గుత్తా సుఖేంద‌ర్ కి త‌త్వం బోధ‌ప‌డుతోందా..!

ప‌ద‌వి మీద ఆశ‌తోనే ఆయ‌న పార్టీ మారారనే అభిప్రాయం ఉంది! ఆయ‌నేనండీ.. న‌ల్గొండ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి. తెరాస‌లో చేరారుగానీ, గులాబీ కండువా క‌ప్పుకోలేదు. కాంగ్రెస్ కు దూర‌మ‌య్యారుగానీ, ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చెయ్య‌లేదు. అటు ఫిరాయింపు విమ‌ర్శ‌ల‌కు దొర‌క్క‌కుండా… ఇటు ఆశించిన ప‌ద‌వి అందుకోవ‌డం కోసం కొంత స‌మ‌తౌల్యం పాటిస్తూ వ‌చ్చారు! అయితే, చివ‌రికి ఏమైంది..? ఏదో ఒక ప‌ద‌వి వ‌చ్చింద‌ని గుత్తా సంతోషించారు. రాష్ట్ర రైతుల స‌మ‌న్వ‌య క‌మిటీ అధ్య‌క్షుడు అయ్యారు. ఇంకేముంది, ఏదో ప‌ద‌వి ఇచ్చేసింది క‌దా… మ‌న నిర్ణ‌యాల‌కు తిరుగుండ‌ద‌ని అనుకున్నారు. కానీ, వాస్త‌వం మెల్ల‌గా ఇప్పుడు ఆయ‌న‌కి బోధ‌ప‌డుతోంది. అక్క‌డ కూడా సొంతంగా నిర్ణ‌యాలు తీసుకునే స్వేచ్ఛ ఆయ‌న‌కి లేద‌ని స్ప‌ష్ట‌మౌతోంది..!

న‌ల్గొండ జిల్లాలో త‌న ప్ర‌ధాన అనుచురుల్లో ఒక‌రికి జిల్లా రైతు క‌మిటి స‌మ‌న్వ‌యక‌ర్త‌గా అవ‌కాశం ఇప్పించేందుకు ముందునుంచే గుత్తా ప్ర‌య‌త్నించారు. తెరాసలోకి వచ్చాక తన అనుచరులకు ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం ఉంది. కనీసం ఇప్పుడైనా దాన్ని మార్చాలని అనుకున్నారు. ఇదే అంశ‌మై వ్య‌వ‌సాయ శాఖ మంత్రికి ఆయ‌న లేఖ రాశార‌ట‌! కానీ, ఆ లేఖ ఇంత‌వ‌ర‌కూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ర‌కూ వెళ్ల‌లేద‌ని తెలుస్తోంది. గుత్తా రాసిన లేఖ‌ను ఎవ్వ‌రూ సీరియ‌స్ గా తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, గుత్తా ప్ర‌తిపాద‌న‌ను ప‌ట్టించుకోకుండా మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి ప్ర‌తిపాదించిన మరో అభ్య‌ర్థికి అవ‌కాశం ఇచ్చార‌ట‌! అంటే, తెరాస‌లో గుత్తాకి ద‌క్కుతున్న ప్రాధాన్య‌త ఏంట‌నేది ఇక్క‌డే అర్థ‌మైపోతోంది.

అలాగ‌ని, విష‌యాన్ని గుత్తా స్వ‌యంగా ఖండించి ఎవ్వ‌ర్నీ ప్ర‌శ్నించ‌లేని ప‌రిస్థితి..! నిజానికి, ఆయ‌న తెరాస‌లో చేరి చాన్నాళ్లు అవుతున్నా… త‌న వ‌ర్గానికి ప్రాధాన్య‌త ద‌క్క‌డం లేద‌న్న అసంతృప్తి ఈ మ‌ధ్య గుత్తా వ‌ర్గం నుంచి వ్య‌క్త‌మౌతున్న‌ట్టు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇప్పుడు, గుత్తా ప్ర‌తిపాద‌న‌ను ప‌ట్టించుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అనుచ‌రుల‌కు ప‌ద‌వులు ఇప్పించుకోలేక‌పోతే, క్యాడ‌ర్ లో ఆ నాయ‌కుడి ఇమేజ్ ఎలా మారుతుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అయితే, ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఈ ఇష్యూని మ‌రీ పెద్ద‌ది చేయ‌డం ఎందుక‌నుకున్నారో ఏమోగానీ… జిల్లా స‌మ‌న్వ‌య‌క‌ర్త నియామ‌కం విష‌య‌మై ప్ర‌భుత్వ నిర్ణ‌య‌మే స‌రైంద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నారు. ఇత‌ర జిల్లాల్లో త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన‌వారికే ఎక్కువ సంఖ్య‌లో స‌మ‌న్వ‌యక‌ర్త‌లుగా వేశారు కాబ‌ట్టి, న‌ల్గొండ జిల్లా వ‌ర‌కూ ఇత‌రుల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని పార్టీ భావించింద‌నీ, ఈ విష‌యం త‌న‌కు ముందే తెలుసు అన్న‌ట్టుగా స్పందించారు. ఒక‌వేళ ముందే ఈ సంగ‌తి తెలిసి ఉంటే… వ్య‌వ‌సాయ మంత్రికి లేఖ ఎందుకు రాస్తారు..? పోనీ, రాసిన త‌రువాతే ఈ విష‌యం తెలిస్తే ఈ అంశంపై ఇంత‌కుముందే స్పందించాలి క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.