సాగునీటి కోసం సర్కార్‌పై యుద్ధం..! నిజామాబాద్ రైతుల కన్నెర్ర..!!

తెలంగాణ ముఖ్యమంత్రి.. పంటలు ఎండిపోకుండా… జల విప్లవం తీసుకొస్తున్నామని నాలుగేళ్లుగా చెబుతున్నారు. కళ్ల ముందు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని త్రీడీలో చూపిస్తున్నారు. ఇతర ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నామని చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం తేడాగా ఉంటోంది. కళ్ల ముందు పెరిగిన పంట.. నీళ్లు లేక ఎండిపోతూంటే.. రైతులు తట్టుకోలేకపోతున్నారు. ఎంతో కొంత అందుబాటులో ఉన్న నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని మొత్తుకుంటున్నారు. కానీ ఇరిగేషన్ అధికారుల మనసు మాత్రం మారడం లేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆయుకట్టు రైతులు ఇప్పుడు నీటి కోసం రగిలిపోతున్నారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ కాకతీయ కాలువ కింద కొన్ని వందల ఎకరాల్లో పంట సాగవుతోంది. అధికారుల మాటలు విని వారు పంటలు సాగు చేశారు. తీరా.. నీరు అవసరయ్యే అధికారులు చేతులెత్తేశారు. దీంతో పంటలు వేసిన రైతులందరూ… ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ ఇరిగేషన్ కార్యాలయం వద్ద ధర్నాకు వచ్చారు. ఉన్న పళంగా నీటిని విడుదల చేయాలని పట్టుబట్టారు. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో సహనం నశించిన మహిళా రైతులు.. ప్రాజెక్ట్ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు. అయినా ప్రభుత్వం దిగి రాలేదు. రైతులు కూడా తాము నీళ్లిస్తేనే వెళ్తామని తేల్చి చెప్పారు. దాంతో సమస్య పరిష్కారం కాలేదు. ఆగ్రహం చెందిన రైతులు.. రెండు ఆర్టీసీ బస్సుల్ని కూడా ధ్వంసం చేశారు.

ప్రస్తుతం శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో కొంత మేర నీటి నిల్వ ఉంది. వాటిని కాకతీయ కాలువకు విడుదల చేస్తే పంటలు కాపాడుకుంటామని..రైతులు అధికారులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణంయ తీసుకుంటే తప్ప.. నీటిని విడుదల చేస్తే అధికారం తమకు లేదని అధికారులు చెబుతున్నారు. నిజామాబాద్ రైతుల ఆందోళన రోజంతా.. సాగిన నీటి విడుదల గురించి ప్రభుత్వం ఒక్క ప్రకటన అంటే.. ఒక్క ప్రకటన కూడా చేయలేదు. దీంతో రైతుల్లో మరింత ఆగ్రహం పెరిగిపోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com