సినిమా అంటే క్రియేటివిటీ మాత్రమే కాదు. లెక్కలు కూడా. ఈ సినిమా చేస్తే నాకేం వస్తుంది? అనే లెక్క ఎవ్వరైనా సరే, వేసుకోవాల్సిందే. అయితే కొన్నిసార్లు గుడ్డిగా `ఎస్` చెప్పేయాల్సివస్తుంది. దర్శకుడ్ని చూసో, హీరోని చూసో సినిమా ఒప్పేసుకొంటుంటారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటిస్తారా అని అడిగితే `నో` చెప్పేవాళ్లు ఎవరైనా ఉంటారా? రజనీకాంత్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో అయినా కనిపించాలని కోరుకొంటుంటారు. కాకపోతే ‘జైలర్ 2’ విషయంలో మాత్రం ఈ సీన్ రివర్స్ అవుతోంది.
రజనీకాంత్ – నెల్సన్ కాంబినేషన్ లో వచ్చిన ‘జైలర్’ సూపర్ డూపర్ హిట్టయ్యింది. కథ, కథనాలతో, గ్రిప్పింగ్ నేరేషన్ తో నెల్సన్ కట్టిపడేశాడు. దానికి తోడు గెస్ట్ ఎప్పీరియన్స్ లు కేక పెట్టించాయి. మోహన్ లాల్, శివరాజ్ కుమార్ ఎంట్రీ, వాళ్లకు ఇచ్చిన ఎలివేషన్లు రిపీట్ ఆడియన్స్ ని తీసుకొచ్చాయి. ఇప్పుడు ‘జైలర్ 2’ కోసం కూడా అదే పంథా కొనసాగించాలనుకొంటున్నాడు నెల్సన్. మోహన్ లాల్, శివరాజ్ కుమార్‌లతో పాటుగా మరికొంతమంది అతిథుల్ని తీసుకురావాలని గట్టిగా ప్లాన్ చేశాడు. అందుకోసం షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతిలను సంప్రదించాడు. షారుఖ్ ముందు ఓకే అన్నా, ఆ తరవాత అనివార్య కారణాల వల్ల డేట్లు ఎడ్జిస్ట్ చేయలేకపోయాడని సమాచారం. షారుఖ్ ఈ సినిమాలో కనిపించడం కష్టమే అన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. మరోవైపు విజయ్ సేతుపతి పరిస్థితి కూడా ఇంతే. అంతకు ముందు బాలకృష్ణని గెస్ట్ రోల్ కోసం అడిగారు. కానీ బాలయ్య ముందే ‘నో’ చెప్పేశాడు. టాలీవుడ్ నుంచి ఓ టాప్ హీరోని తీసుకోవాలన్నది నెల్సన్ ప్రయత్నం. కానీ అది నెరవేరడం లేదు. రజనీకాంత్ సినిమా, జైలర్ ఫ్రాంచైజీ అన్నా, చాలామంది హీరోలు గెస్ట్ రోల్ చేయడానికి వెనుకంజ వేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ‘జైలర్ 1’లో మోహన్ లాల్, శివన్నలకు ఇచ్చిన ఎలివేషన్లు చూసి కూడా ఎవ్వరూ కరడగం లేదు. పారితోషికాలకూ పడిపోవడం లేదు. దాంతో కొత్త గెస్టులు లేకుండానే ‘జైలర్ 2’ పూర్తి చేయాల్సిన పరిస్థితి వస్తుందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
