బ‌యోపిక్‌లో నంద‌మూరి హీరోల‌కు స్థానం లేదా?

‘ఎన్టీఆర్’ బ‌యోపిక్‌కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాలో నంద‌మూరి క‌థానాయ‌కులు (ఒక్క ఎన్టీఆర్ మిన‌హా) అంతా క‌నిపిస్తార‌ని, వాళ్లంద‌రికీ కీల‌క‌మైన పాత్ర‌లు ద‌క్క‌బోతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రీ ముఖ్యంగా క‌ల్యాణ్‌రామ్ త‌న తండ్రి హ‌రికృష్ణ పాత్ర పోషిస్తార‌ని, చైత‌న్య ర‌థం న‌డిపుతూ క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. నిజానికి ఈ సినిమాలో నంద‌మూరి బాల‌కృష్ణ మిన‌హా మ‌రే ఇత‌ర నంద‌మూరి క‌థానాయ‌కుడూ క‌నిపించ‌డ‌ని తెలుస్తోంది. దానికీ బ‌ల‌మైన కార‌ణం ఉంది. ఒక‌వేళ మిగిలిన నంద‌మూరి హీరోల్ని చూపిస్తూ… ఎన్టీఆర్‌ని చూపించ‌క‌పోతే.. దాన్ని నంద‌మూరి అభిమానులు మ‌రో రూపంలో అర్థం చేసుకునే అవ‌కాశం ఉంది. ఆ అవ‌కాశం ఎవ్వ‌రికీ ఇవ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో బాల‌య్య ఈ నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్ మ‌న‌వ‌డు ఎందుకు లేడు? అని అడిగితే.. ”మిగిలినవాళ్లెవ్వ‌రూ లేరు క‌దా” అని చెప్పుకోవ‌డానికే బాల‌య్య ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. క‌ల్యాణ్ రామ్ కే కాదు.. నిజానికి బాల‌కృష్ణ పాత్ర‌కీ ‘ఎన్టీఆర్‌’ క‌థ‌లో అంత ప్రాధాన్యం లేద‌ని స‌మాచారం. బాల‌య్య పాత్ర‌ని కూడా చూచాయిగా పైపైనే ప్ర‌స్తావిస్తార‌ని, ఆయ‌న రూపం కూడా చూపించే అవ‌కాశం అంతంత మ‌త్ర‌మే అని తెలుస్తోంది. బాల‌య్య పాత్ర‌కే ప్రాధాన్యం లేన‌ప్పుడు హ‌రికృష్ణ, ఎన్టీఆర్ పాత్ర‌ల్ని ఏం చూపిస్తారు? ఒక‌వేళ హ‌రికృష్ణ పాత్ర‌ని చూపించాల్సిన అవ‌స‌రం వ‌స్తే… అందుకోసం వేరే న‌టుల్ని తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్టు స‌మాచారం. సో… ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మ‌రే నంద‌మూరి హీరో క‌నిపించే అవ‌కాశాలు లేవ‌న్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.