ఏపీకి గుడ్ న్యూస్ ..! “సాక్షి”కి మాత్రం కాదు..!!

మంగళవారం సాయంత్రం నుంచి .. తెలుగు, ఇంగ్లిష్ న్యూస్ చానళ్లలో హైలెట్ అయిన ఒకే ఒక్క వార్త “ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” ర్యాంకులు. ఒక్క బిజనెస్ చానళ్లు మాత్రమే.. కాదు.. జాతీయ మీడియా మొత్తం విస్త్రతంగా ఈ ర్యాంకుల వివరాల్ని హైలెట్ చేసింది. ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మొదటి స్థానం రావడంతో సహజంగానే ఏపీ మీడియాలోనూ హైలెట్ అయింది. విభజన తర్వాత పెద్దగా మౌలిక సదుపాయాలు లేని ఆంధ్రప్రదేశ్‌… నెంబర్ ర్యాంక్ ఎలా సాధించగలిగిందన్నదానిపై.. జాతీయ మీడియాలో చర్చలు కూడా నడిచాయి. ఓ రకంగా ఇది ఏపీకి చాలా మంచి వార్త. ప్రపంచవ్యాప్త పెట్టుబడులను ఆకర్షించే దిశగా ఓ గొప్ప ముందడుగు. అందుకే.. మీడియా కూడా హైలెట్ చేసింది.

కానీ.. తెలుగు రాష్ట్రాల్లో రెండో అత్యధిత సర్క్యులేషన్ ఉన్న దినపత్రిక “సాక్షి”కి మాత్రం ఇది అసలు వార్తలానే కనిపించలేదు. మొదటి పేజీలో కాదు.. కదా.. అసలు .. వార్త ఇవ్వడానికే ఆసక్తి చూపించలేదు. ఉదయమే సాక్షి పత్రిక చూసిన పాఠలకు ఇది విస్మయం కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగే ఏ వార్తనూ సాక్షి ప్రచురించదా ..? అన్న కోణంలో విమర్శలు కూడా ప్రారంభమయ్యాయి. ఏపీ ఎడిషన్‌లో ఇచ్చి తెలంగాణలో ఇస్తే.. మరొరకమైన విమర్శలు వస్తాయనుకున్నారేమో.. అక్కడా న్యూస్ ఐటమే లేకుండా చేశారు. తాము రాయకపోతే.. ఇక ఎవరికీ తెలియదన్నంత అమాయకత్వం చూపించారు.

సులభరతర వాణిజ్య ర్యాంకుల వార్తని సాక్షి పత్రిక పూర్తి స్థాయిలో విస్మరించడానికి… రాజకీయ కారణాలేనని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరిగిందని.. వార్తలు రాస్తే.. అది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరదని పత్రిక ఎడిటోరియల్ పెద్దలు నిర్ణయించి ఉంటారు. మద్దతిస్తున్న పార్టీకి మైలేజ్ రాదు… ప్రభుత్వానికి ప్రజల్లో పలుకుబడి పెరుగుతుందన్న ఉద్దేశంతో… వార్తలు ఎగ్గొట్టడం ఏ పత్రికా విలువలకు నిదర్శనమో మరి..?. ఆంధ్రకు మంచి జరిగే వార్తలకు సాక్షి ప్రాముఖ్యం ఇవ్వదని.. అదే… చెడు జరిగే వార్తలకు అయితే అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని సాక్షి పత్రికకపై ఇప్పటికే అనే విమర్శలు ఉన్నాయి. ఈ రోజు దినపత్రిక చూసిన వారికి.. ఇది నిజమే అనుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ మొదటి స్థానం సాధించి ఉంటే మాత్రం… కచ్చితంగా బ్యానర్ వార్త అయి ఉండేదన్న అంచనాలున్నాయి.

కొసమెరుపేమిటంటే… సాధారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రంగంలో అయినా విజయాలు సాధిస్తే.. దానిలో ఉన్న లోపాలను హైలెట్ చేసి… అదేమంత పెద్ద విషయం కాదని చెప్పేందుకు సాక్షి పత్రిక ప్రాధాన్యం ఇస్తుంది. కానీ ఈ సులభతర వాణిజ్య ర్యాంకుల విషయంలో ఆ ప్రయత్నం కూడా చేయలేదు. అసలు ర్యాంకు వచ్చినట్లు తమకు తెలియదన్నట్లుగా పక్కన పడేశారు. అంతకంతకూ ప్రజాదరణ కోల్పోతున్న సాక్షికి కచ్చితంగా ఇదో మైనస్ అవుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com