ప్రాజెక్టుల సమీక్షకు హరీష్‌రావుకు పిలుపు రాలేదేమి..?

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టం కట్టిన తర్వాత నుంచి… మరో కీలక నేత హరీష్‌కు ప్రాధాన్యం తగ్గిపోతోంది. ఈ విషయం మరోసారి రుజువయింది. ఓ వైపు టీఆర్ఎస్ పార్టీ కార్యకవర్గ సమావేశం తెలంగాణ భవన్‌లో కేటీఆర్ అధ్యక్షతన సమావేశం అయింది. దానికి హరీష్ రావు హాజరు కాలేదు. అదే సమయంలో… ముఖ్యమంత్రి కేసీఆర్… సాగునీటి ప్రాజెక్టుల సమీక్షా సమావేశం నిర్వహించారు. దానిలోనూ హరీష్ రావు కనిపించలేదు. ఆయనకు ఆహ్వానం పంపలేదని.. టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త ప్రభుత్వం రద్దు అయ్యే వరకూ.. హరీష్ రావు సాగునీటి ప్రాజెక్టుల శాఖను చూశారు. ప్రాజెక్టుల నిర్మాణం పరుగులు పెట్టేలా.. తాను పరుగులు పెట్టారు. అధికారుల్ని పరుగులు పెట్టించారు. ఈ విషయాన్ని కేసీఆర్ కూడా.. అనేక ఎన్నికల ప్రచార సభల్లో చెప్పారు. కానీ హఠాత్తుగా ప్రభుత్వం మారేసిరికి.. హరీష్‌కు ప్రాజెక్టుల విషయంలో జరిగే అతి ముఖ్యమైన సమావేశానికి ఆహ్వానం లేకుండా పోయింది.

నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ శనివారం సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో.. అసలు ఈ శాఖకు సంబంధమే లేని కరీంనగర్‌ ఎంపీ బి.వినోద్‌కుమార్‌, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డిలకు ఆహ్వానం అందింది. వారిద్దరూ సమీక్షకు హాజరయ్యారు. హోంమంత్రి మహమూద్ అలీని కూడా పిలిచారు. ప్రాజెక్టులపై పూర్తి స్తాయి అవగాహన ఉన్న హరీశ్‌రావుకు మాత్రం ఆహ్వానం లభించలేదు. ప్రస్తుతం ఆయన నీటిపారుదల శాఖకు మంత్రి కానప్పటికీ, ఇన్నాళ్లు శాఖను పర్యవేక్షించిన నేతగా.. ఆహ్వానించి ఉండాల్సిందన్న అభిప్రాయం టీఆర్ఎస్ వర్గాల్లో ఉంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ.. కేసీఆర్ … హరీష్ రావు లేకుండా.. ఏ ప్రాజెక్ట్ సమీక్ష కూడా చేయలేదు.

దీంతో హరీష్ కు మంత్రి పదవి వస్తుందా..? వస్తే… భారీ ప్రాజెక్టుల శాఖ దక్కుతుందా అనే చర్చ ప్రారంభమయింది. మంత్రి వర్గంలో హరీశ్‌కు చోటు ఇచ్చినా సాగునీటి శాఖ ఇవ్వకపోవచ్చనే ప్రచారమూ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. ఆయన స్థానంలో ఈ శాఖను బాల్కొండ ఎమ్మెల్యే, మిషన్‌ భగీరథ మాజీ వైస్‌ చైర్మన్‌ వేముల ప్రశాంత్‌రెడ్డికి అప్పగిస్తారనే సమాచారం.. ప్రగతి భవన్ లో గట్టిగానే వినిపిస్తోంది. మొత్తానికి టీఆర్ఎస్‌లో హరీష్ కు ఇబ్బందికర పరిస్థితులు మాత్రం స్పష్టంగానే కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.