వాళ్లంద‌రికీ షాకింగ్‌గానే అనిపించింది. ‘లై’ అనే సినిమా తీసి అన్నీ నిజాలే మాట్లాడేశాడు మ‌రి!! ఆ ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలిగా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com