గుత్తాకు ఎమ్మెల్సీనే దక్కట్లేదు..! మరి మంత్రి పదవి ఎలా..?

తెలంగాణ రాష్ట్ర సమితి తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయి.. మంత్రి పదవి చేట్టాలనుకుంటున్న గుత్తా సుఖేందర్ రెడ్డికి… మరోసారి సమీకరణాలు కలసి రాలేదు. భర్తీ చేయడానికి అవకాశం ఉన్న ఒకే ఒక్క ఎమ్మెల్సీ స్థానాన్ని నవీన్ రావు అనే నేతకు.. కేసీఆర్ కేటాయించారు. దీంతో గుత్తా సుఖేందర్ రెడ్డికి నిరాశ తప్పలేదు. గుత్తాకు… మంత్రి పదవి చేపట్టాలన్నది… సుదీర్ఘకాలంగా ఉన్న లక్ష్యం. దాని కోసమే.. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. నల్లగొండ నుంచి గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యి… టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో చేరినప్పుడు.. ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు. అప్పట్నుంచి… గుత్తా సుఖేందర్ రెడ్డి… ఎంపీ పదవికి రాజీనామా చేస్తారని… ఎమ్మెల్సీ అవుతారని.. ఆ వెంటనే మంత్రి పదవి ఇస్తారని.. చాలా సార్లు ప్రచారం జరిగింది. మధ్యలో ఓ సారి నల్లగొండ ఉపఎన్నికల కసరత్తు కూడా కేసీఆర్ చేశారు.

అయితే… గుత్తాకు ఎమ్మెల్సీ అనేది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ఈ లోపు.. ముందే… అసెంబ్లీని రద్దు చేసి.. ఎన్నికలకు వెళ్లడంతో.. ఎక్కడో చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని.. భావించారు. గుత్తాకు.. కోదాడ లేదా… హుజూర్ నగర్ అసెంబ్లీ సీట్లను.. కేసీఆర్ ఆఫర్ చేశారని చెప్పుకున్నారు. కానీ.. గుత్తా మాత్రం.. ప్రత్యక్ష ఎన్నికల్లో కాకుండా.. ముందుగా హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయాలని.. కేసీఆర్ ను కోరారని చెబుతున్నారు. దాని ప్రకారమే..అసెంబ్లీ ఎన్నికల్లో… గుత్తా పోటీ చేయలేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక .. గుత్తాకు.. మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. కానీ తొలి విడతలో చాన్స్ దక్కలేదు. సరి కదా.. అదే పనిగా.. ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చి .. భర్తీ చేయాల్సిన పరిస్థితి వచ్చినా… కేసీఆర్ కరుణ కటాక్షాలు గుత్తాకు లభించలేదు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయడానికి గుత్తా రెడీ అయినా.. అవకాశం మాత్రం… టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన తేరా చిన్నపరెడ్డికి దక్కింది. ఇప్పుడా ఎన్నిక ప్రక్రియ నడుస్తోంది. ఈ లోపలే… మైనంపల్లి హన్మంతరావు రాజీనామా చేసిన ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక వస్తే.. దాన్ని నవీన్ రావుకు కేటాయించారు. మల్కాజిగిరి లోక్ సభ టిక్కెట్ కోసం పోటీ పడిన నవీన్ రావుకు ఎమ్మెల్సీ ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి నెరవేర్చారు. ఆయన ఎన్నికల లాంఛనమే..!

గుత్తాకు.. ఎమ్మెల్సీ పోస్టు మళ్లీ ఎప్పుడొస్తుందన్నది దైవాధీనమే. ఎందుకంటే.. గతంలో టీఆర్ఎస్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్సీలపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. ఆ కేసు కోర్టులో ఉంది. వాళ్లు.. తమకు… అనర్హతా వేటు వర్తించదని చెబుతున్నారు. ఆ కేసు టీఆర్ఎస్‌కు అనుకూలంగా వచ్చి.. ఆ ముగ్గురిపై అనర్హతా వేటు పడితే.. మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. అప్పుడు గుత్తాకు అవకాశం లభించవచ్చు. అయితే.. ఈ లోపే మంత్రి వర్గ విస్తరణ ఉంటుంది. ఎమ్మెల్సీ కాకుండా… గుత్తాకు.. మంత్రివర్గంలో చాన్స్ ఇస్తారా లేదా అన్నది కూడా.. కాస్త ఆసక్తికరమే. గుత్తాకు… మంత్రి పదవి.. ఎంత దూరమో.. అంత దగ్గర అన్నట్లుగా ఉంది పరిస్థితి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com