విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక ముందే వివాదాస్పదం అవుతున్నారు. విజయ్ తన వెంట కర్ణాటకకు చెందిన సినీ నిర్మాత కె.వి.ఎన్. వెంకట్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రానైట్ వ్యాపారి విష్ణురెడ్డిలను తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లడం తమిళ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తమిళుల ఆత్మగౌరవం గురించి మాట్లాడే విజయ్, ప్రభుత్వం ఏర్పాటు చేసే కీలక సమయంలో పొరుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలను ఎందుకు వెంటబెట్టుకెళ్లారన్నది ఇప్పుడు ప్రధాన రాజకీయ వివాదంగా మారింది.
కె.వి.ఎన్. వెంకట్ కర్ణాటకలో ప్రముఖ సినీ నిర్మాత మాత్రమే కాకుండా, రాజకీయ వ్యూహకర్తగా కూడా గుర్తింపు పొందారు. విజయ్ చివరి సినిమా జననాయగన్‌ను నిర్మిస్తున్నది కూడా ఈయనే. ఇక విష్ణురెడ్డి ఆంధ్రప్రదేశ్‌లో గ్రానైట్ , మైనింగ్ వ్యాపారాల్లో ఉన్నారు. వైఎస్ కుటుంబసభ్యులతో కలిసి కొన్ని కంపెనీల్లో డైరక్టర్‌గా ఉన్నారు. విజయ్ పార్టీకి అవసరమైన ఆర్థిక వనరుల సమీకరణలో వీరిద్దరూ కీలక పాత్ర పోషిస్తున్నారని, అందుకే విజయ్ వీరిని తన షాడో సలహాదారులుగా భావిస్తున్నారని తమిళ పత్రికలు విశ్లేషిస్తున్నాయి.
అందుకే తమిళనాడు ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాల వారు నడిపిస్తారా అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ తన వెంట రాజకీయ అనుభవం ఉన్న తమిళ నేతలను కాకుండా, పొరుగు రాష్ట్రాల వ్యాపారవేత్తలను గవర్నర్ వద్దకు తీసుకువెళ్లడం ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అధికారం కోసం ఇతర రాష్ట్రాల లాబీయిస్టులపై ఆధారపడుతున్నారా అంటూ అన్నాడీఎంకే, డీఎంకే నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వం కోసం చిన్న పార్టీలతో బేరసారాలు సాగించడంలో ఈ వ్యాపార ద్వయం వ్యూహకర్తలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాలు విజయ్ పట్ల సామాన్య ఓటర్లలో అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.
వెంకట్, విష్ణురెడ్డిల ప్రమేయం విజయ్ పార్టీపై ఒక ఔట్ సైడర్ ముద్ర వేసే ప్రమాదం ఉంది. . తమిళ రాజకీయాల్లో స్థానికతకు ఉండే ప్రాధాన్యత దృష్ట్యా, విజయ్ తన వ్యూహాలను మార్చుకోకపోతే అది ఆయనకే నష్టం చేకూర్చేలా ఉంది. ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాకముందే ఈ స్థాయిలో వివాదాలు ముసురుకోవడం, అందులోనూ ఇతర రాష్ట్రాల వ్యాపారవేత్తల పేర్లు వినిపించడం టీవీకే కేడర్‌లో కూడా అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ ఇద్దరు మిత్రులు విజయ్ను ముఖ్యమంత్రిని చేస్తారో లేక వివాదాల్లో చిక్కుకునేలా చేస్తారో వేచి చూడాలి.
