వంశీగారికి ప్రొడ్యూస‌ర్లు కావ‌లెను

వంశీ…. ఈయ‌న సినిమాలంటే ఓ ర‌క‌మైన క్రేజ్‌. ఏప్రిల్ 1 విడుద‌ల‌, లేడీస్ టైల‌ర్‌, చెట్టుకింద ప్లీడ‌ర్‌.. ఒక‌టా, రెండా?? మ్యూజిక‌ల్ హిట్స్ ఎన్నో తీశారు. అన్నీ… ఆహా, ఓహొ అనిపించే సినిమాలే. వంశీ స్టైల్‌కి సినీ ప్రేమికులు దాసోహం అన్నారు. అయితే.. వంశీ త‌న ట్రాక్ త‌ప్పి చాలా కాలమైంది. అదే ముత‌క కామెడీ, అదే టేకింగ్ తో బోర్ కొట్టించేస్తున్నారు. మొన్నొచ్చిన స‌న్నాఫ్ లేడీస్ టైల‌ర్ కూడా దారుణంగా డింకీ కొట్టేసింది. ఎంత‌గా అంటే… తొలి రోజునే థియేట‌ర్లో జ‌నాలు లేనంత‌. వంశీ మార్క్‌ని ఇష్ట‌ప‌డేవాళ్లు సైతం… వంశీ మ‌రీ అవుట్ డేటెడ్ అయిపోయాడ్రా.. అంటూ నొస‌లు చిట్లించాల్సివ‌చ్చింది.

అయితే ఫ్యాష‌న్ డిజైన‌ర్ మూడ్ లోంచి తొంద‌ర‌గానే బ‌య‌ట‌ప‌డిపోయాడు వంశీ. ఇప్పుడో థ్రిల్ల‌ర్ త‌యారు చేసుకొన్నాడు. స్టార్ ర‌చ‌యిత‌గా ఎదుగుతున్న‌ బుర్రా సాయిమాధ‌వ్ ఈ చిత్రానికి క‌థ‌, మాట‌లు అందిస్తున్నార‌ని తెలుస్తోంది. స్క్రిప్టు దాదాపుగా సిద్ధ‌మైంది. ఓ యంగ్ హీరో ఈ సినిమాలో న‌టించే అవ‌కాశాలున్నాయి. అయితే… నిర్మాత మాత్రం దొర‌క‌డం లేదట‌. ‘క‌థ బాగుంది.. చేద్దాం’ అన్న‌వాళ్లు కూడా ద‌ర్శ‌కుడు వంశీ అన‌గానే ఆలోచ‌న‌లో ప‌డుతున్నార్ట‌. అయితే ఈ క‌థ‌పై వంశీకి చాలా గురి కుదిరేసింది. స‌రిగా తీస్తే.. అన్వేష‌ణ అంత అందంగా ఉంటుంద‌ని ఆయ‌న భావిస్తున్నార్ట‌. మ‌రి ప్రొడ్యూస‌ర్ దొర‌కాలి క‌దా? వంశీలాంటి ద‌ర్శ‌కుల‌కు చూడండి.. ఎంత ఖ‌ర్మ ప‌ట్టిందో! హిట్టు లేక‌పోతే అంతే మ‌రి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.